మధుమేహం, అధిక రక్తపోటు... ఈ రెండూ ప్రపంచంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యలు. మనదేశంలో కూడా హైబీపీ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఈ రక్తపోటు వల్ల రక్తనాళాలకు నష్టం కలగడంతో పాటు ప్రాణాంతకమైన గుండెపోటుకు కారణం అవుతుంది. అలాగే హైబీపీ వల్ల కళ్లకు కూడా సమస్య. కంటిలోని రెటీనాలో ఉండే సున్నితమైన రక్తనాళాలు అధిక రక్తపోటు వల్ల నష్టపోయే అవకాశం ఉంది.
శరీరంలో ముఖ్యమైన భాగాల్లో కళ్ళు కూడా ఒకటి. రక్తపోటు పెరిగినప్పుడు కంటికి ఆక్సిజన్‌ను, పోషకాలను సరఫరా చేసే సన్నని రక్తనాళాలు దెబ్బతింటాయి. ఇలా దీర్ఘకాలం పాటు సాగితే కంటిచూపుకే ప్రమాదం. అందుకే హై బీపీని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలని చెబుతున్నారు వైద్యులు. లేకుంటే రకరకాల కంటి సమస్యలు హైబీపీ కారణంగా వచ్చే అవకాశం ఉంది. హై బీపీ వల్ల కంటికి వచ్చే కొన్ని రకాల సమస్యలు ఇవిగో.
రెటినోపతి
ఇది రెటీనాలోని రక్తనాళాలు కంటి వెనుక భాగంలో ఉండే కాంతిని స్వీకరించే సెన్సిటివ్ కణజాలాలను దెబ్బతీసే పరిస్థితి. దీని వల్ల అంధత్వం వచ్చే అవకాశం కూడా ఎక్కువ.
ఆప్టిక్ న్యూరోపతి
అధిక రక్తపోటు వల్ల కంటి నుండి మెదడుకు దృశ్యమాన సమాచారాన్ని ప్రసారం చేసే ముఖ్యమైన ఆప్టిక్ నాడి కూడా దెబ్బతింటుంది. ఆప్టిక్ నరాలు దెబ్బతింటే కంటి చూపు మందగిస్తుంది.
హైపర్టెన్సివ్ రెటినోపతి
అధిక రక్తపోటు రెటీనాలోని రక్తనాళాల్లో ఎన్నో మార్పులకు కారణం అవుతుంది. ఆ రక్తనాళాలు సంకోచించడం, రక్తస్రావం కావడం, వాపు రావడం వంటివి జరుగుతాయి. ఈ మార్పులు కంటి చూపు పై ప్రభావాన్ని చూపిస్తాయి.
కేంద్ర దృష్టి ప్రభావితం అవుతుంది. దీని వల్ల చదవడం, డ్రైవ్ చేయడం, రోజువారి కార్యకలాపాలు చేయడం కష్టతరంగా మారుతుంది.
కంటి ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి
అధిక రక్తపోటు వల్ల కంటికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హైబీపీ మాత్రలు రోజూ వేసుకోవాలి. కొంతమంది హైబీపీ కాస్త అదుపులోకి రాగానే వేసుకోవడం మానేస్తారు. ఇలా చేయడం వల్ల మళ్లీ బీపీ అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి వైద్యులు ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడాలి.
అలాగే స్క్రీన్ చూసే సమయాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల కంటిపై ఒత్తిడి, అలసట పడుతుంది. స్క్రీన్ ను దగ్గర నుంచి కాకుండా కొంచెం దూరం నుంచి చూడాలి.
సూర్యుడు నుంచి వచ్చే UV కిరణాలు కళ్ళకు హానికరం కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ తప్పకుండా ధరించండి.
తాజా పండ్లు, కూరగాయలు వంటివి కంటి ఆరోగ్యం కోసం తినాలి. ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు నిండిన ఆహారం తినడం చాలా ముఖ్యం. అలాగే విటమిన్ A నిండిన ఆహారం కూడా కంటి ఆరోగ్యానికి కీలకం.
ధూమపానం చేసే అలవాటు ఉంటే మానేయండి. వీటివల్ల కంటి శుక్లాలు, ఆప్టిక్ నరాలు దెబ్బ తినడం వంటి సమస్యలు వస్తాయి.
Also read: మామిడి పండ్లను తినేముందు కాసేపు నీళ్లలో నానబెట్టాలా? అలా చేయడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.