‘పుష్ప’ అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా? ఫైర్.. అన్నట్లుగానే ఈ చిత్రం మాంచి వసూళ్లను సాధిస్తోంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి బాలీవుడ్‌ ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా పుష్పరాజ్ పాత్రకు అంతా ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు, పాత్రలు, సీన్లపై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రానికి ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను నేపథ్యంగా తీసుకుని సుకుమార్ పెద్ద సాహసమే చేశారని చెప్పుకోవచ్చు. అంతేగాక.. మాంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ ఎర్ర చందనం కూలీగా, స్మగ్లర్‌‌‌గా కనిపిస్తే అభిమానులకు నచ్చుతుందా లేదా అనే సందిగ్దం కూడా ఉండేది. అయితే, బన్నీ ఎన్నడూ కనిపించని లుక్‌తో, చిత్తూరు జిల్లా యాసతో ఆకట్టుకున్నాడు. అభిమానులతో విజిల్స్ వేయించాడు. అయితే, ఈ చిత్రంలో కీలక పాత్రలో కోసం సుకుమార్ ముందుగా కొంతమంది స్టార్లను అనుకున్నారట. అయితే.. వారు కొన్ని కారణాల వల్ల ఈ అవకాశాన్ని రిజెక్ట్ చేసినట్లు తెలిసింది. మరి, ఆ స్టార్స్ ఎవరో చూసేద్దామా. 


సమంత: పుష్పలో ‘ఊ అంటావా’ పాటతో ఉర్రూతలూగించిన సమంతను శ్రీవల్లి పాత్ర చేయాలని సుకుమార్ కోరినట్లు మీడియా కథనం. అయితే, అప్పటికే ఆమె ‘రంగస్థలం’ సినిమాలో అలాంటి పాత్రే పోషించడం వల్ల.. రష్మీక మందన్నను ఫైనల్ చేశారట. 


నోరా ఫతేహి: ఆమె డ్యాన్స్‌కు జనాలు పిచ్చెక్కిపోతారు. అందుకే.. ఈమెను ‘పుష్ప’ సినిమాలోని ‘ఊ అంటావా.. ఉఊ అంటావా’ పాట కోసం సంప్రదించారట. అయితే, ఆమె భారీ మొత్తాన్ని డిమాండ్ చేయడంతో సమంతను సంప్రదించారట.


విజయ్ సేతుపతి: ‘పుష్ప’లో పోలీసు అధికారి పాత్రలో నటుడు ఫహద్ ఫాజిల్ ఎలా ఒదిగిపోయాడో మీకు తెలిసిందే. ఆ పాత్రను తొలుత విజయ్ సేతుపతి చేయాల్సి ఉండేది. కానీ సేతుపతికి డేట్స్ లేకపోవడంతో ఆఫర్‌ని తిరస్కరించాడని సమాచారం. దర్శకుడు సుకుమార్ ఈ పాత్ర కోసం బెంగాలీ నటుడు జిషు సేన్‌గుప్తా, నారా రోహిత్‌లను కూడా సంప్రదించినట్లు తెలిసింది. 


దిశ పటానీ: ‘ఊ అంటావా.. ఉఊ అంటావా’ పాట కోసం సమంతను సంప్రదించిన సమయంలోనే ‘పుష్ప’ దర్శకనిర్మాతలు బాలీవుడ్ నటి దిశా పటానీ పేరును కూడా పరిశీలించినట్లు తెలిసింది. సమంతా ఆ ప్రత్యేక గీతానికి ఓకే చెప్పడంతో దిశాను సంప్రదించలేదని తెలిసింది. 


మహేష్ బాబు: పలు మీడియా కథనాల ప్రకారం.. ‘పుష్ప’ సినిమాలో పుష్పరాజ్ పాత్ర కోసం సుకుమార్ ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబును కలిసినట్లు సమాచారం. ఆయనకు కథ కూడా వినిపించారట. అయితే, పాత్రలో సుకుమార్ చెప్పిన లుక్‌కు న్యాయం చేయలేనని కారణంతో మహేష్ బాబు సినిమాపై ఆసక్తి చూపనట్లు తెలిసింది. దీంతో సుకుమార్ బన్నీకి ఈ కథ వినిపించినట్లు సమాచారం.