దాదాపు నాలుగు దశబ్దాల పాటు టాలీవుడ్ సూపర్ స్టార్‌గా కృష్ణ తెలుగు సినిమాలో ఓ వెలుగు వెలిగారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. సాహసాలకు కృష్ణ పెట్టింది పేరు. కెరీర్ ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎక్కడా వెనకడుగు వేయలేదు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు దూసుకెళ్లి సూపర్ స్టార్ అయ్యారు కృష్ణ. రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేసి సుమారు 340 కు పైగా సినిమాల్లో నటించారాయన. కేవలం నటుడిగానే కాదు నిర్మాతగా, దర్శకుడిగా పలు విభాగాలలో తెలుగు సినీ పరిశ్రమకు సేవలు అందించారు. టాలీవుడ్ సాంకేతికంగా అభివృద్ధి చెందటానికి ఎన్నో ప్రయోగాలు చేసి విజయాలు సాధించారు కృష్ణ. టాలీవుడ్ లో తొలిసారి ఈస్ట్‌మన్‌ కలర్‌, 70 ఎంఎం, సినిమా స్కోప్‌, కౌబాయ్‌, జేమ్స్‌ బాండ్‌ లాంటి సినిమాలు తీసిన ఘనత ఆయనకే దక్కుతుంది.


సూపర్ స్టార్ బిరుదు బ్యాగ్రౌండ్ స్టోరీ ఇదీ.. 
సీనియర్ నటుడు కృష్ణకు సూపర్ స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందా, ఎవరు ఇచ్చారు అని ఎప్పుడైనా ఆలోచించారా. నిజానికి కృష్ణకు ఆ బిరుదు అంత సులభంగా ఏమీ రాలేదు. ఆయన అభిమానులే కృష్ణకు సూపర్ స్టార్ అనే బిరుదు వచ్చేలా చేశారు. అది కూడా ఓటింగ్ పద్ధతి ద్వారా, అదెలాగంటే.. ఆ సమయంలో ఓ తెలుగు, తమిళ మ్యాగజైన్‌ ఒకటి ఓ పోల్ ను నిర్వహించింది. 'సూపర్ స్టార్ ఆఫ్ ది ఇయర్' పేరుతో పోల్ ను నిర్వహించేది ఆ మ్యాగజైన్. అది కూడా ఇప్పటిలాగా ఆన్లైన్ ఓటింగ్ కాదు. తమ అభిప్రాయాలను అభిమానులు పోస్ట్ ద్వారా పంపాలి. అలా జరిగిన ఓటింగ్ లో వరుసగా ఐదు సంవత్సరాలు కృష్ణ పేరు టాప్ లో ఉండటం విశేషం. దీంతో అప్పటి నుంచి అందరూ కృష్ణను సూపర్‌ స్టార్‌ అని పిలవడం మొదలుపెట్టారు. దిగ్గజ నటులు పోటీలో ఉన్నా అభిమానుల ఓట్లతో సూపర్ స్టార్ అయ్యానని గతంలో ఓ ఇంటర్వ్యూలో కృష్ణ స్వయంగా వెల్లడించారు. గూఢచారి 116, మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, ఈనాడు వంటి విబ్భిన్నమైన సినిమాలు చేసిన కృష్ణను అభిమానులు ఎంతగానో ఆదరించారు. అందుకే సూపర్ స్టార్ బిరుదును కృష్ణకు కట్టబెట్టారు. 


సూపర్ స్టార్ కృష్ణ సినిమాల పట్ల అంకిత భావంతో పని చేసేవారు. హిట్ లు వచ్చినా ఫ్లాప్ లు వచ్చినా ఎప్పుడూ ఒకేలా ఉండేవారు. నిర్మాతల కష్టాన్ని తన కష్టంగా భావించి, వారు నష్టపోకుండా తన వంతు శ్రమించే అరుదైన నటులలో ఆయన ఒకరు. ప్రొడ్యూసర్ల హీరోగా కృష్ణ ను పిలిచేవారు. తనను నమ్మి సినిమా చేసిన నిర్మాత ఎల్లప్పుడూ బాగుండాలని కోరుకుంటారాయన. ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే ఆ నిర్మాత నష్టపోకూడదు అని తర్వాత డబ్బులు తీసుకోకుండా ఒక సినిమా చేసి హిట్ ఇచ్చేవారట కృష్ణ. ఇదే తన తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకు నేర్పించారట. డేరింగ్ అండ్ డాషింగ్ నటుడిగానే కాదు మంచి మనసున్న మనిషిగా ఇండస్ట్రీలో కృష్ణకు మంచి పేరు ఉంది.  తన సినిమాలో ఎప్పుడూ ఏదొక కొత్తదనం ఉండేలా చూసుకుంటూనే.. ఆయన చేసే ప్రయోగాలు ఇండస్ట్రీ అభివృద్ధికి దోహదం చేశాయి. అలాంటి గొప్ప నటుడ్ని కోల్పోవడం నిజంగా ఇండస్ట్రీకి తీరని లోటు.