HPV Vaccine : భారత్‌లో మహిళలకు సంబంధించి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ అత్యంత ఆందోళనకరమైన సమస్య. 15 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు గల భారతీయ మహిళల్లో అత్యధికంగా కనిపిస్తున్న రెండో క్యాన్సర్ రకం ఇదే. డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం ప్రతీ ఏటా భారత దేశంలో సుమారు లక్షమందికిపైగా మహిళలు ఈ వ్యాధి భారిన పడుతున్నారు. ఇందులో యాభై వేల మందికిపైగా మహిళలు ఈ వ్యాధితో మరణిస్తున్నారు. గర్భాశయం కింది భాగం, యోనితో కలిసే చోటును సర్వీక్స్ అంటారు. ఇక్కడ వచ్చే క్యాన్సర్‌ సాధారంగా 30 ఏళ్లు పైబడిన మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. 

ఈ క్యాన్స్‌కు కారణం ఏంటీ? 

గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్‌ రావడానికి ప్రధాన కారణం హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్ ఇన్ఫెక్షన్. ప్రపంచవ్యాప్తంగా 95 శాతానికిపైగా గర్భాశయ క్యాన్సర్‌ కేసులు లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే హెచ్‌పీవీ వైరస్‌ వల్లనే వస్తున్నాయి. ఈ వ్యాధి భారినపడుతున్న మహిళల్లో 90 శాతం మంది అల్ప, మధ్య ఆదాయ దేశాలకు చెందిన వారే. 

హెచ్‌పీవీ రకాలు- వ్యాప్తి

హెచ్‌పీవీ అనేది 200 కంటే ఎక్కువ వైరస్‌ల సమూహం. వీటిలో 40 రకాల వైరస్‌లు నేరుగా లేంగిక సంబందాల ద్వారా వ్యాపిస్తాయి. హెచ్‌పీవీలో కొన్ని రకాలు జననేంద్రియ మొటిమలను కలిగిస్తే, మరికొన్ని రకాలు క్యాన్సర్‌కు దారితీస్తాయి. కేవలం గర్భాశయ క్యాన్సర్‌కే కాకుండా ఈ వైరస్‌ గొంతు, యోని, పురుషాంగం, మలద్వార క్యాన్సర్లకు కూడా కారణం కావచ్చు. ముఖ్యంగా హెచ్‌పీవీ 16, 18 రకాలు 70శాతం గర్భాశయ క్యాన్సర్లకు ప్రధాన కారకాలు. అదనంగా 31, 33, 45, 52, 58 రకాలు మరో పది నుంచి 20 శాతం క్యాన్సర్‌ కేసులకు కారణమవుతాయి. 

నివారణ మార్గాలు- 

గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి అత్యంత ప్రభావంతమైన మార్గం టీకా వేయించుకోవడం. మార్కెట్‌లో చాలా రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా టీకాలు వేయిస్తోంది. ఆ పైవారు కావాలంటే ఆసుపత్రికి వెళ్లి అడిగితే టీకా వేస్తారు.  వైరస్‌ బారిన పడక ముందే ఈ టీకాలు తీసుకోవడం వల్ల దాదాపు అన్ని రకాల గర్భాశయ క్యాన్సర్లు నివారించవచ్చు. 

టీకా ఎలా పని చేస్తుంది?

ఈ టీకాలో ఎల్‌ ప్రోటీన్ ద్వారా తయారైన వైసర్ ‌లైక్ పార్టికల్స్ ఉంటాయి. ఇవి వైరస్‌ను పోలి ఉంటాయి. కానీ ఇన్ఫెక్షన్‌ కలిగించవు. ఇవి శరీరంలోకి ప్రవేశించినప్పుడు రోగ నిరోధక శక్తిని ప్రేరేపించి, అసలైన వైరస్‌ వచ్చినప్పుడు దాడి చేస్తాయి. ఆ విధంగా బాడీని రక్షిస్తాయి. 

14 ఏళ్ల దాటిన మహిళలు వేసుకోవచ్చా?

దేశవ్యాప్తంగా శనివారం నుంచి HPV వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా బాలికలకు అందిస్తోంది. గర్భాశయ క్యాన్సర్ నివారించేందుకు ఈ డ్రైవ్ చేపట్టింది. మొదటి దశలో 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు ఉచితంగా వ్యాక్సిన్ వేస్తారు. అయితే ఇప్పుడు ఈ వ్యాక్సిన్ 14 ఏళ్లు దాటిన మహిళలు కూడా వేసుకోవచ్చా అనే అనుమానం చాలా మందిలో కలుగుతోంది. దీనికి వైద్యులు అవును అని సమాధానం చెబుతున్నారు. HPV వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. 45 ఏళ్లు వచ్చే వరకు మహిళలు ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. 

పురుషులకు అవసరమా

పురుషులు కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవచ్చు. పురుషుల టీకా తీసుకోవడం వల్ల వారు వైరస్ వాహకాలుగా మారకుండా ఉంటారు. తద్వారా మహిళలకు వైరస్ సోకే ప్రమాదం తగ్గుతుంది. 
 
HPV వ్యాక్సిన్ అత్యంత సాధారణ దుష్ప్రభావాలు ఇంజెక్షన్ సైట్ వద్ద నొప్పి, వాపు లేదా దద్దుర్లు మాత్రమే. ఇంజెక్షన్ తర్వాత కొన్నిసార్లు మైకం రావచ్చు. అంటే వ్యక్తి నీరసంగా ఉంటే ఇలాంటి జరగొచ్చు. అందుకే ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత 15 నిమిషాలు కూర్చుని ఉండటం మంచిది. మరికొందరికి తలనొప్పి, వికారం, వాంతులు, అలసట లేదా బలహీనంగా అనిపించవచ్చు. 

HPV వ్యాక్సిన్ ఎవరు వేయించుకోకూడదు?

గర్భధారణ సమయంలో HPV వ్యాక్సిన్ సిఫార్సు చేయరు. ఒక వ్యక్తి గతంలో HPV టీకా వేసుకున్న తర్వాత అలెర్జీ బారిన పడితే వారు టీకాకు దూరంగా ఉండాలి. మైల్డ్‌ లేదా తీవ్రంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు HPV టీకా తీసుకోవద్దు. వారు పూర్తిగా కోలుకున్న తర్వాత టీకా వేసుకుంటే మంచిది.