మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కు కేరళ హై కోర్టు షాకిచ్చింది. గతంలో 2018లో ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో అతనిపై ఉన్న స్టే ఆర్డర్ ను విత్ డ్రా చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్ని ముకుందన్ పై ఉన్న లైంగిక కేసును కోర్టులో కాకుండా బయటే పరిష్కరించుకోవడానికి సదరు యువతి అంగీకరించినట్లుగా ఉన్ని తరఫు లాయర్ సైబీ జోస్ కిడంగూర్ కొన్ని పత్రాలను కోర్టుకు సమర్పించారు. అయితే తాను ఎలాంటి సంతకం చేయలేదని, అవి తప్పుడు పత్రాలని ఆ యువతి కోర్టులో వాంగ్మూలం ఇవ్వడంతో హై కోర్టు సీరియస్ అయింది. దీనికి సమాధానం చెప్పాలంటూ ఉన్ని తరఫు న్యాయవాదిని ఆదేశించింది.
అసలు ఏం జరిగిందంటే ?
2018లో కొట్టాయం పట్టణానికి చెందిన యువతి ఉన్ని ముకుందన్ తనను లైంగికంగా వేధించారని ఆ ఏడాది సెస్టెంబర్ 15న పోలీసులను ఆశ్రయించింది. ఆగష్టు 23న స్టోరీ డిస్కషన్ కోసమని పిలిచి తనను వేధించాడని ఆ యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు అతని పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. అయితే ఈ కేసును ఉన్ని తరఫున వివాదాస్పద న్యాయవాది సైబీ జోస్ కిడంగూర్ వాదించారు. ఈ నేపథ్యంలో బాధిత యువతి ఈ కేసును కోర్టులో కాకుండా బయటే పరిష్కరించేందుకు అంగీకరించినట్లుగా ఒక ఫోర్జరీ పత్రాన్ని కోర్టుకు సమర్పించారు. దీంతో ఆ కేసును కోర్టు కొట్టేసింది.
యువతి వాంగ్మూలంతో స్టే ఆర్డర్ విత్ డ్రా..
తాజాగా బాధిత యువతి తాను ఎలాంటి పత్రాల మీద సంతకం చేయలేదని కోర్టులో వాంగ్మూలం ఇవ్వడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. దీనిపై కోర్టు ఉన్ని తరఫు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఉన్నిపై ఉన్న స్టే ఆర్డర్ ను విత్ డ్రా చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కేసులో ప్రత్యుత్తర అఫిడవిట్ దాఖలు చేయాలని ఉన్ని కృష్ణన్ ను ఆదేశిస్తూ కేసును ఈ నెల 17కి వాయిదా వేసింది ధర్మాసనం.
ఉన్ని ముకుందన్ కు మలయాళం లో మంచి డిమాండ్ ఉంది. ఉన్ని తెలుగులోనూ పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఆ తర్వాత అనుష్క నటించిన ‘భాగమతి’, రవితేజ నటించిన ‘ఖిలాడి’ సినిమాలో కూడా కనిపించాడు. తాజాగా హీరోయిన్ సమంత కీలక పాత్రలో నటించిన లేడి ఓరియంటెడ్ మూవీ ‘యశోద’ లో కూడా నటించి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయింది. ఇక రీసెంట్‌గా ‘మాలికాపురం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మలయాళంలో భారీ హిట్ ను అందుకుంది. ఈ మూవీ ఒక్క మలయాళంలోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.
Also Read: ఓటీటీలోకి మలయాళం బ్లాక్‌బస్టర్ ‘మాలికపురం’ - డేట్ ఫిక్స్, తెలుగులోనూ చూసేయొచ్చు!