కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇటీవల వరుసగా కేసులు తగ్గినట్లు కనిపించినా మళ్లీ రోజువారి కేసులు 40 వేలకు పైనే నమోదవుతున్నాయి. కొత్తగా 44,643 కేసులు నమోదుకాగా 464 మంది మృతి చెందారు. 41,096 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 97.36%గా ఉంది.



  1. యాక్టివ్ కేసులు: 4,14,159

  2. మొత్తం రికవరీలు: 3,10,15,844

  3. మొత్తం వ్యాక్సినేషన్: 49,53,27,595


దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 4,14,159కి చేరాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.30%గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 5% కన్నా తక్కువే ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 2.72 శాతంగా నమోదైంది.






దేశవ్యాప్తంగా 49 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. గత 24 గంటల్లో 50.29 లక్షల (50,29,573) కొవిడ్ డోసులు పంపిణీ చేశారు. 


కొవిడ్ తో గుండెకు ముప్పు..


మానసికంగా ఆరోగ్యంగా లేకపోతే ఆరోగ్యానికి పెనుముప్పు వాటిల్లే అవకాశం ఉంది. కొవిడ్ పాజిటివ్ వచ్చిన రెండు వారాల సమయంలో గుండె పోటు వచ్చే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ది లాన్సెట్ అనే అంతర్జాతీయ జర్నల్ ఈ అధ్యయన వివరాలను వెల్లడించింది.


స్వీడన్‌లోని ఉమెయా యూనివర్సిటీ పరిశోధకులు కొవిడ్ కారణంగా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను తెలుసుకునేందుకు ఈ అధ్యయనం చేపట్టారు. 2020 ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్ 14 మధ్య కాలంలో నమోదైన కొవిడ్ కేసుల వివరాలను పరిశీలించారు. దీని కోసం పూర్తి ఆరోగ్యంగా ఉన్న 3,48,481 మందిని, కోవిడ్ పాజిటివ్ వచ్చిన 86,742 మంది ఆరోగ్య వివరాలపై పరిశోధన జరిపారు. 


అధ్యయనంలో భాగంగా స్వీడన్ పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ, స్టాటిస్టిక్స్ స్వీడన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ సంస్థల నుంచి కొవిడ్ రోగుల సమాచారాన్ని సేకరించారు. గతంలో గుండె పోటు వచ్చిన వారి వివరాలను ఈ జాబితా నుంచి తొలగించారు. ఈ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా కొవిడ్ పాజిటివ్ వచ్చినవారికి గుండె పోటు ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీని పరిగణలోకి తీసుకుని అధ్యయన ఫలితాలను వెల్లడించారు. 


కొవిడ్ సోకిన వారిలో మొదటి రెండు వారాల్లో గుండె పోటు వచ్చే అవకాశాలు మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు కనుగొన్నామని.. అధ్యయనం నిర్వహించిన పరిశోధకుల్లో ఒకరైన ఓస్వాల్డో ఫాన్‌సికా వెల్లడించారు. పరిశోధనలో పాల్గొన్న వారి వయసు, జెండర్, సామాజిక ఆర్థిక పరిస్థితులు, వారికి గతంలో ఏమైనా అనారోగ్యం ఉందా అనే అంశాలను పరిగణలోకి తీసుకున్నా కూడా ఇవే ఫలితాలు వచ్చాయని తెలిపారు.