సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది యువతీ యువకులు తమ టాలెంట్ నిరూపించుకుంటున్నారు. సరికొత్త ఆలోచనలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. పేరుతో పాటు డబ్బు కూడా బాగానే సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో ఒకడు  దేవరాజ్ పటేల్. చత్తీస్ గఢ్ కు చెందిన ఈ యువకుడు యూట్యూబ్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. చక్కటి కామెడీతో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకునే వాడు.


రోడ్డు ప్రమాదంలో దేవరాజ్ పటేల్  మృతి


21 ఏళ్ల కమెడియన్‌, యూట్యూబ్‌ స్టార్‌ అయిన దేవరాజ్ పటేల్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  రాయపూర్‌లో ఓ షూటింగ్‌కు వెళుతుండగా ఈ యాక్సిడెంట్‌ జరిగింది. లభందిహ్ ప్రాంతంలో అతడు ప్రయాణిస్తున్న బైక్ అదుపు త‌ప్పి ట్ర‌క్కును ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో దేవరాజ్ ప‌టేల్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే  ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. అంబులెన్స్ లో హాస్పిటల్ కు తరలించారు. కానీ, ఆయనకు తీవ్రమైన గాయాలు కావడంతో దారిలోనే మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు.


దేవరాజ్ పటేల్  మృతి పట్ల ఛ‌త్తీస్‌గ‌ఢ్ సీఎం సంతాపం


దేవరాజ్ పటేల్  మృతి పట్ల ప‌లువురు సినీ, రాజకీయ నాయ‌కులు సంతాపం తెలిపారు. ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రి భూపేష్ భఘేల్ దేవ‌రాజ్ పాత వీడియోను షేర్ చేసి అత‌డికి మృతికి సంతాపం తెలిపారు.  “మనందరినీ నవ్వించే దేవరాజ్ పటేల్ ఈరోజు మమ్మల్ని విడిచిపెట్టారు. ఈ చిన్న వయస్సులో అద్భుతమైన టాలెంట్ ఉన్న యువకుడిని కోల్పోవడం బాధాకరం. ఆయన లేని లోటును భరించే శక్తి ఆయన కుటుంబానికి, బంధు మిత్రులకు భగవంతుడు ప్రసాదించాలి. ఓం శాంతి.” అంటూ సీఎం భూపేష్ ట్వీట్ చేశారు.






దేవరాజ్ పటేల్ కుటుంబ నేపథ్యం!  


దేవ్‌రాజ్ ప‌టేల్ 2001లో మహాసముంద్ జిల్లా,  దాబ్ పాలి గ్రామంలో జన్మించాడు. తండ్రి ఘ‌న్ శ్యామ్ ప‌టేల్ రైతు. తల్లి గౌరీ పటేల్ గృహిణి. ఆయనకు ఓ సోదరి, ఓ సోదరుడు ఉన్నాడు. మొదట్లో దేవ్ రాజ్ యూట్యూబ్‌లో రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యూట్యూబ‌ర్ భువ‌న్ బామ్‌తో క‌లిసి ‘దింధోర’ అనే వెబ్ సిరీస్‌లో నటించాడు. ఈ సిరీస్‌లో ‘దిల్ సే బురా లగ్తా హై భాయ్’ అనే డైలాగ్‌తో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. 2021లో లక్ష మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నాడు. యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్‌ను గెలుచుకున్నాడు. ప్రస్తుతం అతడికి నాలుగు లక్షలకు పైగా  సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన తర్వాత సీఎం భూపేష్ తో ఆయనకు పరిచయం ఏర్పడింది. తరచుగా ఇద్దరూ కలుస్తుండేవారు.   


యూట్యూబర్ దేవ్‌రాజ్ పటేల్ నికర ఆస్తుల విలువ ఎంత?


యూట్యూబ్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్న దేవ్ రాజ్ పటేల్, పేరుతో పాటు డబ్బు కూడా బాగానే సంపాదించాడు.  చనిపోయే సమయానికి అతడి నికర ఆస్తుల విలువ రూ. 10 లక్షలు. ఈ డబ్బు అంతా అతడు యూట్యూబ్ ద్వారానే సంపాదించినట్లు మిత్రులు చెప్తున్నారు.  


దేవ్‌రాజ్ పటేల్ చివరి వీడియో..






Read Also: టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లు వీళ్లే, ఒక్కో మూవీకి ఎంత వసూలు చేస్తారంటే?