ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మార్చి 11న విడుదలైన ఈ సినిమా పది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.193 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాకి సెన్సార్ ఎలాంటి నిబంధనలు విధించలేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఈ సినిమా దర్శకుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్(సీబీఎఫ్‌సీ)లో ఒక సభ్యుడు కాబట్టే సినిమాను ఎలాంటి కట్స్ లేకుండా సినిమాను రిలీజ్ చేశారని వారు ఆరోపిస్తున్నారు.
దీనిపై స్పందించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని.. కనీసం చనిపోయిన వారికైనా గౌరవమివ్వండి అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంలో చాలా మంది వివేక్ కి సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే.. కశ్మీర్ లోయలోని హిందూ కుటుంబాలపై పాకిస్తాన్ ప్రేరేపిత ముస్లిం ఉగ్రవాదులు దారుణ మారణకాండకు పాల్పడ్డారు. కశ్మీరీ మహిళలలను వివస్త్రలుగా చేసి.. సామూహిక మానభంగం చేశారు. ఆ లోయలో ఉండాలంటే ముస్లింలుగా మతం మార్చుకోవాలని.. లేదంటే చంపేస్తామని బెదిరించారు. తమకు ఎదురు తిరిగినవారిని చంపేశారు. వారు ఆస్తులను దోచుకున్నారు. తుపాకులు, కత్తులతో హిందువులపై దాడి చేశారు. అప్పటివరకు తమతో కలిసి ఉన్న ముస్లిం సోదరులు తమను చంపడానికి ప్రయత్నించడం పండిట్ లను విస్మయానికి గురిచేసింది. దాదాపు 5 లక్షల మంది కశ్మీరీ పండిట్ లు స్వదేశంలోనే శరణార్థులుగా మారారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారు. వేలాది కుటుంబాలు చెల్లాచెదురైపోయాయి. అప్పట్లో జరిగిన ఈ మారణకాండకు కేంద్రంలో ఉన్న ఓ మంత్రి సాయం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.