చిరంజీవి, రవితేజ, శృతిహాసన్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో మెగస్టార్ చిరంజీవితోపాటు మాస్ మహారాజ్ రవితేజ, నటి ఊర్వశీ రౌతేలా, దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. అయితే, హీరోయిన్ శృతిహాసన్ మాత్రం హాజరు కాలేదు. అయితే, బాలకృష్ణ ‘వీరసింహా రెడ్డి’ సినిమాకు హాజరైన శృతి హాసన్ చిరంజీవి ఈవెంట్‌కు రాకపోవడం ఏమటంటూ మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చింది. 


ఆరోగ్యం బాగోలేదు: శృతి హాసన్


ఇలాంటి విమర్శలు వస్తాయని ముందే ఊహించిన శృతి హాసన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ‘వాల్తేరు వీరయ్య’ ఈవెంట్‌కు ఎందుకు రాలేకపోతుందో వివరించింది. ‘‘జ్వరంగా ఉండటం వల్ల ఈ రోజు ‘వాల్తేరు వీరయ్య’ ఈవెంట్‌కు రాలేకపోతున్నందుకు గుండె పగిలినంత బాధగా ఉంది. ఈ సినిమాలో చిరంజీవిగారితో కలిసి పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది. ‘వాల్తేరు వీరయ్య’ ఈవెంట్‌ విజవంతం కావాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొంది. 


విశాఖలో ప్రీ రిలీజ్


విశాఖలో 'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించేందుకు తొలుత అనుమతులు వస్తాయా? లేదా? అని కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొంది. ఏయూ గ్రౌండ్స్ లో వేడుకకు అనుమతి ఇచ్చామని, ఆర్.కె.బీచ్‌లో ఈవెంట్‌కు సంబంధించిన ఏర్పాట్లు గురించి తమకు తెలియదని విశాఖ సీపీ తెలిపారు. అయితే, సముద్ర తీరంలో ఈవేడుక నిర్వహించడం రిస్క్ మాత్రమే కాదు, ట్రాఫిక్‌కు కూడా తీవ్ర అంతరాయం వాటిల్లే అవకాశం ఉండటంతో పోలీసులు ఏయూలో నిర్వహించేందుకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ఈవెంట్‌కు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఏపీలోని ఇతర జిల్లాల నుంచి కూడా ఫ్యాన్స్ తరలిరావడం విశేషం. 


జనవరి 13న థియేటర్లలో విడుదల


సంక్రాంతి బరిలో చివరగా థియేటర్లలోకి వస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. మెగా ఫ్యాన్స్, మాస్ మహారాజా ఫ్యాన్స్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. తొలుత తమ సినిమాకు థియేటర్లు, ప్రచారం విషయంలో అన్యాయం జరుగుతుందని కొంత కినుక వహించినా... ఇప్పుడు హ్యాపీగా ఉన్నారట. పాటలకు లభిస్తున్న స్పందన వాళ్ళకు సంతోషాన్ని కలిగిస్తోంది. 


Also Read : '3Cs' వెబ్ సిరీస్ రివ్యూ : అమ్మాయిలు డ్రగ్స్ కలిపిన వోడ్కా తాగి, ఆ 'హ్యాంగోవర్'లో రచ్చ చేస్తే?  


ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. చిత్ర దర్శకుడు బాబీ కథ, మాటలు రాయగా... స్క్రీన్‌ప్లే : కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్‌ దేవరమానె, ప్రొడక్షన్‌ డిజైనర్: ఎఎస్‌ ప్రకాష్‌, కాస్ట్యూమ్ డిజైనర్: సుష్మిత కొణిదెల, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం.