వంశీ దర్శకత్వంలో రవితేజ (Ravi Teja) హీరోగా ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) సినిమా ఖరారైంది. ఈ సందర్భంగా బుధవారం చిత్ర యూనిట్ పోస్టర్ విడుదల చేసింది. వేటకు ముందు నిశబ్దాన్ని ఆస్వాదించండి అనే క్యాప్షన్‌తో వస్తున్న ఈ చిత్రం ఓ దొంగ బయోపిక్ అని తెలియగానే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. రవితేజ నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. అయితే, దొంగలకు కూడా బయోపిక్‌ తీస్తారా అనే సందేహాలు రావచ్చు. బాలీవుడ్‌లో ఇప్పటికే ఈ ట్రెండ్ ఉంది. పైగా.. రవితేజ చేస్తున్న ఈ బయోపిక్‌లోని వ్యక్తి సాధారణ దొంగ కాదు.. పోలీసులను సైతం బెంబేలెత్తించిన పెద్ద గజ దొంగ. అంతా అతడిని స్టువర్ట్ పురం (Stuartpuram) రాబిన్ హుడ్ అనేవారు. 


వాస్తవానికి ఈ చిత్రాన్ని 2017లోనే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కించాలని అనుకున్నారు. దీనికి డైరెక్టర్ వి.వి.వినాయక్ శిష్యుడు కేఎస్ దర్శకత్వం వహిస్తారని తెలిసింది. దీనికి ‘స్టువర్టుపురం’ అనే టైటిల్ కూడా అప్పట్లో ఖరారు చేశారు. కానీ, ఏమైందో ఏమో మళ్లీ దాని ఊసులేదు. ఈ నేపథ్యంలో ‘దొంగాట’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమాల దర్శకుడు వంశీకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. 


స్టువర్ట్‌పురం ఎలా ఏర్పడింది?: ఆంధ్రప్రదేశ్‌లోని స్టువర్టుపురం (Stuartpuram) గ్రామం గురించి మీరు ఇప్పటికే విని ఉంటారు. బాపట్లకు 15 కిమీల దూరంలో గల ‘స్టువర్ట్‌పురం’ నేపథ్యంలో చాలా సినిమాలు కూడా వచ్చాయి. చిరంజీవి నటించిన ‘స్టువర్ట్‌పురం పోలీస్ స్టేషన్’, బానుచందర్ నటించిన ‘స్టువర్ట్‌పురం దొంగలు’ సినిమాలు అప్పట్లో ప్రేక్షకాధరణ పొందాయి. బ్రిటీష్ పాలకుల కాలం నుంచే స్టువర్టుపురం దొంగలకు నెలవనే పేరు వచ్చింది. 1913లో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ హోం సభ్యుడు హెరాల్డ్ స్టువర్ట్.. ఉపాధిలేక దొంగలు మారినవారికి పారిశ్రామిక, వ్యవసాయ పనులను కల్పించాలని సాల్వేషన్ ఆర్మీని కోరాడు. అంతేగాక వారికి ప్రత్యేకంగా పునరావాసం కల్పించాలని తెలిపాడు. ఉపాధి, ఆవాసం కల్పించడం వల్ల వారు నేరాలకు దూరంగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఆయన డిమాండ్ మేరకు బిట్రీష్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన కాలనీయే.. ‘స్టువర్ట్‌పురం’. ఎక్కువమంది నేరాలు చేసినవారిని అక్కడికి తరలించడం వల్ల పోలీసులు అక్కడి ప్రజలపై నిత్యం నిఘా ఉంచేవారు. ఎక్కడ దొంగతనం జరిగినా పోలీసులు అక్కడికి వచ్చి ఆరా తీసేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోయినా.. ఆ మచ్చ మాత్రం అలాగే ఉండిపోయింది. 


ఎవరీ టైగర్ నాగేశ్వరరావు? ఆ పేరు ఎందుకు వచ్చింది?: 1970-80 మధ్య కాలంలో టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) అనే గజదొంగ ఉండేవాడు. వరుస దొంగతనాలతో పోలీసులకు నిద్రలేకుండా చేసేవాడు. అయితే, అతడు అంత చెడ్డ దొంగ మాత్రం కాదని, కేవలం ఉన్నవాళ్లను దోచుకుని.. పేదలకు సాయం చేసేవాడు. అందుకే అతడిని ఇండియన్ రాబిన్ హుడ్ లేదా స్టువర్టుపురం రాబిన్ హుడ్ అని పిలిచేవారు. నాగేశ్వరరావు పోలీసుల నుంచి చాలా చాకచక్యంగా తప్పించుకొనేవాడు. ఎన్నోసార్లు జైళ్ల నుంచి ఎస్కేప్ అయ్యాడు. కట్టుదిట్టమైన భద్రత ఉండే చెన్నై జైలు నుంచి తప్పించుకున్న తీరుతో ఆయన్ని అంతా ‘టైగర్’ అని పిలవడం మొదలుపెట్టారు. పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన టైగర్ నాగేశ్వరరావు చివరికి 1987లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. 


Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’గా రవితేజ.. వేటకు ముందు నిశబ్దమంటున్న స్టువర్టుపురం దొంగ


1974లో భారీ బ్యాంక్ దోపిడీ.. ఆ తర్వాత..: టైగర్ నాగేశ్వరావు సోదరుడు ప్రభాకరరావు కూడా దొంగతనాల్లో సోదరుడికి సహాయం చేసేవాడు. 1974లో కర్నూలు జిల్లాలోని బనగానపల్లె మండలంలో బ్యాంకు దోపిడీకి ప్రభాకర్ సూత్రధారిగా వ్యవహరించాడు. ఏపీ చరిత్రలో అతి పెద్ద దోపిడీ ఘటన అది. దాదాపు రూ.35 లక్షలు విలువ చేసే బంగారం నగదు దొంగిలించారు. ఆయన సోదరుడు ప్రభాకర్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఆ రోజు జరిగిన దోపిడీ గురించి చెప్పారు. “ఈ చోరీలో మొత్తం పదిమంది ముఠా సభ్యులుం పాల్గొన్నాం. పోలీసు స్టేషన్ ఎదురుగా ఉన్న బ్యాంకును మేం లక్ష్యం చేసుకున్నాం. అర్ధరాత్రి బ్యాంకు వెనుక తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించాం. సేఫ్‌ను పగలగొట్టి, దానిని స్మశానవాటికకు తీసుకెళ్లాం. 14 కిలోల బంగారం, రూ.50,000 నగదు అందులో ఉంది. దానిని సభ్యులమంతా పంచుకోకముందే పోలీసులు మా గ్రామాన్ని చుట్టుముట్టారు. వేరే దారి లేకపోవడంతో ఓ మధ్యవర్తి ద్వారా లొంగిపోవాలని నిర్ణయించుకున్నాం’’ అని తెలిపారు. ఈ కేసులో సూత్రధారి ప్రభాకర్ మాత్రమే కావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే టైగర్ నాగేశ్వరరావు స్టువర్ట్‌పురం నుంచి పరారైనట్లు తెలిసింది. ఈ నేపథ్యం ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో ఈ దోపిడీ ఘటన హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది. 


Also Read: పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో వైరల్


ఇట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి