నందమూరి నటసింహం బాలయ్య హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకు ఏ రేంజిలో ప్రేక్షకాదరణ దక్కించుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. సినీ పరిశ్రమకు చెందిన టాప్ సెలబ్రిటీలు ఈ టాక్ షోలో పాల్గొనడంతో సూపర్, డూపర్ సక్సెస్ అయ్యింది. సెలబ్రీటీలను ఆయన అడిగే ప్రశ్నలు ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ షోకు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టారు బాలయ్య. అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అంటూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో ఆయన చేసిన సందడి ఓ రేంజిలో ఉండేది. గతంలో ఎప్పుడూ కనిపించని బాలయ్య ఈ షోతో జనాలకు దర్శనం ఇచ్చారు. తొలి సీజన్ అనుకున్న దానికంటే అద్భుత సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం కొనసాగింపుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే-2తో బాలయ్య మళ్లీ అలరించబోతున్నారు.
ఆహాలో త్వరలో ప్రసారం కాబోతున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే-2 షో కోసం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే అన్‌స్టాపబుల్ యాంథమ్ ఆహా విడుదల చేసింది. తాజాగా ఈ షో ట్రైలర్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ట్రైలర్ ను తెరకెక్కించారు. హైదరాబాద్‌లో ఈ ట్రైలర్ షూటింగ్ కొనసాగింది. ఈ ట్రైలర్ లో కొంత భాగం సారథి స్టూడియోలో, మరి కొంత భాగం అన్నపూర్ణ సెట్ లో చిత్రీకరించారు. బాలయ్య డిఫరెంట్ గెటప్ లో ఈ షూట్ లో పాల్గొన్నారు. తాజాగా ఈ షూట్ కు సంబంధించిన ఫోటోలను ఆహా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.
దసరా సందర్భంగా ఈ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. బెజవాడ దుర్గమ్మ సాక్షిగా విడుదల చేసేందుకు ఆహా రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. అభిమానుల కోలాహలం నడుమ ఈ రోజు(04.10.2022) సాయంత్ర 6 గంటలకు ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ ఓటీటీ టాక్ షోకు ప్రి రీలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ షో గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సీజన్ 1 ప్రోమో షూట్ తర్వాత బాలకృష్ణతో మరోసారి పని చేయాలని భావించినట్లు వెల్లడించారు. అనుకున్నట్లుగానే ఈసారి కూడా అవకాశం తనకే వచ్చిందన్నారు. ఆహ టీం సీజన్ 2 ట్రైలర్ కోసం స్టోరీ రాయాలి అనగానే వెంటనే ఓకే చెప్పినట్లు వెల్లడించారు. బాలయ్యతో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ట్రైలర్ జనాలకు నచ్చుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.