MonkeyPox Advisory :   కేరళలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. విదేశాల నుంచి ఓ వ్యక్తిలో మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించడంతో నమూనాలను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపినట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.  సదరు వ్యక్తిని కేరళలోని ఆసుపత్రిలో చేర్పించారు.  పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినట్లుగా కేరళ ఆరోగ్య మంత్రి ప్రకటించారు.   



ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ ముప్పు పెరుగుతోంది.  కేరళలో తొలి కేసు నమోదవడంతో   భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.  గురువారం రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్‌ సెక్రెటరీలు, ప్రిన్సిపల్‌ సెక్రెటరీలు, ఆరోగ్యశాఖ కార్యదర్శులకు లేఖ రాశారు. మంకీపాక్స్‌ విషయంలో ఆరోగ్యమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చే వారిని తప్పనిసరిగా పరీక్షించాలని కోరారు. ఆరోగ్య అధికారులందరికీ క్రమం తప్పకుండా ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్వహించాలని సూచించారు.



ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. మంకీపాక్స్‌ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వైరస్‌ సోకితే మశూచి రోగుల్లో కనిపించే లక్షణాలే బాధితుల్లోనూ కనిపిస్తున్నాయి. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ కేసుల సంఖ్య 77శాతం పెరిగినట్లు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 6వేల మందికి మంకీపాక్స్‌ సోకింది. అదే సమయంలో ఆఫ్రికాలో పలు ప్రాంతాల్లో వైరస్‌ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ కేసులు ఎక్కువగా ఐరోపా, ఆఫ్రికాలోనే నమోదవుతున్నాయి.