బరువు కొలిచే స్కేల్స్ మీద నిల్చోవటం చాలా మందికి నిరాశ కలిగిస్తుంది. శరీర బరువు రోజంతా మారుతూనే ఉంటుంది. ఏ టైం లో కొలుస్తున్నారనే దాన్ని బట్టి బరువు తక్కువ, ఎక్కువ చూపిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి వేయింగ్ మెషిన్స్ ఒక గైడ్ లా పనిచేస్తాయి. వారానికి ఒకసారి బరువు చూసుకునే వారి కంటే వారానికి 6,7 సార్లు బరువు చూసుకునేవారు ఎక్కువగా బరువు తగ్గారని ఒక అధ్యయనంలో తేలింది.
బరువొక్కటే ఆరోగ్యానికి ప్రమాణం కాదు. అయితే, రోజూ తీసుకునే ద్రవ పదార్థాలను బట్టి, శారీరక శ్రమను బట్టి, హార్మోన్ ఫ్లక్చువేషన్స్ ని బట్టి రోజంతా బరువు మారుతుంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఈ నంబర్ల మీద ఎక్కువగా ఫోకస్ చేయొద్దని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెప్తోంది. మరి ఏ టైం లో బరువు చూసుకుంటే సరైన రిజల్ట్స్ వస్తాయో తెలుసుకోండి.
బరువు తగ్గాలని గానీ, పెరగాలని గానీ అనుకునే వారు రోజు బరువు కొలుచుకోవటం కంటే కూడా రోజూ ఒకే సమయంలో బరువు కొలుచుకోవటం చాలా ముఖ్యం. పొద్దున్నే కాలకృత్యాలు అయిపోయిన వెంటనే బరువు చూసుకుంటే రిజల్ట్ సరిగ్గా వస్తుంది. ఎందుకంటే, తర్వాత ఎక్సర్సైజ్, శారీరక శ్రమ వల్ల బరువులో మార్పు కలగొచ్చు. ఇంకా.. పొద్దునే బరువు చూసుకోవటం వల్ల లాస్ట్ మీల్ పూర్తయ్యి అప్పటికి 9 గంటలు గడుస్తుంది కనుక ఫుడ్ బరువును మార్పు చేయదు. అలాగే, రోజూ పొద్దున బరువు చూసుకుంటే ఇదొక అలవాటుగా మారుతుంది.
ఎప్పుడు బరువు చూసుకుంటే తప్పు రిజల్ట్స్ చూపిస్తుంది?
సాధారణంగా, ఎప్పుడు వీలయితే అప్పుడు బరువు చూసుకోవటం చాలామందికి మామూలే. కానీ, తిన్న వెంటనే బరువు చూసుకుంటే బరువు ఉన్నదానికంటే ఎక్కువ చూపిస్తుంది. అలాగే, నీళ్లు గానీ, ద్రవపదార్థాలు గానీ ఎక్కువగా తీసుకున్న వెంటనే బరువు చూసుకుంటే కూడా అలాగే జరుగుతుంది. అయితే, ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బరువు చూసుకుంటే, నంబర్ తక్కువగా చూపిస్తుంది. ఇలా జరగకుండా, పొద్దున్నే బాత్రూముకు వెళ్లొచ్చిన తర్వాత చూసుకుంటే సరైన నంబర్స్ తెలుసుకోవచ్చు.
బరువు కొలిచే మెషిన్ ను సరిగ్గా వాడండి
వేయింగ్ మెషిన్ ను కార్పెట్ మీదనో, ఎగుడుదిగుడుగా ఉన్న ఫ్లోర్ మీదనో ఉంచితే రిజల్ట్ సరిగా ఉండదు. ఫ్లాట్ గా ఉన్న నేల మీద ఉంచి, దాని పైన రెండు కాళ్లతో బలంగా నిలుచోవాలి. ఒక కాలి మీద ఎక్కువ బరువు పెట్టి ఇంకో కాలిని అలా ఆనించటం లాంటివి చేయకూడదు.
బరువు కొలుచుకోవటానికి రోజూ ఒకే మెషిన్ ను వాడండి
రోజూ ఒకే మెషిన్ తో బరువు చూసుకోవటం వల్ల అక్యూరసీ కరెక్ట్ గా ఉంటుంది. హాస్పిటల్స్ లో, జిమ్ముల దగ్గర, ఇంకెక్కడైనా కొలుచుకుంటుంటే మీ బరువు మిమ్మల్ని కంఫ్యూస్ చేస్తుంది. ఆ మెషిన్స్ అన్నీ సరిగ్గా పని చేసినప్పటికీ, చూసుకునే టైం, పరిస్థితులు, బట్టల వల్ల వెయిట్ ఫ్లక్చువేట్ కావొచ్చు. కాబట్టి ఇంట్లోనే, రోజూ ఒకే మెషిన్ తో బరువు చూసుకోవటం మంచిది.