రామ్ చరణ్ ఎప్పడూ తన పక్కనే ఉండాలని జూనియర్ ఎన్టీఆర్ కోరారు. ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు. ఈ ఈవెంట్లో ఆయన ఏమన్నారంటే...


‘కర్ణాటకకు, చిక్‌బళ్లాపూర్‌కి నమస్కారం. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి, ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌కు, శివరాజ్ కుమార్‌కు ధన్యవాదాలు. పునీత్ రాజ్‌కుమార్ చనిపోయారు అంటే నేను నమ్మను. ఆయన పార్థివ దేహాన్ని చూడటానికి వచ్చినప్పుడు నేను మీతోనే ఉన్నానని ఆయన చెప్పినట్లు అనిపించింది. ఇది చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. పునీత్ రాజ్‌కుమార్ లేరని నేను ఏడవలేదు, ఏడవను. ఎందుకంటే పునీత్ రాజ్‌కుమార్ ఒక సెలబ్రేషన్. ఆయన గురించి మాట్లాడేటప్పుడు నవ్వుతూనే మాట్లాడదాం.’


‘ఆర్ఆర్ఆర్ ఒక సినిమా కాదు మా ఇద్దరి (తారక్, చరణ్) బంధం. రాజమౌళి, రామ్ చరణ్, రామారావులతో మొదలైన ఈ చిత్రం ఆర్ఆర్ఆర్‌గానే మిగిలిపోయింది. ప్రాంతీయ సినిమాల హద్దులు చెరిపేసి, భారతదేశ ఏకత్వాన్ని చాటుదామనుకున్న దర్శకుడి కల ఆర్ఆర్ఆర్. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు. ఇది భారతీయ సినిమాకే గర్వకారణం.’


‘ఇద్దరు నటులు కలిసి చేసే సినిమాలు మనం ఆపేస్తే... ఇద్దరు స్టార్లను తీసుకొచ్చి నిలబెట్టిన చిత్రం ఇది. నేను రాజమౌళికి థ్యాంక్స్ చెప్పను. కానీ ఈ సినిమాలో నన్ను భాగం చేసినందుకు ఒక్కసారి చెబుతున్నాను. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు.’


‘కన్నడలో డబ్బింగ్ చెప్పడానికి సహకరించిన వరదరాజ్‌కు, హిందీలో సహకరించిన రియా ముఖర్జీ, తమిళంలో సహకరించిన మదన్ కార్కీకి ధన్యవాదాలు. అభిమానులందరూ ఈ సినిమాను ఒక మైలురాయిగా చేయాలని నేను కోరుకుంటున్నాను.’


‘నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులు నా అభిమానులు. ఇప్పుడు నా అభిమానులతో పాటు చరణ్ అభిమానులు కూడా దక్కారు. నేను దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. చరణ్‌తో బంధం, సాన్నిహిత్యం ఇలాగే ఉండాలి. మన స్నేహానికి దిష్టి తగలకూడదు. నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండాలి.’ అన్నారు. ఎప్పటిలాగానే అభిమానులందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటూ స్పీచ్‌ను ముగించారు.