Factly Check Clarity on Telangana CM Issued Orders on Government Employees: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి (Reavanth Reddy) పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన 6 గ్యారెంటీల్లో రెండింటినీ పదవీ బాధ్యతలు స్వీకరించిన రెండో రోజే అమలు చేశారు. అలాగే, కీలక శాఖల్లో ఉన్నతాధికారుల మార్పిడి సహా డ్రగ్స్ నిర్మూలన, టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తన కాన్వాయ్ కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చెయ్యొద్దని, ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని పోలీస్ ఉన్నతాధికారులకు సూచించారు. అటు, ప్రజాభవన్ లో ప్రజావాణి పేరిట ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రతి రోజూ ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో ప్రజలు హాజరై అధికారులకు తమ సమస్యలు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పిస్తున్నారు. తొలుత స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే ప్రజల నుంచి వినతులు స్వీకరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో దీనిపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
రేవంత్ ఆదేశాల పేరిట వార్త వైరల్..
ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించాలి. అలా చేయకుంటే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ప్రభుత్వం ద్వారా వచ్చే సదుపాయాలు వదులుకోవాల్సి వస్తుంది.’ అని రేవంత్ ఆదేశాలు జారీ చేశారనేది ఆ వార్త సారాంశం. అయితే, ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని ‘ఫ్యాక్ట్ లీ’ చెక్ (FACTLY) స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, ప్రభుత్వ వెబ్ సైట్లలో గానీ ఎక్కడా దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక జీవోలు లేవని తేల్చిచెప్పింది. అలాంటి వదంతులు నమ్మొద్దని పేర్కొంది. అంతేకాక, ఇటీవల విద్యా శాఖపై జరిగిన సమీక్షా సమావేశంలోని దీని గురించి చర్చించినట్లు ఎక్కడా అధికారిక సమాచారం లేదని వెల్లడించింది.
అప్పట్లో యూపీ సీఎంపై ఇదే తీరుగా..
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరుతోనూ 2021లో ఇలాంటిదే ఓ పోస్ట్ వైరల్ అయినట్లు ‘ఫ్యాక్ట్ లీ’ చెక్ (FACTLY) తెలిపింది. అది తప్పుడు సమాచారం అని నిరూపిస్తూ ఏప్రిల్ 2022లో ఓ కథనాన్ని ప్రచురించినట్లు పేర్కొంది. అదే ఫేక్ పోస్టు ఇప్పుడు తెలంగాణ సీఎం పేరు మీద మళ్లీ ప్రచారం అవుతోందని వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను ప్రభుత్వ విద్యాలయాల్లోనే చదివించాలని సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది.
Also Read: Fact Check: శబరిమలలో భక్తుల్ని అరెస్ట్ చేస్తున్నారా? ఆ చిన్నారి అందుకే ఏడ్చాడా - ఫ్యాక్ట్‌చెక్