మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ అలియాస్ PS -1 తమిళ్ లో సూపర్ హిట్ కాగా తెలుగులోనూ నెమ్మదిగా పుంజుకుంటోంది. గాడ్ ఫాదర్, ఘోస్ట్, స్వాతి ముత్యం లాంటి తెలుగు సినిమాల రిలీజ్ లోనూ PS -1 ఇంకా చెప్పుకోదగ్గ థియేటర్ లలోనే నడుస్తోంది. మొదట్లో బాహుబలి లాంటి ఎలివేషన్లు, విజువల్ ఎఫెక్ట్స్‌ను ఆశించిన తెలుగు ప్రేక్షకులు.. నెమ్మదిగా మణిరత్నం టేకింగ్ కూ.. తన విజన్ కూ అలవాటు పడుతున్నారు. అయితే కథ లోని సంక్లిష్టత, పాత్రల స్వభావం విషయంలో మాత్రం కొంత గందరగోళానికి లోనవుతున్నారు . ముఖ్యంగా B ,C సెంటర్ లలో! దీనికోసం గతంలో హాలీవుడ్ సినిమాల దారిలో మణిరత్నం వెళ్లుంటే బాగుండేది అని సినీ ప్రియులు అంటున్నారు.
సినిమాతో పాటే.. కథ గురించి చెబుతూ చిన్నచిన్న పుస్తకాలను అమ్మిన హాలీవుడ్
మొదటినుండీ హాలీవుడ్ సినిమాలు మనదగ్గర మంచి ఆదరణే పొందేవి . ముఖ్యంగా యాక్షన్ ,ఫాంటసీ సినిమాల గురించి అయితే చెప్పనవసరమే లేదు . వాటికి ప్రతీ జెనరేషన్ లోనూ డై హార్డ్ ఫ్యాన్స్ ఉండేవారు. అయితే, కొన్ని విభిన్నమైన కథలతో వచ్చే సినిమాల విషయంలో మనవాళ్ళు గందరగోళానికి గురికాకుండా సినిమా రిలీజ్ తో పాటే థియేటర్ దగ్గర 4-5 పేజీలతో అత్యంత తక్కువ ధరకు చిన్నచిన్న పుస్తకాలు, బుక్ లెట్ ల వంటివి అమ్మేవారు. లేదా టికెట్ తోపాటే పాంప్లెట్ లా ఇచ్చేవారు . దానితో తాము చుస్తున్న సినిమా లోని కథ, పాత్రల స్వభావం ప్రేక్షకులకు బాగా అర్ధం అయ్యేవి. అలా బుక్ లెట్స్ అమ్మిన సినిమాలలో బెన్ -హర్ , E -T , జురాసిక్ పార్క్ ,టెర్మినేటర్ - 2 లాంటి సినిమాలు ఉండేవి .
బెన్ -హర్ రెలిజియస్ ఫిక్షన్ కాగా, మిగిలినవి సైన్స్-ఫిక్షన్ లు. వీటి కథ మామూలు ఆడియన్స్ కు కూడా అర్ధం అయ్యేలా ఈ బుక్ లెట్స్ చాలా ఉపయోగపడేవి. నిజానికి పొన్నియస్ సెల్వన్ కూడా పుస్తకాల మీద ఆధార పడిందే . తమిళ రైటర్ కల్కి రాసిన 5 భాగాల నవలను కుదించి రెండు భాగాల సినిమాగా తీశారు మణిరత్నం. తమిళ ప్రజలకు ఆ నవల గురించి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈ సినిమాను తలపై పెట్టుకున్నారు. సమస్యల్లా ఇతర భాషలు దగ్గర, అంత పెద్ద పుస్తకాలను ఇక్కడెవరూ చదవలేదు. దీంతో చోళులు అంతఃపుర కుట్రలతో కూడిన సినిమాగా దీనిని చూస్తున్నారు తప్ప.. పాత్రల స్వభావాల్లోని సంక్లిష్టత సామాన్య ప్రేక్షుకులకు అంతగా అంతుబట్టడం లేదన్నది ఎక్కువగా వినవస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలో పొన్నియన్ సెల్వన్ సినిమా మూల కథను ఒక చిన్న పుస్తకం రూపంలో నామినల్ ధరకు రిలీజ్ చేసుంటే తెలుగులో మరింత మంచి ఫలితం దక్కి ఉండేదేమో అన్న విశ్లేషణలు వినవస్తున్నాయి.
Also Read :'గాడ్ ఫాదర్' ఓపెనింగ్ డే వసూళ్లు ఎంత? 'బాస్ ఈజ్ బ్యాక్' అనేలా ఉన్నాయా? లేదా?
Also Read : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది