Venkatesh About Saindhav Movie: టాలీవుడ్ సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ కెరీర్ లో 75వ చిత్రంగా తెరకెక్కిన మూవీ ‘సైంధవ్’. శ్రద్ధ సాయినాథ్ హీరోయిన్ గా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన వెంకటేష్, సినిమాకు సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించారు.  


ఇదో డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ!


“‘సైంధవ్’ లాండ్ మార్క్ మూవీ అయినా ఎలాంటి ఒత్తిడి లేకుండా కంప్లీట్ చేశాను. 75 అనేది నెంబర్ మాత్రమే.  నా వరకు ప్రతి సినిమా ప్రత్యేకమే. ప్రతి సినిమాకి కష్టపడి పని చేయాలి. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. ఈ సినిమాలో బ్యుటీఫుల్ డాటర్ సెంటిమెంట్ వుంది. రెగ్యులర్ గా కాకుండా కథకు అవసరమైయ్యే ఎమోషనల్ యాక్షన్ సీక్వెన్స్ లు వున్నాయి. యాక్షన్ చాలా నేచురల్ గా వుంది. చాలా ఫాస్ట్ పేస్డ్ మూవీ ఇది. ఇది నాకు ఒక డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ మూవీ అవుతుందనిపించింది. దర్శకుడు శైలేష్ కొలను వర్క్ చేయడం చాలా మంచి అనుభూతి కలిగించింది. పిల్లలతో కలసి పని చేయడం నాకు చాలా ఇష్టం. బేబీ సారాలో స్పార్క్ వుంది. అద్భుతంగా నటించింది” అని వెల్లడించారు.


కథలో పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు!


‘సైంధవ్’ కథకు సంబంధించి పెద్దగా ఇన్వాల్వ్ కాలేదని చెప్పారు. “దర్శకుడు శైలేష్ చాలా మంచి కథతో వచ్చారు. ఒకసారి ప్రాజెక్ట్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా టీంతో కలసిపోతాను. సాధారణమైన చర్చలు సహజంగానే జరుగుతుంటాయి. ఎక్కడైనా మెరుగుపరిచే అవకాశం వుందనిపిస్తే చెబుతాను. ‘సైంధవ్’ చాలా మంచి కథ. స్టొరీ నడిచే విధానం చాలా కొత్తగా వుంటుంది. క్లైమాక్స్ ని ఎక్స్ ట్రార్డినరీ గా డిజైన్ చేశారు. హైలీ ఎమోషనల్ గా వుంటుంది. యాక్షన్ సీక్వెన్స్ లని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ఇవన్నీ ఒక కొత్తదనం తీసుకొచ్చాయి” అని చెప్పారు.


ఆ సినిమాతో ఎలాంటి పోలిక లేదు!


అటు ‘సైంధవ్’ పాత్రలో ‘ధర్మచక్రం’ పోలికలు ఉన్నాయంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. రెండు కంప్లీట్ గా డిఫరెంట్ మూవీస్ అన్నారు. అటు నవాజుద్దీన్ సిద్ధిఖితో పని చేయడం చాలా మంచి అనుభూతి కలిగించిందన్నారు. “నవాజుద్దీన్ ఎక్స్ ట్రార్డినరీ యాక్టర్. ‘గ్యాంగ్స్ అఫ్ వాసేపూర్’ నుంచి ఆయన ప్రయాణం చాలా విలక్షణంగా సాగుతోంది. ‘సైంధవ్’లో చాలా క్రేజీ రోల్ చేశారు. మాములు సీక్వెన్స్ ని కూడా డిఫరెంట్ గా చేసే నటుడు ఆయన. ఇందులో చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు” అని వెల్లడించారు. అటు నానితో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై వెంకటేష్ స్పందించారు. అన్నీ చేసేద్దాం అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రెండు మూడు కథలు వింటున్నట్లు చెప్పారు. అయితే, ఏవీ లాక్ చేయలేదన్నారు. ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న అన్ని చిత్రాలు సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు వెంకటేష్ తెలిపారు.


Read Also: బుల్లితెరపై నాగార్జున సంక్రాంతి సందడి - బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో అక్కినేని ఆట అదుర్స్