Kalki 2898 AD: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత మూడు సంవత్సరాలుగా ఈ మూవీ షూటింగ్ కొనసాగుతోంది. దాదాపు చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ప్రభాస్ కెరీర్ లో తొలిసారి సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ సినిమాటిక్ వ్యాల్యూస్ తో ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెలలో మూవీ షూటింగ్ కంప్లీట్ చేయాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. 

  


‘కల్కి 2898 ఏడీ’మూవీలో ఇద్దరు యంగ్ హీరోలు!


ప్రతిష్టాత్మక ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో ఇద్దరు యంగ్ హీరోలు అతిథి పాత్రలు పోషించబోతున్నట్లు తెలుస్తోంది.  మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు కనిపించేది కొద్దిసేపే అయినా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాజా షెడ్యూల్ లో వీరిద్దరి షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానున్నట్లు సమాచారం. వాస్తవానికి వీరిద్దరు ‘కల్కి’ చిత్రంలో కనిపించనున్నట్లు గతంలోనే ప్రచారం జరిగింది.  'కింగ్‌ ఆఫ్‌ కోథా' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్‌, ‘కల్కి’ గురించి పలు విషయాలు వెల్లడించారు. ఆ సినిమా సెట్స్‌ ఎంతో అద్భుతంగా ఉన్నాయన్నారు. ఈ సినిమాలో నటిస్తున్నారా? అనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. కానీ, ఆయన మాటలను బట్టి, ఈ చిత్రంలో నటించబోతున్నారని అర్థం అయ్యింది. ఇప్పుడు అది వాస్తవం అని తెలుస్తోంది.


ఇక ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కథ ఏంటనే విషయంలో ఇప్పటికే మేకర్స్ చాలా క్లూస్ ఇచ్చారు. టైం ట్రావెలర్ మూవీ అని వెల్లడించారు. భవిష్యత్ తో ప్రపంచం ఎలా ఉండబోతుందో ఇందులో చూపించబోతున్నట్లు తెలిపారు. మోడ్రన్ కాలానికి పురాణాల పవర్ యాడ్ అయితే, ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త గెటప్ లో అలరించనున్నట్లు తెలుస్తోంది. సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.



మే 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల


ఇక ఈ సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. తెలుగు హిందీ తమిళ మలయాళ కన్నడ భాషలతో పాటుగా పలు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లలో విడుదల ప్లాన్ చేస్తున్నారు. గతంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూపొందిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి', 'మహర్షి', 'మహానటి' లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అదే డేట్ కి వచ్చాయి. ఆ సెంటిమెంట్ తోనే ఇప్పుడు ప్రభాస్ సినిమాని మే 9న విడుదల చేయటానికి రెడీ అయ్యారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ మూవీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ పెద్ద మొత్తాన్ని వెచ్చించి సొంతం చేసుకుంది.


Read Also: థియేటర్లలో విడుదలైన 19 ఏళ్లకు ఓటీటీలోకి వచ్చిన అమితాబ్ బచ్చన్ సినిమా