CPR Full Form in Telugu:రోడ్డుపై వెళ్తుండానో జిమ‌లో వర్కౌట్‌ చేస్తుండగానో లేదా ఇంటిలో టీవీ చూస్తుండగానో ఒక వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండె స్పందన ఆగిపోయింది. శ్వాస ఆడటం లేదు. అలాంటి క్లిష్ట పరిస్థితిలో అక్కడ ఉన్న వారు భయంతో చూస్తూ ఉండిపోతారా లేకా సరైన సమయంలో స్పందించి ఆ వ్యక్తికి పునర్జన్మ ఇస్తారా? ఇక్కడే శ్రీరామ రక్షలా ఉపయోగపడే అత్యవసర వైద్య ప్రక్రియే సీపీఆర్. నేటి ఆధునిక జీవనశైలి, విపరీతమైన ఒత్తిడి, మారిన ఆహారపు అలవాట్లు కారణంగా వయసుతో సంబంం లేకుండా ఆకస్మిక కార్డియాక్‌ అరెస్టులు పెరిగిపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ సీపీఆర్‌పై ప్రాథమిక అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం. సరైన సమయంలో ఇచ్చిన సీపీఆర్‌, ఆకస్మిక గుండె ఆగిపోయిన బాధితుల ప్రాణాలను కాపాడే అవకాశాన్ని రెండు మూడు రెట్లు పెంచుతుంది. అయితే పీసీఆర్ అంటే ఏంటీ, దీని ఫుల్ ఫామ్‌ ఏంటీ? ఏవిధంగా చేయాలి? ఏయే పరిస్థితుల్లో పొరపాటున కూడా సీపీఆర్ చేయకూడదు? అనే అంశాల గురించి తెలుసుకుందాం. 

Continues below advertisement

సీపీఆర్ అంటే ఏంటి? దీని ఫుల్ ఫామ్‌ ఏంటి?

సీపీఆర్ అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్. కార్డియో అంటే గుండెకు సంబంధించింది. పల్మనరీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించింది. రిససిటేషన్ పునరుజ్జీవనం కలిగించడం లేదా మళ్లీ స్పృహలోకి తీసుకురావడం. 

మన శరీరంలో మెదడు అత్యంత సున్నితమైన అవయవం. గుండె స్పందన ఆగిపోయిన తర్వాతి 3 నుంచి నాలుగు నిమిషాల్లో మెదడు ఆక్సిజన్‌తో కూడిన రక్తం అందకపోతే, మెదడు కణాలు శాశ్వతంగా దెబ్బింటాయి. వైద్య సహాయం వచ్చే లోపు, మన చేతులో బాధితుడి ఛాతీపై ఒత్తిడి తెస్తూ, కృత్రిమ శ్వాస అందించడం ద్వారా గుండెను ఒక పంప్‌లా పని చేయించి, మెదడుతో పాటు శరీర ప్రధాన అవయవాలకు రక్త ప్రసరణ ఆగిపోకుండా చూసే  ప్రక్రియే సీపీఆర్. 

Continues below advertisement

సీపీఆర్‌ ఎప్పుడు అవసరం?

చాలా మంది హార్ట్‌ అటాక్‌, కార్డియాక్‌ అరెస్టు రెండూ ఒకటేనని భావిస్తారు. కానీ ఇవి రెండు వేర్వేరు. గుండె కండరాలకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తుంది. ఈ సమయంలో బాధితుడు స్పృహలోనే ఉంటాడు. ఛాతీలో నొప్పి, చెమటలు రావడం వంటి లక్షణాలు ఉంటాయి. గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. ఈ స్థితిలో సీపీఆర్ అవసరం లేదు. గుండెలో ఎలక్ట్రిక్‌ వ్యవస్థ ఉన్నట్టు ఉండి విఫలమై గుండె కొట్టుకోవడం పూర్తిగా ఆగిపోతుంది. బాధితుడు వెంటనే స్పృహ కోల్పోతాడు. కింద పడిపోతాడు. పల్స్‌ పడదు, శ్వాస పూర్తిగా ఆగిపోతుంది. దీన్నే కార్డియాక్‌ అరెస్టు అంటారు. ఈ పరిస్థితిలోనే వెంటనే సీపీఆర్ ప్రారంభించాలి. 

సీపీఆర్‌ చేసే సరైన పద్ధతి- సీఏబీ ఫార్ములా

అమెరికా హార్డ్‌ అసోసియేషన్ మార్గదర్శకాల ప్రకారం సీపీఆర్ చేయడంలో అత్యంత కీలకమైన C-A-B ఫార్ములా. 

