దిల్లీలో మరోసారి పెరుగుతున్న కేసులు
భారత్‌లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశరాజధాని దిల్లీ, ముంబయిలో పాజిటివిటీ రేటు అంతకంతకూ పెరుగుతుండటం ఆ రెండు నగరాలను కలవర పెడుతోంది. ఫలితంగా...అధికార యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. కరోనా కట్టడి చర్యలు మొదలు పెట్టాయి. ఇందులో భాగంగానే దిల్లీలో ఓ కీలక నిబంధనను మరోసారి అమల్లోకి తీసుకొచ్చారు. మాస్క్ తప్పనిసరి చేశారు. పబ్లిక్ ప్లేసెస్‌లో మాస్క్ ధరించని వాళ్లకు రూ.500 జరిమానా విధించనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ప్రైవేట్ ఫోర్ వీలర్స్‌లో ప్రయాణించే వారికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేసింది. దిల్లీలో 24 గంటల్లో 2,495 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు బాధితులు మృతి చెందగా, యాక్టివ్ కేసుల సంఖ్య 8,506కి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 15.41%గా నమోదైంది. 24 గంటల్లో 1,466 మంది కరోనా బాధితులు కోలుకున్నట్టు హెల్త్ బులిటెన్ తెలిపింది. ఆగస్టులోనే కరోనా బారిన పడి దాదాపు 40 మంది మృతి చెందారు.
కరోనాతో పాటు మంకీపాక్స్..
ఇప్పుడే కాదు. కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి దిల్లీ కొవిడ్ హబ్‌గా మారింది. మహారాష్ట్ర తరవాత ఇక్కడే అత్యధిక కేసులు నమోదయ్యాయి. దేశంలో తొలిసారి "మాస్క్" నిబంధన తీసుకొచ్చింది దిల్లీలోనే. ఇప్పుడు మరోసారి ఇక్కడే కేసులు పెరుగుతున్నాయి. ఈ మధ్యే కొవిడ్ కేసులు తగ్గాయని మాస్క్ నిబంధనను తొలగించింది కేజ్రీవాల్ సర్కార్. ఇప్పుడు మళ్లీ తప్పనిసరి చేసింది. నిత్యం కొవిడ్
మార్గదర్శకాలు జారీ చేస్తూనే ఉంది దిల్లీ ప్రభుత్వం. అయితే...ఈ సారి కరోనాతో పాటు మంకీపాక్స్ కేసులూ నమోదవుతుండటం వల్ల ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అధికారుల్ని అప్రమత్తం చేశారు. ఇప్పటికే దిల్లీ రెండు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. లోక్‌నారాయణ్ జయప్రకాశ్ హాస్పిటల్‌లో మంకీపాక్స్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
స్వల్పంగా పెరిగిన కేసులు
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం...రికవరీ రేటు 98.53%కి చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ తగ్గుదల కనిపించింది. ఆగస్టు 10వ తేదీన యాక్టివ్ కేసులు 1,28,261 కాగా...ఆగస్టు 11 నాటికి 1,25,076కు తగ్గింది. 24 గంటల్లో యాక్టివ్ కేసులు 3,185 మేర తగ్గాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో యాక్టివ్ కేసులు 0.28% మాత్రమేనని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకూ కొవిడ్ మరణాలు 5,26,879గా నమోదయ్యాయి. భారత్‌లో మొదటి కొవిడ్ మరణం 2020లో మార్చి నెలలో నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు ఆగస్టు 11న 4.58%గా నమోదైంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR లెక్కల ప్రకారం...ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 87 కోట్ల 92 లక్షల 33 వేల 251 శాంపిల్స్ టెస్ట్ చేశారు. వీటిలో 3లక్షల 56 వేల 153 శాంపిల్స్ టెస్ట్ ఆగస్టు 10వ తేదీన జరిగింది.
Also Read: ఇతరుల కన్నా దోమలు మిమ్మల్నే ఎక్కువగా కుడుతున్నాయా? దానికి మీ రంగు కూడా కారణం కావచ్చు
Also Read: Madonna Sebastian Photos: కూల్ అండ్ క్యూట్ గా ఉన్న ప్రేమమ్ బ్యూటీ