Siddharth: తమిళ నటుడు సిద్ధార్థ్ కు తమిళంలోనే కాదు తెలుగు, హిందీలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఆయన హీరోగా కెరీర్ ను ప్రారంభించి ఇటీవలే 20 ఏళ్లు పూర్తయింది. దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ‘బాయ్స్’ సినిమాతో సిద్ధార్థ్ హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తరువాత వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగాడు. రీసెంట్ గా ఆయన ‘టక్కర్’ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా జూన్ 9న విడుదల అయింది. ప్రస్తుతం సిద్ధార్ధ్ ఆ సినిమా ప్రమోషన్స్ లో తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ్ సినీ కెరీర్ లో రెండు దశాబ్దాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడంతో ఓ తమిళ మీడియా హౌస్ అభిమానులతో ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
సుజాత రంగరాజన్ కాళ్లకు నమస్కరించిన సిద్ధార్థ్..
అభిమానులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సిద్ధార్థ్ మాట్లాడుతుండగా ఓ పెద్దావిడ ఎంట్రీ ఇచ్చింది. దీంతో వెంటనే సిద్దార్థ్ భావోద్వేగానికి గురై కిందపడి ఆమె కాళ్లకు నమస్కరించాడు. తర్వాత ఆమెను అందరికీ పరిచయం చేశాడు. ఆమె పేరు సుజాత అని ఆమె లేకపోతే తన 20 ఏళ్ల కెరీర్ లేదు అని ఎమోషనల్ అయ్యాడు. తను ‘బాయ్స్’ సినిమాలో హీరోగా చేయడానికి కారణం ఆమె అని, సుజాతమ్మ వలనే తాను హీరోగా మారానని చెప్పాడు. తనను ఆ సినిమాకు రికమండ్ చేసింది ఆమే అని తర్వాత తెలిసిందని చెప్పాడు సిద్ధార్థ్. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. దీంతో ఆ సుజాత ఎవరు అని అందరూ ఆరా తీయడం ప్రారంభించారు.
ఎవరీ సుజాత?
తమిళ పరిశ్రమలో ప్రముఖ రచయిత ఎస్. రంగరాజన్ భార్యనే ఈ సుజాత రంగరాజన్. ఆయన తమిళ్ లో ఎన్నో నవలలు, పుస్తకాలు రచించారు. పలు సినిమాలకు రచయితగా పనిచేశారు. అయితే సిద్ధార్థ్ తన కెరీర్ మొదట్లో మణిరత్నం వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే శంకర్ సినిమాలో కొత్త ఆర్టిస్ట్ లను వెతుకుతుంటే సిద్ధార్థ్ ను శంకర్ కి పరిచయం చేసింది సుజాతనే. సిద్ధార్థ్ మొదట్లో యాక్టింగ్ సైడ్ వెళ్లనని బెట్టు చేసినా ఒప్పించి బలవంతంగా పంపించిందావిడ. తర్వాత సిద్ధార్థ్ ఆడిషన్స్ కు వెళ్లడం ఓకే అవ్వడం ‘బాయ్స్’ సినిమా సూపర్ హిట్ అవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇక ఆ తర్వాత సిద్ధార్థ్ వెనుదిరిగి చూసుకోలేదు. వరుస హిట్ లతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అందుకే చాలా ఏళ్ల తర్వాత తన సక్సెస్ కు కారణమైన వ్యక్తి ని చూసి అలా ఎమోషనల్ అయ్యాడు సిద్ధార్ధ్.
సిద్ధార్థ్ ను పట్టుబట్టి ఆడిషన్స్ కు పంపాను: సుజాత
అదే కార్యక్రమంలో సిద్ధార్థ్ గురించి చెప్పుకొచ్చారు సుజాత. మణిరత్నం దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్న సిద్ధార్థ్ ను శంకర్ సినిమాకు రికమండ్ చేయాలనే ఆలోచన తనకు వచ్చినట్టు చెప్పారు. ఇదే విషయాన్ని తన భర్త రంగరాజన్ కు చెప్పారట. కానీ ఆయన ‘ఆ కుర్రాడు దర్శకుడిగా మారాలనుకుంటున్నాడు వద్దులే’ అని అన్నారట. కానీ ఆ పాత్రకు సిద్ధార్థ్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని తానే దర్శకుడు శంకర్ తో ఆ విషయాన్ని చెప్పారట. కానీ ఈ విషయాన్ని సిద్ధార్థ్ కు చెబితే నిరాకరించాడని చెప్పారు సుజాత. ఆమే పట్టుబట్టి సిద్ధార్థ్ ను ఆడిషన్స్ కు పంపారట. అలా సిద్దార్థ్ సినిమా జర్నీ మొదలైందని చెప్పారు సుజాత.
Also Read: హీరో, హీరోయిన్లను కొట్టడం పై తేజకి ప్రశ్న - దర్శకుడి ఆన్సర్‌కి పారిపోయిన ‘జబర్దస్త్’ కమెడియన్!