మన శరీరంలో మూత్రపిండాలు ముఖ్యమైన అవయవాలు. మనం తినే ఆహారంలో వ్యర్ధాలను ఫిల్టర్ చేసే ప్రధానమైన పని వాటిదే. అలాంటిది ఆ కిడ్నీలకే సమస్య వస్తే వెంటనే తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే పరిస్థితి ముదిరిపోతుంది. కిడ్నీ స్టోన్స్ అనేది ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి వయసుతో సంబంధం లేదు. ఇది పిల్లలను పెద్దలను కూడా ప్రభావితం చేస్తుంది. కిడ్నీలో స్టోన్స్ ఏర్పడిన వెంటనే మొదట చాలా చిన్న సైజులో ఉంటాయి. వాటి పరిమాణం పెరిగే కొద్దీ ఆరోగ్యం దిగజారుతుంది. కాబట్టి మూత్రపిండాల్లో రాళ్లు చాలా చిన్న సైజులో ఉన్నప్పుడే వాటిని గుర్తించి చికిత్స తీసుకుంటే సమస్య త్వరగా పోతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నాయని తెలుసుకోవడం ఎలా? మూత్రపిండాల్లో రాళ్లు చేరగానే చిన్న చిన్న సంకేతాలు,లక్షణాలు కనిపిస్తాయి. అవి ఎలా ఉంటాయంటే....


1. పొత్తికడుపులో నొప్పిగా అనిపిస్తుంది. 
2. మూత్రపిండాలు ఉండే వెనుక భాగంలో ఆకస్మికంగా నొప్పి వచ్చి పోవడం జరుగుతుంది 
3. మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పిగా లేదా మంటగా అనిపిస్తుంది. 
4. మూత్రం రంగు కూడా మారుతుంది. గులాబీ రంగులో లేదా ఎరుపు రంగులో మారుతుంది.
5. వికారంగా అనిపించడం వాంతులు అవ్వడం జరుగుతుంది. 
6. ఆకస్మికంగా జ్వరం వచ్చి పోతుంది. 
ఈ లక్షణాలు కనిపించినప్పుడు తేలిగ్గా తీసుకోకుండా ఒకసారి వైద్యుల్ని సంప్రదిస్తే మంచిది. కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వెంటనే ఎలాంటి లక్షణాలను చూపించవు. అవి మూత్ర నాళంలోకి వెళ్లడం మొదలయ్యాక లక్షణాలు ఒక్కొక్కటి బయటపడతాయి. రాళ్లు మరీ చిన్నవిగా ఉంటే ఎలాంటి నొప్పి పెట్టకుండా మూత్రం నుంచి బయటకు పోతాయి. ఎప్పుడైతే రాళ్లు పెద్దవిగా మారుతాయో అప్పుడు నొప్పి, ఇతర లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. 


ఎవరికి వచ్చే అవకాశం ఉంది?
కిడ్నలో రాళ్లు ఎవరికైనా, ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే ఉప్పు అధికంగా తీసుకుని, తగినంత నీరు తాగకుండా ఉంటారో, వాళ్ళల్లో ఈ రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ. ద్రవపదార్థాలు తక్కువగా తీసుకునే వారిలో కిడ్నీ స్టోన్స్ త్వరగా ఏర్పడతాయి. అలాగే ఊబకాయం జీవక్రియ రుగ్మతలు మధుమేహం వంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్న వారిలో కూడా ఈ స్టోన్స్ ఏర్పడుతాయి. 


చికిత్స ఎలా?
కిడ్నీ స్టోన్స్ పరిమాణాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. అవి చాలా చిన్నగా ఉంటే కొన్ని మందుల ద్వారా ఆ రాళ్ళను మూత్రం ద్వారా బయటికి వచ్చేట్టు చేస్తారు. అలాగే ఉప్పు, సోడాలను తగ్గించాలని చెబుతారు. నీళ్లు అధికంగా తాగితే మూత్రం ద్వారా ఆ చిన్న రాళ్లు బయటికి వచ్చేస్తాయి. రాళ్లు మూత్రం ద్వారా వచ్చేందుకు వీలు లేనంత పెద్ద సైజులో ఉంటే వాళ్లకి సస్త్ర చికిత్సలు అవసరం పడతాయి. ఆ శస్త్ర చికిత్సలో వైద్యులు రాళ్ళని చిన్న చిన్న ముక్కలుగా చేసి, మూత్రం ద్వారా పోయేలా చేస్తారు.


స్టోన్స్ ఏర్పడకుండా ఉండాలంటే..
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి .ముఖ్యంగా రోజులో ద్రవపదార్థాలు అధికంగా తీసుకోవాలి. బరువు అధికంగా పెరగకుండా ఉండాలి. యాపిల్స్, ద్రాక్ష వంటి పళ్ళు అధికంగా తీసుకోవాలి. ఆకుకూరలు అధికంగా తినాలి. 


Also read: మొటిమల కారణంగా చెంపలపై పడిన గుంతలు పోతాయా? ఎలాంటి చికిత్సలు ఉన్నాయి?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.