క్రిస్మస్ సందర్భంగా గత ఐదేళ్లుగా దేవరశాంటా పేరుతో ఛారిటీ కార్యక్రమాలు చేస్తున్నారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. అభిమానులకు ప్రతి సంవత్సరం ఒక కొత్త బహుమతిని ఇస్తూ సర్‌ప్రైజ్ చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా మరో సరికొత్త ఆలోచనతో దేవరశాంటాగా ముందుకొచ్చారు విజయ్ దేవరకొండ. ఈ కార్యక్రమం కింద 100 మంది అభిమానులను ఫ్రీ హాలీడే టూర్ కు పంపించబోతున్నారు.


దేవరశాంటా హ్యాష్ ట్యాగ్ పేరుతో తనకు వచ్చిన రిక్వెస్టుల నుంచి వంద మంది అభిమానులను ఎంపికచేసి పూర్తి ఖర్చులు తానే భరించి వారిని వెకేషన్ పంపించబోతున్నారు. ఇందుకు నాలుగు ఆప్షన్స్ విజయ్ దేవరకొండ సూచించారు. మౌంటెయిన్స్ ఆఫ్ ఇండియా, బీచెస్ ఆఫ్ ఇండియా, కల్చర్ ట్రిప్ ఆఫ్ ఇండియా, డిసెర్ట్స్ ఇన్ ఇండియా అంటూ నాలుగు ఆప్షన్లు సూచించారు.


ఈ నాలుగు ఆప్షన్స్ లో ఎక్కడికి టూర్ కు వెళ్లాలన్నా విజయ్ దేవరకొండ పూర్తిగా ఉచితంగా పంపించనున్నారు. ఇప్పటిదాకా ఏ హీరో తన అభిమానులను ఇలా ఫ్రీ హాలీడే ట్రిప్ కు పంపించలేదు. సెలవుల్లో ఏదైనా టూర్‌కు వెళ్లాలనుకుని ఖర్చులకు సందేహించే అభిమానులు దేవరశాంటా ఆలోచనను ప్రశంసిస్తున్నారు.


మరోవైపు విజయ్ దేవరకొండ ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో తనకు జోడీగా సమంత కనిపిస్తుంది. 'ఖుషి' థియేట్రికల్ రైట్స్‌కు దర్శక నిర్మాతలు 90 నుంచి 100 కోట్లు కోట్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ రేటు ఒక్క తెలుగుకు మాత్రమే కాదు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలకు కలిపి. విజయ్ దేవరకొండకు యువతలో మంచి క్రేజ్ ఉంది. 'లైగర్' ఓపెనింగ్స్ చూస్తే ఆ విషయం తెలుస్తుంది. హిట్ పడితే రూ.వంద కోట్లు రావడం పెద్ద విషయం ఏమీ కాదు. అందుకని డిస్ట్రిబ్యూటర్లు కూడా ముందుకు వస్తున్నారని సమాచారం.