ఆధునిక కాలంలో మానసిక ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఎంతో మందిలో ఒత్తిడి, ఆందోళన పెరిగిపోతున్నాయి. వీటిని తగ్గించే ఆహారాలను, వ్యాయామాలను చేయడం ద్వారా మానసిక స్థితిని మెరుగుపరచుకోవచ్చు. నారింజ పండ్లు మానసిక ఆరోగ్యం పై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. తియ్యగా, పుల్ల పుల్లగా ఉండే నారింజను తినడం వల్ల వెంటనే మానసిక స్థితి మారుతుందని, ఆందోళన తగ్గుతుందని చెబుతున్నారు. 


నారింజ పండ్లను తినడం వల్ల సహజంగానే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు నిండుగా ఉంటాయి. ఇవి కణాల పునరుత్పత్తిని మెరుగుపరుస్తాయి. అలాగే జలుబు, ఫ్లూ వంటి రోగాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఈ పండులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందుకే నారింజను రోజూ తినమని సిఫారసు చేస్తారు వైద్యులు.


నారింజ పండులోని పోషకాలు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఒత్తిడి స్థిరంగా కలగడం వల్ల, ఆందోళన రావడం వల్ల శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీరంలోని ముఖ్యమైన జీవక్రియల పనితీరును మారుస్తాయి. దీనివల్ల బరువు పెరగడం, తలనొప్పి రావడం, హై బీపీ, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వంటివి జరుగుతాయి. కాబట్టి ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. రోజూ నారింజ పండ్లను తీసుకోవడం వల్ల శారీరకంగానే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. 


నారింజ ఎలా సహాయపడుతుంది?
నారింజ తొక్కను చిదిమి వాసన చూడండి, దాన్నుంచి సిట్రస్ ఫ్లేవర్ వస్తుంది. ఆ వాసన  పీల్చుతుంటేనే ఏదో తెలియని అనుభూతి. ఈ సిట్రస్ ఫ్లేవర్ స్వచ్ఛమైన గాలిలో కలిసి తక్షణమే మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాగే సెరోటోనిన్ స్థాయిలను పెంచడం ద్వారా సహజంగా ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి ప్రయత్నిస్తుంది.  తాజా నారింజపండును రోజూ తినడం వల్ల మెదడు కణాలు పునరుత్పత్తి మెరుగ్గా జరుగుతుంది. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంతో పాటు అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది. కాబట్టి మీకు తీవ్రమైన ఒత్తిడి లేదా ఆందోళన అనిపిస్తున్నప్పుడు నారింజపండును తినడం లేదా నారింజపండు రసాన్ని తాగడం ద్వారా కార్టిసాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. ఆనంద హార్మోనైన సెరిటోనిన్ స్ఠాయిలను పెంచుకోవచ్చు.  నారింజ తినడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చర్మం కాంతివంతంగా మారి అందాన్ని పెంచుతుంది. రోజుకో నారింజ పండు తింటే చాలు చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుంది.



Also read: జుట్టు అధికంగా రాలిపోతుందా? దానికి కారణాలు ఇవే, ఈ నూనెలు వాడితే బెటర్


































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.