FSSAI: రోడ్లపై ఉండే ఫుడ్ స్టాల్స్, చిన్న చిన్న కిరాణా దుకాణాలు, బడ్డీ కొట్లు, చిన్నపాటి హోటళ్లు ఇలా చాలా ప్రాంతాల్లో ప్లేట్లకు బదులు న్యూస్ పేపర్ వాడటం తెలిసిందే. వాడేసిన న్యూస్ పేపర్లను చిన్న చిన్న పొట్లాలు కట్టేందుకు వాడుతుంటారు చాలా మంది. అయితే ఇలా వార్తా పత్రికలను ఆహార పదార్థాలు ప్యాక్ చేయడానికి, తినడానికి వాడటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని, దాని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని భారత ఆహార భద్రత, ప్రమాణాల మండలి (FSSAI) కీలక హెచ్చరికలు జారీ చేసింది. న్యూస్ పేపర్ ను ఆహార పదార్థాల ప్యాకింగ్ కు వాడకూడదని వ్యాపారాలను ఆదేశించింది. వార్తా పత్రికల్లో ప్యాక్ చేసిన, నిల్వ చేసిన పదార్థాలను తినవద్దంటూ వినియోగదారులకు సూచనలు చేసింది. దీని వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది.
ఆహారం ప్యాక్ చేయడానికి, నిల్వ చేయడానికి న్యూస్ పేపర్లను వాడటాన్ని అరికట్టేందుకు రాష్ట్రాల ఆహార నియంత్రణ సంస్థలతో కలిసి పని చేస్తామని FSSAI సీఈవో జి. కమలవర్ధన రావు తెలిపారు. వార్తా పత్రికల్లో వినియోగించే ఇంక్ లో ఎన్నో బయోయాక్టివ్ మెటీరియల్స్ ఉంటాయని, అవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయని, ఆహారాన్ని కలుషితం చేస్తాయని, అలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం సమస్యలు వస్తాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో తెలిపారు.
ప్రింటింగ్ కు వాడే ఇంక్ లో లెడ్, భార లోహాలు, రసాయనాలు ఉంటాయని, అవి ఆహారం ద్వారా శరీరంలోకి చేరి ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయని FSSAI వెల్లడించింది. వార్తా పత్రికల పంపిణీ వివిధ పర్యావరణ పరిస్థితులకు లోబడి ఉంటుందని, బ్యాక్టీరియా, వైరస్ లు లేదా ఇతర సూక్ష్మజీవులు వాటి ద్వారా ఆహారంలోకి చేరి అనారోగ్యానికి గురి చేస్తాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది.
న్యూస్ పేపర్లను ఆహార పదార్థాల ప్యాకింగ్, నిల్వకు వాడకూడదంటూ నిషేధం విధిస్తూ FSSAI 2018లోనే నిబంధనలను నోటిఫై చేసిందని గుర్తు చేశారు. ఆహార పదార్థాల్లో నూనె అధికంగా ఉన్నప్పుడు, దాన్ని వార్తా పత్రికలను ఉపయోగించి దానిని తొలగించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా చేయడాన్ని కూడా చట్టం ప్రకారం నిషేధం. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, చట్టం ప్రకారం అనుమతించిన ప్యాకింగ్ మెటీరియల్ నే ఆహార పదార్థాలకు ఉపయోగించాలని FSSAI సీఈవో జి. కమలవర్ధన రావు కోరారు.
అనేక రకాల ఆరోగ్య సమస్యలు
రీసైకిల్ చేసిన పదార్థాలతో పేపర్లు లేదా కార్డ్‌బోర్డ్ పెట్టెలను తయారు చేస్తారు. వీటిలో ఉండే హానికారక రసాయనాలు జీర్ణ సంబంధిత సమస్యలకు, తీవ్రమైన దుష్ప్రభావాలకు గురి చేస్తాయి. న్యూస్ పేపర్లతో ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను తీసుకున్న వృద్ధులు, యువకులు, చిన్నపిల్లల్లో క్యాన్సర్ వ్యాధి సంబంధిత వ్యాధులు కూడా సంభవిస్తాయని గతంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలిపింది.
న్యూస్ పేపర్ల ప్రింటింగ్ లో ఉపయోగించే ఇంక్ లో కొన్ని హానికారక కెమికల్స్ ఉంటాయి. అవి హార్మోన్ల పనితీరుపై దుష్ప్రభావం చూపిస్తాయి. దీంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. FSSAI ప్రకారం న్యూస్ పేపర్ ముద్రణలో వాడే వివిధ రకాల రంగులు, రసాయనాల వల్ల ఆరోగ్యానికి తీవ్రహాని జరిగే అవకాశం ఉంటుంది.