శరీరంలో ఒక క్యాన్సర్ కణితి పెరిగితేనే దానివల్ల కలిగే దుష్ప్రభావాలను తట్టుకోవడం చాలా కష్టం. కేవలం ఒక క్యాన్సర్ కణితి కారణంగానే ఎంతోమంది మరణిస్తూ ఉంటారు. అలాంటిది ఓ మహిళ తన శరీరంలో అవయవాల్లో 20 క్యాన్సర్ కణితులను కలిగి ఉంది. ఆమె వయసు కేవలం 26 ఏళ్ళు. ఈ క్యాన్సర్ కణితులు బయటపడడం విచిత్రంగానే జరిగింది ఆమె విషయంలో. బరువు తగ్గడం కోసం ఆమె డైటింగ్ చేస్తోంది.మిగతా వారితో పోలిస్తే చాలా త్వరగా బరువు తగ్గడం గమనించింది. అలాగే దవడభాగం లావుగా ఉన్నట్టు అనిపించి, దానిని సన్నగా మారేలా చెక్కడానికి బ్యూటీషియన్లను కలిసింది. ఇలా దవడలను సన్నగా మార్చడం అనేది ఒక వైరల్ బ్యూటీ హ్యాక్. పాశ్చాత్య దేశాల్లో దీన్ని ఎంతోమంది అనుసరిస్తారు. అలా ఈ యువతి కూడా ఆ బ్యూటీ హ్యాక్‌పై ఆధారపడింది. దానికి చికిత్స చేస్తున్నప్పుడే ఆ భాగంలో చర్మం కింద ఒక చిన్న గడ్డ ఉన్నట్టు గమనించింది. ఆ గడ్డ ఏంటని పరీక్షలు చేయించుకుంటే అప్పుడు తేలింది ఆమెకు చర్మ క్యాన్సర్ అయినా మెలనోమా ఉందని. అంతేకాదు స్కాన్ చేయగా, ఆమె శరీరంలో దాదాపు శరీరం అంతటా 20 క్యాన్సర్ కణితులు ఉన్నట్టు తేలింది. జీర్ణ వ్యవస్థ, ఊపిరితిత్తులు, పేగులు ఇలా అన్నిచోట్ల ఆమెకు కణితులు ఏర్పడ్డాయి. ఎడమ తొడలో ఒకటి, పిడికిలి భాగంలో ఒకటి కూడా ఉన్నాయి. వాటి కోసం వైద్యులు ఇమ్యునోథెరపినీ ప్రారంభించారు. ఇది తీసుకున్నాక కణితులు తీవ్రంగా నొప్పి పెట్టడం తగ్గిందని చెబుతోంది ఈ యువతి. 


మెలనోమా అంటే 
మెలనోమా అనేది శరీరం అంతటా వ్యాపించే ఒక అత్యంత తీవ్రమైన చర్మకేన్సర్. చర్మం పైన, చర్మం కింది పొరల్లో ఈ క్యాన్సర్ పెరుగుతుంది. దీనికి మొదటి దశలోనే చికిత్స చేయించుకోవాలి, లేకపోతే ఇతర అవయవాలకు చాలా వేగంగా వ్యాపించే సామర్థ్యం ఉంది. మెలనోమాను ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా మహిళల్లో ఇది మొదట కాళ్లపై కనిపిస్తుంది. అదే పురుషుల్లో అయితే ఛాతి, వీపు భాగంలో అధికంగా బయటపడే అవకాశం ఉంది. మెలనోమా చర్మంపై ఎక్కడైనా వ్యాపిస్తుంది. పుట్టుమచ్చలు సాధారణ స్థాయికి మించి అధికంగా పెరిగినా, పుట్టుమచ్చలు ఉన్న భాగంలో చర్మం రంగు మారినా, గోధుమరంగు మచ్చలు వచ్చినా, పుట్టుమచ్చలు చిన్న కణితుల్లా పెరిగినా కూడా వెంటనే వైద్యులను సంప్రదించాలి.


ఇతర క్యాన్సర్లతో పోలిస్తే మెలనోమాలు క్యాన్సర్ కణజాలాన్ని పూర్తిగా తొలగించడం సులభం. అయితే ఇది మొదటి దశలోనే గుర్తించాలి. చికిత్సలో భాగంగా రేడియేషన్ థెరపీ కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ,  టార్గెటెడ్ థెరపీ వంటివి చేస్తారు. మెలనోమాబారిన పడకుండా ఉండాలంటే అతి నీలలోహిత కిరణాల బారిన పడకుండా జాగ్రత్త పడాలి. అంటే  తీవ్రమైన ఎండల్లో తిరగకూడదు. వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి. తీవ్రమైన సూర్య కిరణాల నుంచే అతినీల లోహిత కిరణాలు చర్మాన్ని చేరుతాయి. 


Also read: హార్ట్ ఎటాక్ రావడానికి నెల రోజుల ముందు నుంచే సంకేతాలు కనిపిస్తాయా? అవి ఎలా ఉంటాయి?















































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.