కరోనా వచ్చాక రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం కోసం వెతుకులాట ఎక్కువైంది. పోషకాలుండే ఆకుకూరలు, గుడ్లు, తాజా పండ్లు తినడం పెరిగింది. నిజానికి వీటన్నింటి కన్నా అధిక మోతాదులో రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం మునగాకులు. పూర్వం మునగాకుల్ని ఆహారంగా ఉపయోగించేవారు. ఇప్పుడు మాత్రం కేవలం మునగకాడల్ని మాత్రమే ఉపయోగిస్తున్నాం. మునగాకులు మనకు చేసే మేలు తెలిస్తే వాటిని కూడా తినడం ప్రారంభిస్తారు. 


మునగాకులను  ఔషధాల తయారీలో అయిదు వేల ఏళ్ల క్రితం నుంచే ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో దాదాపు 300 రకాల మందులలో మునగాకుల పొడిని వాడుతున్నారంటే అర్థం చేసుకోండి వాటిలో ఉన్న ఔషధ గుణాలు ఎంత మేలు చేస్తాయో. పిల్లల్లో పోషకాహారలోపాన్ని అతి త్వరగా సవరించడంలో మునగాకుల పొడి ముందుంటుంది. ఎందుకంటే ఇందులో పాలల్లో కన్నా17 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. అలాగే క్యారెట్లలో కన్నా పది రెట్లు అధికంగా ఏ విటమిన్, నారింజలో కన్నా ఏడు రెట్లు విటమిన్ సి, పాలకూరలో ఉన్న దాని కన్నా పాతిక రెట్లు ఐరన్, పెరుగులో కన్నా తొమ్మిది రెట్లు అధికంగా ప్రోటీన్ లభిస్తుంది. 


చంటి బిడ్డల తల్లులు మునగాకు పప్పు లేదా కూరని తిన్నా, పొడి చేసుకుని అన్నంలో కలుపుకుని తిన్నా చాలు, తల్లి పాల ద్వారా ఈ పోషకాలన్నీ బిడ్డకు చేరుతాయి. ఏడాది నిండిన పిల్లలకు బాగా మెత్తగా ఉడకబెట్టిన మునగాకులను పేస్టులా చేసి తినిపించొచ్చు. 


టీనేజీ అమ్మాయిలకు మునగాకు ఆహారం పెడితే అందం ఇనుమడిస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా నిగనిగలాడుతాయి. ఇందులో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి కనుక మొటిమలు, దద్దుర్లు వంటివి ముఖంపై రాకుండా అడ్డుకుంటుంది.  చాలా కాస్మెటిక్ ఉత్పత్తుల్లో మునగాకులను ఉపయోగిస్తారు. జుట్టు చివర్లు చిట్లకుండా కాపాడడంలో మునగాకులోని పోషకాలు ముందుంటాయి. 


బరువు తగ్గేందుకు: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారికి మునగాకు మంచి ఎంపిక. ఇది శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. అంతేకాదు శరీరంలోని శక్తి నిల్వలు తగ్గకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీవక్రియను పెంచి, తరచూ ఆహారం తినాలన్న కోరికను తగ్గిస్తుంది. కనుక ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు తగ్గొచ్చు. రోజూ ఒక పూట ఆహారంలో మునగాకులను తింటే మంచి ఫలితాలు ఉంటాయి. 


కాస్త వెగటుగా ఉన్నా..: మిగతా ఆకుకూరల్లా కాకుండా మునగాకుల రుచి కాస్త వెగటుగా ఉంటుంది. అందుకేనేమో ఇది పెద్దగా వాడుకలో లేదు. కానీ రుచి విషయంలో సర్దుకుపోతే... చక్కనైనాన ఆరోగ్యం, అందం మీ సొంతమవుతుంది. మిగతా ఆకుకూరల్లాగే దీన్ని పప్పులో వేసి వండుకోవచ్చు, లేదా కరివేపాకు పొడి చేసినట్టే దీన్ని పొడి చేసుకోవచ్చు. 


ఔషదాల గని: మన శరీరంలోని చాలా రుగ్మతలకు మునగాకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. దెబ్బలు తగిలిన చోట మునగాకును నూరి ఆ పేస్టును రాసి కట్టు కట్టేస్తే త్వరగా మానిపోతాయి. మునగాకు రసాన్ని తాగితే రేచీకటి పోతుంది. మునగాకు రసాన్ని రోజు తాగితే గుండె, కాలేయం, మూత్రపిండాల్లోని సమస్యలు తొలగిపోతాయి. మహిళల్లో కనిపించే రక్త హీనత సమస్యకు మునగాకు చెక్ పెడుతుంది.  కాబట్టి మీ ఇంటి వంటలో మునగాకులో భాగం చేయండి.