రెస్పాన్స్‌ మొదట చెక్ చేయాలి

మీరు ఉన్న ప్రదేశం సురక్షితంగా ఉందో లేదో చూడండి. బాధితుడి భుజాలను తట్టి బిగ్గరగా బాగున్నారా? కళ్లు తెరవండి అని పిలవాలి. ఎలాంటి స్పందన లేకపోతే, శ్వాస, గొంతు వద్ద లేదా మణికట్టు వద్ద పల్స్‌ ఉందో లేదో పది సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకోకుండా త్వరగా చెక్ చేయాలి. వెంటనే 108 లేదా స్థానిక అంబులెన్స్‌కు కాల్ చేయండి. చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వారిని సహాయానికి పిలవండి. సమీపంలో AED(ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డిఫిబ్రిలేటర్‌) ఉంటే తీసుకురమ్మని చెప్పండి.

C- ఛాతీ కంప్రెషన్లు 

బాధితుడిని గట్టిగా, గది ఉన్న నేలపై వెల్లకిలా పడుకోబెట్టాలి. మీ ఒక అరచేతి అడుగు భాగాన్ని బాధితుడి ఛాతీ మధ్యలో ఉంచాలి. మరొక చేతిని దానిపై ఉంచి వేళ్లను లాక్ చేయాలి. మీ చేతులు మోచేతులు వంచకుండా నేరుగా ఉంచి, మీ శరీర బరువుతో ఛాతీని కనీసం రెండు అంగుళాల నుంచి గరిష్టంగా 2.4 అంగుళాలు లోతుకు నొక్కాలి. నిమిషానికి వంద నుంచి 120 సార్లు కంప్రెషన్ వేగం ఉండాలి. 

A- ఎయిర్‌వే తెరవడం 

30 సార్లు ఛాతీని నొక్కిన తర్వాత, బాధితుడి తలపై ఒక చేయి ఉంచి వెనుకకు కొద్దిగా వంచి, మరొక చేతి వేళ్లతో గడ్డాన్నిపైకి లేపాలి. దీని వల్ల శ్వాసనాళం తెరుచుకుంటుంది. 

B- రెస్క్యూ బ్రీత్స్‌

బాధితుడి ముక్కు రంధ్రాలను వేళ్లతో మూసివేసి, మీ నోటిని బాధితుడి నోటికి పూర్తిగా ఆనించి 1 సెకను పాటు ఊపిరి ఊదాలి. ఛాతీపై పైకి లేస్తుందో లేదో గమనించాలి. ఇలా రెండు రెస్క్యూ బ్రీత్స్‌ ఇవ్వాలి. 30 ఛాతీ కంప్రెషన్లు ఇవ్వాలి. 

మీరు వైద్య శిక్షణ పొందని సాధారణ వ్యక్తి అయితే లేదా నోటి ద్వారా శ్వాస ఇవ్వడానికి ఇబ్బందిగా ఉంటే కేవలం ఛాతీ కంప్రెషన్లు మాత్రమే ఆగకుండా ఇస్తూ ఉండండి. ఏం చేయకుండా ఉండటం కంటే కేవలం కంప్రెషన్లు ఇవ్వడం కూడా ప్రాణాలను కాపాడుతుంది. 

సీపీఆర్ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

సీపీఆర్ చేసేటప్పుడు కొన్ని చిన్న పొరపాట్లు జరిగినా బాధితుడికి ప్రమాదం జరగవచ్చు. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితుడిని పరుపులు, మెత్తటి బెడ్స్‌పై ఉంచి సీపీఆర్ చేయకూడదు. నేల లేదా గట్టి బల్లపైనే పడుకోబెట్టాలి. లేదంటే మీరు ఇచ్చే ఒత్తిడి పరుపుల్లోకి పోతుంది. కానీ గుండెపై పడదు. కంప్రెషన్లు ఇచ్చేటప్పుడు చేతులు మోచేతులు సరిగా నిటారుగా ఉండాలి. కేవలం చేతుల బలంతో కాకుండా మీ నడుము పైభాగం బరువుతో ఒత్తిడి తీసుకురావాలి. ఒకసారి ఛాతీని నొక్కిన తర్వాత చేతులను పూర్తిగా తీసివేయకుండా, ఛాతీ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి అనుమతించాలి. అప్పుడే గుండెలోకి రక్తం మళ్లీ చేరుతుంది. అతిగా బలాన్ని ఉపయోగిస్తే పక్కటెముకలు విరిగి ఊపరితిత్తులు లేదా గుండెకు గాయమయ్యే ప్రమాదం ఉంది. కంప్రెషన్లు మధ్య పది సెకన్ల కంటే ఎక్కువ సమయం విరామం ఇవ్వకూడదు. రక్త ప్రసరణ నిరంతరం జరుగుతూనే ఉండాలి. 

