ఎన్టీఆర్ 'జనతా గ్యారేజ్'లో మోహన్ లాల్ కుమారుడిగా కనిపించారు. 'భాగమతి'లో అనుష్కకు జోడిగా నటించారు. రవితేజ 'ఖిలాడీ'లో కీలక పాత్ర చేశారు. ఇప్పుడు సమంత 'యశోద' సినిమాతో ట్యాలెంటెడ్ మలయాళీ హీరో ఉన్ని ముకుందన్ (Unni Mukundan) మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నవంబర్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఉన్ని ముకుందన్ సినిమాతో పాటు సమంత గురించి కొన్ని విషయాలు వెల్లడించారు.
అప్పుడు సమంత చెప్పలేదు! - ఉన్ని
ఇప్పుడు 'యశోద'తో పాటు సమంత (Samantha) ఆరోగ్య పరిస్థితిపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ఆమె మైయోసిటిస్‌తో పోరాటం చేస్తూ... చికిత్స తీసుకుంటూ... డబ్బింగ్ చెప్పారు. మరి, 'యశోద' షూటింగ్ చేసేటప్పుడు 'మీకు ఆ విషయం తెలుసా?' అంటూ ఉన్ని ముకుందన్‌ను అడిగితే... ''తెలియదు'' అని చెప్పారు.
''సినిమా షూటింగ్ చేసేటప్పుడు నాకు సమంత హెల్త్ ఇష్యూ తెలియదు. తను ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. సోషల్ మీడియా పోస్ట్ చూశాక నాకు తెలిసింది. అప్పుడు బాధ పడ్డాను. సమంతను దగ్గర నుంచి చూసి వ్యక్తిగా చెబుతున్నా... మైయోసిటిస్‌తో పోరాటంలో ఆమె విజయం సాధిస్తుంది'' అని ఉన్ని ముకుందన్ తెలిపారు.
సమంతపై ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. ''సమంత చాలా డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్ట్రెస్. 'యశోద' కోసం ఎంతో కష్టపడ్డారు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ కోసం ప్రాణం పెట్టారు. ఒక్కోసారి సన్నివేశం చేసేటప్పుడు ఎలా చేస్తే బావుంటుందని ఐడియాస్ డిస్కస్ చేసుకున్నాం'' అని ఉన్ని ముకుందన్ చెప్పుకొచ్చారు. రిహార్సిల్స్ చేయడం ఆయనకు అంత ఇష్టం ఉండదని చెప్పారు. సీన్ కోసం తాను ప్రిపేర్ అవుతాయని, అయితే రిహార్సల్స్ టైములో ఎలా యాక్ట్ చేసేది కో ఆర్టిస్టులకు చెప్పకుండా కెమెరా ముందు సర్‌ప్రైజ్ చేస్తానని తెలిపారు. అప్పుడు ఎదుటి వ్యక్తి రియాక్షన్లు లైవ్లీగా ఉంటాయన్నారు.
నా క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్పలేను!
'యశోద' ట్రైలర్ చూస్తే... ఉన్ని ముకుందన్ డాక్టర్ రోల్ చేసినట్టు తెలుస్తోంది. ఒక ఫ్రేములో మాత్రం ఆయనకు సమంత గన్ గురి పెడతారు. ఎందుకు? అని అడిగితే... ''ప్రస్తుతానికి నా క్యారెక్టర్ గురించి ఎక్కువ చెప్పలేను. ఎందుకనేది మీరు సినిమా చూస్తేనే తెలుస్తుంది. దర్శకులు హరి, హరీష్ కథ చెప్పిన వెంటనే ఓకే చేశా. అంత నచ్చింది'' అని ఉన్ని ముకుందన్ పేర్కొన్నారు. ట్రైలర్‌కు అన్ని భాషల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోందని... అందరినీ ఆకట్టుకునే కమర్షియల్ ప్యాకేజ్డ్ స్క్రిప్ట్ 'యశోద'కు కుదిరిందని ఆయన తెలిపారు.
Also Read : 'ఊర్వశివో రాక్షసివో' రివ్యూ : ఆరు ముద్దులు, ఆ తర్వాత అర్థమైందిగా - అల్లు శిరీష్ సినిమా ఎలా ఉందంటే?
Unni Mukundan On Surrogacy : 'యశోద' ఫ్యూచరిస్టిక్ స్టోరీ ఐడియాతో తీసిన చిత్రమని, మన సమాజం ఎటు వెళుతుందనేది ఈ సినిమాలో చూపిస్తున్నారని, త్వరలో అది నిజం కూడా అవుతుందని ఉన్ని ముకుందన్ చెబుతున్నారు. ఈ 'యశోద' ట్రైలర్‌లో సరోగసీ కాన్సెప్ట్ చూపించిన సంగతి తెలిసిందే. సరోగసీ గురించి ఉన్ని ముకుందన్ మాట్లాడుతూ ''అది వ్యక్తిగతం. సరోగసీ అని చెప్పడం సులభమే. కానీ, అదొక ఎమోషనల్ జర్నీ. ఈజీగా దానిపై కామెంట్ చేయకూడదు. సైంటిఫిక్‌గా చూస్తే... మిరాకిల్. పురాణాల్లో మనం అటువంటి వాటి గురించి విన్నాం. ఇప్పుడు మెడికల్ పరంగా చూస్తున్నాం'' అని చెప్పారు.