నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ‘ఆహా’ ఓటీటీ యాప్‌లో టెలికాస్ట్ అవుతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ టాక్ షో ఎంత పెద్ద సక్సెసో కొత్తగా తెలియంది కాదు. దీనికి సంబంధించిన రెండో సీజన్‌లో అతి పెద్ద ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మాచో స్టార్ గోపీచంద్‌లు ఈ ఎపిసోడ్‌కు హాజరైనట్లు తెలుస్తోంది.


ఇందులో ప్రభాస్ ఉన్న కొన్ని ఫొటోలు ఒక వీడియో కూడా ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ వీడియోలో ప్రభాస్ డ్రెస్సింగ్‌పై బాలయ్య కామెంట్ చేశారు. ‘నీ షర్టులు అన్నీ 3XL, 4XL యేనా అని’ అని బాలకృష్ణ అడిగినప్పుడు ‘నాకు షూలు దొరకడం కష్టం. షూ సైజ్ 13’ అని ప్రభాస్ సమాధానం ఇస్తారు. దానికి బాలకృష్ణ ఫన్నీగా ‘వెంకటేశ్వర స్వామి పాదం అంటారు దాన్ని.’ అని కామెంట్ చేశాడు.


క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఎపిసోడ్‌ను ‘ఆహా’లో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సీజన్ మొదటి ఎపిసోడ్‌కు ఏపీ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ రాగా, ఆ తర్వాత అడివి శేష్, శర్వానంద్ ఒక ఎపిసోడ్‌కు, విష్వక్సేన్, సిద్ధు జొన్నలగడ్డ ఒక ఎపిసోడ్‌కు, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాధిక వచ్చారు.


బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సంక్రాంతి సందర్బంగా థియేటర్లలో విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ తర్వాతి సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి. ఈ సినిమాకు ‘బ్రో ఐ డోంట్ కేర్’ అనే టైటిల్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి.


ఇక ప్రభాస్ చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ కే’, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’, మారుతి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతున్నాయి. ‘ఆదిపురుష్’ కూడా వచ్చే సంవత్సరం విడుదల కానుంది.