Metformin  Direct Impact on Brain :  ప్రపంచవ్యాప్తంగా టైప్-2 డయాబెటిస్ చికిత్సలో అత్యధికంగా వాడే ఔషధం  మెట్‌ఫార్మిన్  . గత 60 ఏళ్లుగా ఈ మందు కేవలం కాలేయం,  పేగుల మీద మాత్రమే   పని చేస్తోందని వైద్య ప్రపంచం భావించింది. కానీ, తాజాగా జరిగిన ఒక సంచలన పరిశోధన మెట్‌ఫార్మిన్ గురించి మన అవగాహనను పూర్తిగా మార్చివేసింది. బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ (Baylor College of Medicine) శాస్త్రవేత్తలు జరిపిన ఈ అధ్యయనం, ఈ మందు నేరుగా మెదడుపై ప్రభావం చూపుతూ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని వెల్లడించింది.   మెదడులో దాగి ఉన్న రహస్య మార్గం 

Continues below advertisement

సాధారణంగా డయాబెటిస్ మందులు కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా పనిచేస్తాయి. అయితే, మెట్‌ఫార్మిన్ నేరుగా మెదడులోని  హైపోథాలమస్   అనే భాగానికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మెదడులోని ఈ భాగం మన శరీరంలో శక్తి,  గ్లూకోజ్ జీవక్రియలను నియంత్రిస్తుంది. అక్కడ  Rap1  అనే ప్రోటీన్‌ను ఈ మందు అదుపు చేయడం ద్వారా చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని ఈ పరిశోధనలో తేలింది.

 అతి తక్కువ మోతాదుతోనే అద్భుత ఫలితం 

Continues below advertisement

ఈ అధ్యయనంలో భాగంగా ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. మెట్‌ఫార్మిన్‌ను నేరుగా మెదడులోకి ఇంజెక్ట్ చేసినప్పుడు, నోటి ద్వారా ఇచ్చే మోతాదు కంటే వేల రెట్లు తక్కువ మొత్తంలోనే రక్తంలోని చక్కెర స్థాయిలు గణనీయంగా తగ్గాయి. కాలేయం లేదా ప్రేగుల మీద పనిచేయడానికి ఈ మందుకు ఎక్కువ మోతాదు అవసరం కాగా, మెదడు మాత్రం చాలా తక్కువ మోతాదుకే స్పందిస్తుందని శాస్త్రవేత్తలు గమనించారు. 

 వయసును వెనక్కి నెట్టే గుణం 

మెట్‌ఫార్మిన్ కేవలం చక్కెరను తగ్గించడమే కాకుండా, మెదడు కణాలు ముసలిబారిపోకుండా  కాపాడుతుందని ఈ స్టడీ పేర్కొంది. ఇది మెదడులో వాపును తగ్గించి, జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధుల చికిత్సలో కూడా ఈ కనుగొనడం భవిష్యత్తులో మైలురాయిగా మారనుంది.  

 కొత్త రకం చికిత్సలకు చాన్స్  ఈ ఆవిష్కరణ మెట్‌ఫార్మిన్ గురించి మా ఆలోచనా విధానాన్ని మార్చేసింది  అని పరిశోధకులు చెబుతున్నారు. మెదడులోని ఈ నిర్దిష్ట మార్గాన్ని  లక్ష్యంగా చేసుకుని మరిన్ని శక్తివంతమైన,  సురక్షితమైన మందులను తయారు చేయడానికి ఈ అధ్యయనం దోహదపడనుంది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి మెట్‌ఫార్మిన్ ఎందుకు అంత సమర్థవంతంగా పనిచేస్తుందో 60 ఏళ్ల తర్వాత ఇప్పుడు పూర్తి వివరణ లభించినట్లయిందని చెబుతున్నారు.