చాలామందికి క్యాబేజీ అంటే ఇష్టం ఉండదు. దాన్ని చూడగానే ముఖం చిట్లిస్తారు. కానీ, ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో నూడుల్స్‌తోపాటు క్యాబేజీ తినేందుకు మాత్రం పెద్దగా మొహమాట పడరు. అయితే, ఇంట్లో కూడా మీరు క్యాబేజీని తింటూ ఉండాలి. లేకపోతే.. మీ శరీరానికి ఎంతో ముఖ్యమైన పోషకాలు అందవు. మరి అవేంటో చూసేయండి. 


క్యాబేజీలో బోలెన్ని ప్రోటిన్స్ ఉంటాయి. అయోడిన్, పొటాషియం, ఫైబర్, ఐరన్, విటమిన్-C, విటమిన్-K, వంటి వివిధ రకాల పోషకాలకు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. క్యాబేజీ.. 'క్రూసిఫెరా' అనే కుటుంబానికి చెందినది. బ్రకోలీ, కాలీఫ్లవర్, కాలే కూడా ఈ కుటుంబానికి చెందినవే. క్యాబేజీ రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా జీర్ణ శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. అందుకే, వారంలో ఒక్కసారైనా క్యాబేజీని భోజనంలో చేర్చుకోండి. 


చలి కాలంలో క్యాబేజీ తినడం వల్ల మధుమేహం, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించవచ్చు. ఎముకలు బలంగా ఉండాలన్నా.. చర్మం కాంతివంతంగా మెరవాలన్నా.. క్యాబేజీ తినడం చాలా ముఖ్యం. అంతేకాదు, కంటి చూపుకు కూడా క్యాబేజీ చాలా మంచిది. కాబట్టి, మీ పిల్లలకు కూడా క్యాబేజీ అలవాటు చేయండి. వద్దన్నా సరే.. మంచి మాటలు చెప్పైనా తినిపించేయండి. లేకపోతే.. నూడుల్స్‌లో ఉల్లిపాయలతోపాటు క్యాబేజీని కూడా చేర్చి తినేలా చేయండి. 


క్యాబేజీని ఎందుకు తినాలి అంటే..


క్యాన్సర్‌ను నిరోధిస్తుంది: సహజంగా క్యాబేజీకి చేదు స్వభావాన్ని అందించే సల్ఫర్ లేదా సల్ఫోరఫేన్ కాన్సర్‌తో పోరాడుతుంది. శరీరంలోని క్యాన్సర్ కణాలను తొలగించడంలో సల్ఫోరఫేన్ ముఖ్య పాత్రను పోషిస్తుంది. రెడ్ క్యాబేజికి శక్తివంతమైన రంగును అందించే యాంటిఆక్సిడెంట్ ‘అన్తోసయనిన్స్’ కాన్సర్‌ను నియంత్రించడమే కాకుండా శరీరంలో అప్పటికే ఉన్న కాన్సర్ కణాలను చంపేందుకు సహాయపడుతుంది.


శరీరంలో వాపు రాకుండా నియంత్రిస్తుంది: క్యాబేజీలోని సల్ఫోరఫేన్, కెంప్ఫెరోల్ వంటి యాంటిఆక్సిడెంట్స్ దీర్ఘకాలిక వ్యాధులు, వాపును తగ్గించేందుకు సహకరిస్తాయి.  


మెదడును ఆరోగ్యంగా వుంచడంలో తోడ్పడుతుంది: క్యాబేజిలోని విటమిన్-K, అయోడిన్, యాంటిఆక్సిడెంట్ ‘అన్తోసయనిన్స్’ పుష్కలంగా ఉన్నాయి. ఇవి అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల్లో కనిపించే ప్రోటీన్స్‌ను నివారిస్తాయి. మెదడులో బ్లాక్స్ ఏర్పడుకుండా అడ్డుకుంటాయి. 


బీపిని తగ్గిస్తుంది: క్యాబేజీలోని పొటాషియం.. బీపీని నియంత్రిస్తుంది. పొటాషియం స్థాయిలు ఎక్కువగా ఉన్న క్యాబేజీను ఆహారంగా తీసుకోవటం వల్ల బీపీని తగ్గించి ఆరోగ్యంగా జీవించవచ్చు. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలు అందిస్తున్న క్యాబేజీని ఈ చలికాలంలో ఆహారంగా తీసుకోకపోతే ఎలా? ఈ రోజు నుంచే దీన్ని మీ డైట్‌లో భాగం చేసుకోండి. 


Also Read: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు క్యాబేజీని కొంచెం కూడా తినకూడదు


గమనిక 1: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. 


గమనిక 2: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.