జుట్టు రాలడం అనేది జుట్టు పెరుగుదల ప్రక్రియలో ఒక భాగం. రోజూ ప్రతి ఒక్కరూ ఎంతో కొంత జుట్టును కోల్పోతూ ఉంటారు. ఎంత జుట్టు కోల్పోతారు అన్నది, వ్యక్తి నుండి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది. అయితే కొందరిలో మాత్రం జుట్టు రాలడం అనేది చివరకు బట్టతలగా మారిపోతుంది. జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో బట్టతల రావడానికి కూడా ఆస్కారం ఉన్న కారణాలు ఇవన్నీ.


1. జుట్టు రాలడం అనేది జన్యుపరమైన కారకాల వల్ల కూడా అవుతుంది. కుటుంబంలో బట్టతల ఉన్నవారు ఉంటే వారసత్వంగా వారి కొడుకులు, మనవళ్లకు కూడా బట్టతల వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే జుట్టు అధికంగా రాలిపోయి బట్టతలగా మారిపోతుంది.


2. వయసు పెరిగే కొద్దీ జుట్టు రాలడం సహజం. కొంతమందికి వయసు పెరిగే కొద్దీ జుట్టు 60 శాతానికి పైగా రాలిపోయి బట్టతలలా కనిపిస్తుంది.


3. హార్మోన్లలో మార్పులు వల్ల కూడా జుట్టు పెరుగుదల లేదా జుట్టు రాలిపోవడం అధికంగా జరుగుతుంది. ఉదాహరణకు ఈస్ట్రోజన్ స్థాయిలో మార్పులు వస్తే మహిళలు గర్భధారణ సమయంలో లేదా నెలసరి సమయంలో ఎక్కువ జుట్టు రాలడాన్ని ఎదుర్కొంటారు. 


4. ఒత్తిడి కారణంగా  జుట్టు రాలిపోయే అవకాశం ఎక్కువ. వెంట్రుకల పెరుగుదల చక్రానికి ఒత్తిడి అంతరాయం కలిగిస్తుంది.


5. పోషకాహార లోపం వల్ల వెంట్రుకలు అధికంగా రాలిపోయే అవకాశం ఉంది. ఆహారంలో జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు లేకపోతే అది వెంట్రుకల పెరుగుదలపై ప్రభావం చూపుతాయి. చివరికి అవి రాలిపోతాయి.


6. కొంతమంది జుట్టును స్టైల్ చేసుకోవడం కోసం కఠినమైన రసాయనాలను వాడతారు. అవి జుట్టు మొదలు నుంచి పాడుచేస్తాయి. తద్వారా ఆ వెంట్రుకలు రాలిపోతాయి.


7. మీకు జుట్టు అధికంగా రాలుతున్నట్టు అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి. తగిన చికిత్స విధానాలపై దృష్టి పెట్టండి. అది బట్టతల లేక పోషకాహార లోపమా తెలుసుకోండి. కొన్ని రకాల నూనెలు వాడడం వల్ల జుట్టు పెరుగుదలను పెంచుకోవచ్చు.


ఆర్గాన్ ఆయిల్
విటమిన్ E, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఈ నూనెను తలకు పట్టించడం వల్ల వెంట్రుకలు దెబ్బతినకుండా ఉంటాయి. వాటికి పోషణ ఇచ్చినట్టు కూడా అవుతుంది.


ఆలివ్ ఆయిల్
ఇది కాస్త ఖరీదైనది. కానీ జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ A, విటమిన్ E కూడా ఉంటాయి. ఇవి వెంట్రుకలు డామేజ్ కాకుండా కాపాడతాయి. అలాగే పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.


జోజోబా ఆయిల్
తలపై ఉన్న మాడు సహజ నూనెలను ఉత్పత్తి చేస్తుంది. ఈ సహజ నూనెలు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాయి. జోజోబా ఆయిల్ మాడుకు పట్టించడం వల్ల అక్కడ ఆయిల్ ఉత్పత్తిని సమతుల్యం చేయడంలో ఇది సహాయపడుతుంది. దీనివల్ల ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదల సాధ్యమవుతుంది.


బాదం నూనె
బాదంపప్పుతో చేసే ఈ నూనెలో విటమిన్ E, విటమిన్ D సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టును రక్షిస్తాయి. వెంట్రుకలకు బలాన్ని అందిస్తాయి.


రోజ్మేరీ ఆయిల్
ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికం. ఇది మాడు ఆరోగ్యాన్ని కాపాడడంలో ముందుంటుంది. 




Also read: రోగాలు రాకుండా ఉండాలంటే పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయాలి
































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.