గుండెపోటు ఒక అత్యవసర ఆరోగ్య పరిస్థితి. ఇందులో బతికే ఛాన్స్ చాలా తక్కువ. గుండెకు రక్త సరఫరా ఆగిపోయినప్పుడు ఈ పరిస్థితి సంభవిస్తుంది. గుండెపోటు ముఖ్య లక్షణం ఛాతి నొప్పి రావడం. అయితే అది ఒక్కటే దాని లక్షణం కాదు. ఎన్నో రకాలుగా గుండెపోటు వచ్చే సంకేతాలను మెదడు మనకు పంపిస్తుంది. వాటిపై అవగాహన లేనివారు పరిస్థితి చేయి దాటిపోయాకే ఆసుపత్రికి చేరుకుంటున్నారు.


చర్మం రంగు
ఛాతీ నొప్పి కాకుండా గుండెపోటు వచ్చే ముందు ఇతర సంకేతాలు కూడా కనిపిస్తాయి. ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం గుండెపోటు వచ్చే ముందు చర్మం రంగు మారుతుంది. చర్మం పేలవంగా, రక్తం లేనట్టు బూడిద రంగులోకి మారుతుంది. చెమట పడుతుంది. వికారంగా అనిపిస్తుంది. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారడం లేదా ఎక్కువసార్లు ఊపిరి పీల్చుకోవాల్సి రావడం జరుగుతుంది. అలాగే వారిలో యాంగ్జయిటీ పెరిగిపోతుంది, కళ్ళు తిరిగినట్టు మైకం వస్తుంది. ఇవన్నీ కూడా గుండెపోటు వచ్చే ముందు కనిపించే సంకేతాలే. శరీరానికి రక్తప్రసరణ సరిగా జరగనప్పుడు ఆ వ్యక్తి చర్మం రంగు మారుతుంది. దీన్ని చాలా మంది పట్టించుకోరు.


గుండెపోటు విషయంలో పురుషులు ప్రధానంగా ఛాతీ నొప్పిని అధికంగా అనుభవించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అదే మహిళలైతే సాధారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. అనారోగ్యంగా ఉన్నట్టు భావిస్తారు. మెడ, దవడలో నొప్పి అధికంగా ఉంటుంది. వీటితోపాటు పైన చెప్పిన ఇతర లక్షణాలు కూడా ఉండొచ్చు.


డయాబెటిస్ ఉన్న వారిలో...
మధుమేహం ఉన్న వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీన్ని నిశ్శబ్ద గుండె పోటు అని అంటారు. వీరికి గుండెపోటు వచ్చే ముందు సంకేతాలు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు కూడా. గుండెల్లో మంట లేదా ఛాతీ మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. చెమట పట్టడం, దవడా,మెడ ,ఎడమచేతిలో నొప్పి రావచ్చు. ఇవన్నీ మధుమేహం ఉన్న వారిలో గుండెపోటుకు ముందు కనిపించే హెచ్చరిక సంకేతాలు. 


రాకుండా ఉండేందుకు...
గుండె పోటు రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు. దీనికి మానసికమైన, శారీరకమైన ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం చాలా అవసరం. మంచి జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిడి లేని జీవితం, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అన్ని రకాల పండ్లు, కూరగాయలు పుష్కలంగా తీసుకోవాలి. కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోకుండా చూసుకోవాలి. డయాబెటిస్, హైబీపీ వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి. అవి వచ్చాక కూడా ఆరోగ్యకరమైన జీవనశైలితో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. రోజు జిమ్‌లో వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు అరగంట నుంచి గంటపాటు నడిచినా గుండెకు మంచిదే. ఒకే దగ్గర గంటలపాటు కూర్చోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఇంకా పెరుగుతాయి.కాబట్టి వ్యాయామం చేయడం, చురుగ్గా కదలడం చేస్తూ ఉండాలి. 


Also read: చలికాలంలో వాడే వీటి వల్ల శ్వాసకోశ సమస్యలు? గుండెపోటు వచ్చే అవకాశం కూడా?



















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.