Orvakal Industrial Park : కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులో నీటి వసతి పనులను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం ప్రారంభించనున్నారు.  రూ.288 కోట్లతో పైపు లైన్ పనులను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) చేపట్టే పనులకు కర్నూలు జిల్లా ఇంఛార్జ్ మంత్రి బుగ్గన శంకుస్థాపన చేయనున్నారు. పార్కు అభివృద్ధికి అవసరమైన ఒక టీఎంసీ నీటిని శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వరద జలాల నుంచి ఏడాదిలో 100 రోజుల పాటు  ముచ్చుమర్రి మీదుగా పైప్ లైన్ ద్వారా 'ఓఎమ్ఐహెచ్'కు నీటి వసతిని ఏర్పాటు చేయనున్నారు.  జలాశయాలు, ఇన్ టేక్ వెల్, పైప్ లైను, మోటార్ల ఏర్పాటు కలిపి మొత్తం ప్రాజెక్టు పనులు రూ.428 కోట్లతో రెండేళ్లలో పూర్తికానున్నాయి. 


రూ.37,300 కోట్ల పెట్టుబడులతో 


హైదరాబాద్ - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో ఓర్వకల్లు పార్కు అభివృద్ధి పనులలో భాగంగా హైదరాబాద్ కి చెందిన కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ సంస్థ , జీవీ ప్రతాప్ రెడ్డి కంపెనీ నీటి సరఫరా మొదటి దశ పనులను టెండర్ విధానంలో  దక్కించుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమను పారిశ్రామిక సీమగా మార్చే దిశగా అడుగులు వేస్తోందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్‌ ఇండ్రస్టీయల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ (నిక్‌డిట్‌) నిధులతో  మల్టీ ప్రొడక్ట్‌ పార్కుగా ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు అభివృద్ధి చేసే విధంగా ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసిందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు.  దీని ద్వారా ప్రత్యక్షంగా 62,000 మందికి, పరోక్షంగా 77,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ రూ.37,300 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తాయని మంత్రి పేర్కొన్నారు. 


ఓర్వకల్లు మెగా ఇండస్ట్రీయల్ హబ్ 


ఓర్వకల్లు మండలంలోని 11 గ్రామాల పరిధిలో 10,257 ఎకరాలలో ఏర్పాటు చేయనున్న  ఓర్వకల్లు మెగా ఇండస్ట్రీయల్ హబ్ ని ఏపీఐఐసీ అభివృద్ధి చేయబోతున్నట్లు ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి వెల్లడించారు. 2.8 కి.మీల మేర ఇప్పటికే అప్రోచ్ రోడ్ పూర్తి చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే మెగా పరిశ్రమైన  జైరాజ్ ఇస్పాట్ ప్రైవేట్ లిమిటెడ్ కి 413.19 ఎకరాల భూమిని  కేటాయించినట్లు పేర్కొన్నారు. గుట్టపాడు క్లస్టర్ పరిధిలోని 41.46 ఎకరాలను సిగచీ, ఆర్ పీఎస్ ప్రాజెక్ట్స్, డెవలపర్స్ ప్రై.లిమిటెడ్,  ప్రిమో పాలి ప్యాక్ వంటి మూడు పరిశ్రమలకు భూములు కేటాయించినట్లు తెలిపారు.  గుట్టపాడు క్లస్టర్ లో మొదటి దశ అభివృద్ధి పనులకు సంబంధించి రూ.30 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరించారు. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ఏర్పాటయ్యే పరిశ్రమలకు కావలసిన విద్యుత్ సరఫరా ఏర్పాట్లను కూడా ఏపీఐఐసీ ప్రణాళిక సిద్ధం చేసిందని ఏపీఐఐసీ వీసీ, ఎండీ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా వెల్లడించారు.  విద్యుత్ సబ్ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. అందుకోసం గుట్టపాడు క్లస్టర్ లో 220 కె.వి సామర్థ్యం గల స్విచ్చింగ్ స్టేషన్  నిర్మాణం కోసం 5.50 ఎకరాల భూమిని ఏపీఐఐసీ కేటయించిందన్నారు.