'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోనప్పటికీ శ్రీలీలకి నటిగా మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో ఆమె స్క్రీన్ ప్రెజన్స్, నటన, డాన్స్ లు ఆకట్టుకోవడంతో ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి. ముందుగా రవితేజ నటిస్తోన్న 'ధమాకా' సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. అలానే దిల్ రాజు అన్నయ్య కుమారుడు ఆశిష్ రెడ్డి రెండో సినిమా 'సెల్ఫిష్'లో కూడా ఆమెనే హీరోయిన్ గా ఫైనల్ చేశారు.


ఈ రెండు సినిమాలతో పాటు శ్రీలీలకు సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ శ్రీలీలతో రెండు సినిమాలకు అగ్రిమెంట్ చేసుకుంది. ఇవి కాకుండా మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో కూడా ఆమెకి ఛాన్స్ వచ్చింది. అయితే అది సెకండ్ హీరోయిన్ గా అని తెలుస్తోంది. త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 


త్రివిక్రమ్ తన సినిమాల్లో కనీసం ఇద్దరు హీరోయిన్లు ఉండేలా చూసుకుంటారు. ఈసారి యంగ్ హీరోయిన్ శ్రీలీలకి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హీరోయిన్ చెల్లెలిగా ఆమెని తీసుకున్నారు. నిజానికి ఆమె పాత్ర స్పాన్ చాలా తక్కువ. ఆమె రోల్ కి పాటలు కూడా లేవు. ఎంత మహేష్ బాబు సినిమా అయినా.. ఇలా వచ్చి అలా వెళ్లిపోవడమంటే శ్రీలీలకి నచ్చలేదట. ఈ విషయం అర్ధం చేసుకున్న త్రివిక్రమ్ ఆమె పాత్ర పరిధి పెంచారట. 


కొన్ని సీన్లు పెంచడంతో పాటు మహేష్ బాబుతో ఓ పాటకు స్పేస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ విధంగా ఆమె పాత్ర స్వభావం మొత్తం మారిపోయింది. స్క్రీన్ టైం తక్కువే అయినప్పటికీ శ్రీలీల రోల్ మాత్రం ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.