Fact Check: కాంగ్రెస్ నేతలు హిందువుల ఇళ్లలోకి చొరబడి సంపద దోచుకుంటారని ఖర్గే అన్నారా?

Fact Check: కాంగ్రెస్ నేతలు హిందువుల ఇళ్లలోకి చొరబడి వాళ్ల సంపద దోచుకుంటారని ఖర్గే అంగీకరించారంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది.

Continues below advertisement

Fact Check: ‘కాంగ్రెస్ సభ్యులు హిందువుల ఇళ్లల్లోకి చొరబడి వారి సంపద మొత్తం ముస్లింలకు పంచుతారు’ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మల్లికార్జున ఖర్గే 2024 జనరల్ ఎలక్షన్స్ ప్రచార సభలో అన్నట్టు ఒక వీడియోను సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం. 

Continues below advertisement

క్లెయిమ్: ‘కాంగ్రెస్ సభ్యులు హిందువుల ఇళ్లల్లోకి చొరబడి వారి సంపద మొత్తం ముస్లింలకు పంచుతారు’ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మల్లికార్జున ఖర్గే 2024 జనరల్ ఎలక్షన్స్ ప్రచార సభలో పేర్కొన్నారు. 

ఫాక్ట్ (నిజం): కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న ‘హిస్సేదారీ న్యాయ్’కి (సమానత్వం) సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను పేర్కొంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హిందువుల సంపదను ముస్లింలకు పంచుదామనుకుంటుందని ఖర్గే అన్నట్టు చూపించంచడానికి ఆయన ప్రసంగంలోని కొంత భాగాన్ని డిజిటల్‌గా క్లిప్ చేశారు. ఇలాంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ చేయబోదని ఖర్గే తన ప్రసంగంలో పేర్కొన్నారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు

ఈ వీడియోకి సంబంధించిన కీవర్డ్స్ ని ఇంటర్నెట్లో వెతికితే, 4 మే 2024న ఖర్గే అహ్మదాబాద్‌లో చేసిన కాంగ్రెస్ ర్యాలీకి సంబంధించిన పూర్తి వీడియో లభించింది. ఈ ప్రసంగంలో ఆయన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న వివిధ పాలసీలు, ప్రణాళికల గురించి మాట్లాడారు. అంతేకాక, ఈ వీడియోలో 21:55 సమయం దగ్గర ఖర్గే కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతిపాదించిన ‘హిస్సేదారీ న్యాయ్’ (సమానత్వం) అనే అంశం గురించి వివరించడాన్ని చూడవచ్చు. 

ఖర్గే ఈ ప్రతిపాదన గురించి వివరిస్తూ వివిధ కులాలు, ఉప కులాల వివరాలతో పాటు వారి అక్షరాస్యత రేటు, ఆదాయ స్థాయి, తలసరి ఆదాయం గురించిన వివరాలు తెలుసుకోవడానికి కాంగ్రెస్ దేశ వ్యాప్త సామాజిక-ఆర్థిక మరియు కుల గణన నిర్వహిస్తుందని తెలిపారు. అంతేకాక, ఈ పథకం గురించి నరేంద్ర మోదీ “కాంగ్రెస్ సభ్యులు మీ ఇళ్లలోకి ప్రవేశిస్తారు, మొత్తం డబ్బును తీసుకొని ముస్లింలతో సహా అందరికీ పంచుతారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు ఎక్కువ వాటా పొందుతారు” అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని తన ఉపన్యాసంలో ఖర్గే పేర్కొన్నారు. 

మోదీ ఆరోపిస్తున్న పనులను చేయాలని తమకు ఎలాంటి ఉద్దేశం లేదని ఖర్గే వివరించారు. మోదీ ఇలాంటి నిరాధారమైన ప్రచారం చేయడం అన్యాయమని ఆయన అన్నారు. ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు బ్రిటిష్, ముఘల్, నిజాం పాలనలో కూడా జరగలేదని, ఇప్పుడు మాత్రం ఎందుకు అవుతుందని అన్నారు. తమ 55 సంవత్సరాల పాలనలో తాము ఎప్పుడైనా ఇలాంటి పనులు చేశామా అని ప్రశ్నించాడు. ఇలాంటి వాదనలతో మోదీ ప్రజలను ఎందుకు రెచ్చగొడుతున్నారని ఖర్గే దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. 

ఆ తర్వాత ఖర్గే తన ప్రసంగంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న ఇతర పథకాల గురించి మాట్లాడారు. ఖర్గే చేసిన ప్రసంగానికి సంబంధించిన పూర్తి వీడియో చూస్తే, ఖర్గే వైరల్ వీడియోలో చేసిన వ్యాఖ్యలు మోదీ కాంగ్రెస్‌పై చేసిన ఆరోపణలను పేర్కొంటూ అన్నట్టు స్పష్టం అవుతుంది. ఇంతకుముందు కూడా ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ ‘సంపద పునఃపంపిణీ’ పై చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. 

చివరగా, మల్లికార్జున ఖర్గే వీడియోని క్లిప్ చేసి ‘కాంగ్రెస్ సభ్యులు హిందువుల ఇళ్లల్లోకి చొరబడి వారి సంపద మొత్తం ముస్లింలకు పంచుతారు’ అని అన్నట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు. 

This story was originally published by factly.in, as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction para, this story has not been edited by ABP Desam staff.

Continues below advertisement