ప్రముఖ తమిళ హీరో విశాల్, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘మార్క్ ఆంటోని’. గతంలో ‘త్రిష లేదా నయనతార’, ‘బఘీర’ సినిమాలకు దర్శకత్వం వహించిన ఆదిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు డైరెక్టర్. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ‘మార్క్ ఆంటోని’ని సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ప్రముఖ నటుడు కార్తీ ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే... ఇందులో కథను పెద్దగా రివీల్ చేయలేదని చెప్పవచ్చు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుందని ట్రైలర్ చూసి అర్థం చేసుకోవచ్చు. ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్, తెలుగు నటుడు సునీల్ పాత్రలను కూడా ట్రైలర్‌లో చూపించారు. ఒక ఫోన్ ద్వారా టైమ్ ట్రావెల్ చేయడం అనే పాయింట్‌పై సినిమా తెరకెక్కింది. ట్రైలర్‌లో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో విశాల్ నుంచి ప్రేక్షకులు కోరుకునే యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. హీరో విశాల్ డ్యూయల్ రోల్ చేయనున్నారు. ఎస్‌జే సూర్య పాత్ర, ఆయన నటన సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
గత కొంత కాలంగా కోలీవుడ్ హీరో విశాల్ ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. 2018 లో వచ్చిన 'అభిమన్యుడు' తర్వాత ఇప్పటివరకు అతనికి మరో హిట్టు పడలేదు. ప్రస్తుతం విశాల్ ఏకంగా మూడు సినిమాల షూటింగ్ చేస్తున్నాడు. అందులో 'మార్క్ ఆంటోనీ' సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో విశాల్ రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నారు. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందిందని టీజర్, ట్రైలర్ చూసి చెప్పవచ్చు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ ని అందుకొని క్యూరియాసిటీని పెంచాయి. ‘ఐ లవ్యూ డీ’ అంటూ సాగే పాట కూడా ఆకట్టుకుంటోంది. ‘మార్క్ ఆంటోని’ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు విశాల్.
సెప్టెంబర్ 15వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో తమిళం తో పాటు హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో తెలుగు హీరోయిన్ రీతు వర్మ కథానాయికగా నటిస్తోంది. ఎస్ జె సూర్య, సునీల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ‘మార్క్ ఆంటోని’ సినిమాని మినీ స్టూడియోస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ పై ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. విశాల్ చివరగా 'లాఠీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో విశాల్ ఓ కానిస్టేబుల్ పాత్రను పోషించారు. కానీ ‘లాఠీ’ ఆశించిన విజయం సాధించలేదు.