ఎలాంటి వారికి సీపీఆర్ చేయకూడదు?

ఈ అంశం అత్యంత సున్నితమైంది. కుప్పకూలిన ప్రతీ వ్యక్తికీ గుడ్డిగా సీపీఆర్ చేయకూడదు. బాధితుడు స్పృహలో ఉన్నా, లేదా స్పృహ లేకపోయినా సాధారణంగా శ్వాస తీసుకుంటూ పల్స్ సరిగ్గా ఉంటే సీపీఆర్‌ చేయకూడదు. అలా చేస్తే గుండె సహజ స్పందన రేటు దెబ్బతింటుంది. తీవ్రమైన క్యాన్సర్‌ లేదా నయం చేయలేని వ్యాధులతో బాధపడుతున్న రోగులు, లేదా వృద్ధులు తమకు అత్యవసర పునరుజ్జీవన చర్యలు వద్దని చట్టబద్ధంగా డీఎన్‌ఆర్ పత్రాలై సంతకం చేసిన వారిపై సీపీఆర్ చేయకూడదు. రోడ్డు ప్రమాదాల్లో మెడ లేదా వెన్నుముక విరిగిపోయిన సంకేతాలు ఉంటే, తలను వెనక్కి వంచే హెడ్‌ టిల్ట్‌ చేయకూడదు. కేవలం అత్యవసర వైద్యులు మాత్రమే ప్రత్యేక పద్ధతిలో ఎయిర్‌వే తెరుస్తారు.  

వ్యక్తి మరణించిన చాలా సమయం అయి, శరీరం చల్లబడి గట్టిపడటం, చర్మం నీలంగా కానీ నల్లగా కానీ మారడం వంటి సంకేతాలు ఉంటే సీపీఆర్ పని చేయదు. సీపీఆర్‌ ఇస్తున్న వ్యక్తి శారీరకంగా పూర్తిగా అలసిపోయి, ఇంకా చేస్తే శక్తి లేనప్పుడు, అక్కడ మరొక సహాయకుడు లేనప్పుడు ఆపక తప్పదు. అగ్ని ప్రమాదాలు, గ్యాస్‌ లీకేజీలు, పేలుడు జరిగిన వాతావరణంలో రెస్క్యూయర్ ప్రాణాలకే ప్రమాదం ఉన్నప్పుడు సీపీఆర్ చేయొద్దు. 

వయసు ఆధారంగా సీపీఆర్ చేసే విధానం 

పారామీటర్పెద్దలు(8 ఏళ్లు దాటిన వారు) పిల్లలు  (1-8 ఏళ్లు మధ్య)శిశువులు(ఏడాది లోపు వారు) 
చేతులు ఉపయోగించే విధానం రెండు చేతుల అరచేతులు  ఒక చేయి అర చేతి అడుగు భాగంకేవలం రెండు మధ్య వేళ్లు 
కంప్రెషన్ లోతు2 నుంచి 2.4 అంగుళాలుసుమారు 2 అంగుళాలుసుమారు1.5 అంగుళాలు
కంప్రెషన్ వేగంనిమిషానికి 100-120 సార్లునిమిషానికి 100-120 సార్లునిమిషానికి 100-120సార్లు
రేషియో(1 రెస్క్యూయర్)30 కంప్రెషన్లు:2 బ్రీత్స్‌30 కంప్రెషన్లు:2 బ్రీత్స్‌30 కంప్రెషన్లు:2 బ్రీత్స్‌   
పల్స్‌ చెక్ చేసే స్థానంగొంతు వద్దగొంతు లేదా తొడ వద్దభుజం లోపలి భాగంలో 

కార్టియాక్‌ అరెస్టు అయిన ప్రతి నిమిషానికి బాధితుడి బతికే ఛాన్స్ పది శాతం చొప్పున పడిపోతుంది. అత్యవసర సమయంలో భయపడి వెనుకడుగు వేస్తే ప్రాణాలు పోవచ్చు.