ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాలను టాలీవుడ్‌కు అందించిన గొప్ప దర్శకుడు ఆయన. విభిన్న చిత్రాలతో ప్రజల గుండెల్లో రెబల్ స్టార్‌గా స్థానం సంపాదించిన కృష్ణం రాజుకు ఉన్న క్రేజ్ గురించి మీకు తెలిసిందే. మరి, వీరిద్దరు కలిసి సినిమా చేస్తే.. అద్భుతం కదూ. వాస్తవానికి దాసరి నారాయణరావుకు, కృష్ణం రాజుకు మంచి స్నేహం ఉండేది. కానీ, ఒక సినిమా వారిద్దరి మధ్య మనస్పర్థలకు దారి తీసింది. అదే.. ‘బండోడు గుండమ్మ’(1980). అప్పట్లో దాసరి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రేలంగి నర్శింహరావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కృష్ణం రాజు, దాసరి మధ్య ఉన్న బంధం గురించి చెప్పారు. ఆ ఆసక్తికర విషయాలు ఆయన మాటల్లోనే..
కృష్ణం రాజును అబ్బాయ్ అనేవారు: ‘‘కృష్ణం రాజును గురువుగారు (దాసరి నారాయణ రావు) అబ్బాయ్ అని పిలిచేవారు. కృష్ణం రాజు ఆయన్ని నారాయణరావుగారు అనేవారు. అనుబంధం, ఆత్మీయతతో మెలిగేవారు. కానీ, ఒకసారి ఇద్దరికి స్పర్థలు వచ్చాయి. ఇందుకు కారణం ‘బండోడు గుండమ్మ’ సినిమా. కృష్ణం రాజుతో కలిసి దాసరి ఆ సినిమా చేయాలనుకున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. తెల్లారితో ముహూర్తం అనగా దాసరికి, కృష్ణం రాజు రాజుకు మిస్ అండర్‌స్టాండింగ్ అయ్యింది. అది చిలికి చిలికి గాలివానలా మారింది. ఇద్దరు పంతానికి, పట్టింపులకు వెళ్లిపోయారు. నేను చెప్పింది వినాలని దాసరి, కాదు నేను చెప్పింది వినాలని కృష్ణం రాజు పట్టుబట్టారు. వారి అనుచరులు ఆ గొడవను మరింత పెద్దది చేశారు. ప్రొడ్యూసర్ జీవీఎస్ రాజు వారి మధ్య నలిగిపోయారు. నేను సినిమా వేరేవారితో చేస్తానని దాసరి అనేయడంతో కృష్ణం రాజుకు కోపం వచ్చి ఆ సినిమా చేయనని వదిలేశారు’’.
కృష్ణం రాజు స్థానంలో కృష్ణ: ‘‘కృష్ణం రాజుతో సరిసమాన హీరోతో ఆ సినిమా చేయాలని దాసరి ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెల్లారితే మూహూర్తం.. అందరికీ ఆహ్వానాలు వెళ్లిపోయాయి. దీంతో క్యాన్సిల్ చేయలేదు. ఎలాగైనా అనుకున్న సమయానికి షూటింగ్ మొదలవ్వాలని దాసరి పట్టుబట్టారు. హనుమంతరావుకు ఫోన్ చేసి నాకు కృష్ణతో సినిమా చేయాలి. అన్ని విషయాలు చెప్పి ఆయన్ని ఒప్పించాలి. రేపు కృష్ణ రావాలి అని దాసరి ఆయనకు చెప్పారు. దీంతో కృష్ణ ఆ సినిమాకు అంగీకరించారు. మేం ఉదయం మద్రాసులో అరుణాచలం స్టూడియోకు వెళ్లి చూసేసరికి ‘కృష్ణ గారికి స్వాగతం’ అని ఉంది. అది చూసి ఆశ్చర్యపోయాం. కృష్ణ అతిథి అనుకున్నాం. కానీ, కృష్ణ మేకప్ వేసుకుని ఉన్నారు. మాకు అప్పటికి ఏం జరిగిందో తెలీదు. ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. చివరికి దాసరి ఆయనతోనే ఆ సినిమా పూర్తి చేశారు. ఆ సినిమాలో జయప్రద హీరోయిన్’’ అని తెలిపారు.
మళ్లీ అలా కలిశారు: ‘‘నిర్మాత జయకృష్ణ.. దాసరి, కృష్ణం రాజుతో కలిసి ‘సీతారాములు’ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ, దాసరితో చేయనని కృష్ణం రాజు, ఆయనతో చేయనని దాసరి మొండికేశారు. వారి మధ్య జయకృష్ణ నలిగిపోయారు. ఇద్దరూ అంగీకరించకపోవడంతో మూడు నాలుగు నెలలు సినిమా ఆగిపోయింది. మరి ఏమైందో ఏమో.. ఆ తర్వాత ఇద్దరూ ఆ సినిమా చేస్తామన్నారు. దీంతో కన్యాకుమారిలో సూర్యోదయంలో సీన్ తీయడానికి అక్కడ షూటింగ్ పెట్టాం. అయితే, దాసరి, కృష్ణం రాజు అక్కడికి చేరే వరకు టెన్షనే. వారు కలుస్తారా? లేదా అనే సందేహం, ఆత్రుత మా యూనిట్‌లో నెలకొంది. ఇద్దరు కలిస్తే ఏం జరుగుతుందనే టెన్షన్. ఇద్దరు ఒకే ఫ్లైట్‌లో వచ్చినా మాట్లాడుకోలేదు. ఎయిర్ పోర్టులో కూడా ఎవరు దారిన వారు వెళ్లిపోయారు. డైరెక్టర్. హీరో మాట్లాడుకోపోతే సినిమా జరుగుద్దా అని కంగారుపడ్డాం. చివరికి సెట్‌లోకి దాసరి, జయప్రద వచ్చారు. కృష్ణం రాజు కారు దిగి సెట్‌లోకి వచ్చారు. వస్తూనే.. కృష్ణం రాజు ‘‘గుడ్ మార్నింగ్ నారాయణరావుగారు’’ అని చాలా కూల్‌గా పలకరించారు. వెంటనే దాసరి పైకి లేచి ‘‘అబ్బాయ్, ఎలా ఉన్నావ్’’ అని కృష్ణం రాజును కౌగిలించుకున్నారు’’ ఇద్దరు అలా కలిసిపోయారు. చాలా రోజుల తర్వాత కలుసుకోవడం వల్ల చాలాసేపు మాట్లాడుకున్నారు. మళ్లీ వారు అలా కలుసుకున్నారు’’ అని తెలిపారు.
‘సీతారాములు’ సినిమా 1980లో, ఆగస్టు నెలలో విడుదలై మంచి వసూళ్లు సాధించింది. ఆ తర్వాత 1986లో దాసరి-కృష్ణం రాజు కాంబోలో వచ్చిన ‘తాండ్రపాపారాయుడు’ సినిమా కృష్ణం రాజు కెరీర్‌లోనే అతి పెద్ద బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది.
Also Read: వాసన చూసి రుచి చెప్పేయొచ్చు, కృష్ణం రాజు చేపల పులుసు తయారీ వీడియో వైరల్!
Also Read : కృష్ణం రాజు ఫంక్షన్ కోసం షూటింగ్ క్యాన్సిల్ చేసిన సీనియర్ ఎన్టీఆర్