మెగాస్టార్ చిన్న మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. కరోనా టైమ్ లో వచ్చిన ఈ సినిమా రికార్డులు కొల్లగొట్టింది. వైష్ణవ్ తేజ్ పెర్ఫార్మన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అమ్మాయిల్లో వైష్ణవ్ కి క్రేజ్ పెరిగింది. దీంతో దర్శకనిర్మాతలు ఆయనతో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వైష్ణవ్ తేజ్ తన దగ్గరకు వచ్చిన ప్రతీ సినిమా ఒప్పుకోకుండా కేవలం తనకు నచ్చిన కథలతోనే ముందుకు వెళ్తున్నారు. 

 

ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను పూర్తి చేశాడు. ఈపాటికే ఆ సినిమా రిలీజ్ కావాలి కానీ వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చేస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉండగా.. కొన్ని రోజుల క్రితమే వైష్ణవ్ తేజ్ గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఆ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. 

 

ఈ సినిమాకి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ కి జోడీగా కేతిక శర్మ నటించబోతుంది. ఈ హాట్ బ్యూటీ తెలుగులో పాగా వేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. ఆకాష్ పూరి సరసన 'రొమాంటిక్' అనే సినిమాలో నటిస్తోంది. కానీ ఇప్పుడు ఆ సినిమా ఊసే లేదు. ఇప్పుడు మెగాహీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతోనైనా ఆమెకి టాలీవుడ్ లో బ్రేక్ వస్తుందేమో చూడాలి!