Nuvvunte Naa Jathaga Serial July 28th to Aug 1st Weekly Episode నువ్వుంటే నా జతగా సీరియల్ ఈ వారం మొత్తం ఎన్నో ట్విస్ట్‌లతో ఆసక్తికరంగా సాగింది. మిథున తన భర్త దేవాని తండ్రి ముందు మంచి వాడిలా నిరూపించాలని ప్రయత్నించడం.. ఆదిత్య దేవాని బ్యాడ్ చేసి మిథునని దక్కించుకోవాలని పావులు కదపడంతో వారం మొత్తం ఆసక్తికరంగా మారింది. అసలు వారం మొత్తం ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
దేవా మంచి వాడని దేవా వ్యక్తిత్వం అందరికీ అర్థమయ్యేలా ముఖ్యంగా తన తండ్రి జడ్జి హరివర్ధన్ కి తెలిసేలా చేస్తానని వారం రోజులు గడువుతో మిథున దేవాని ఇంటికి తీసుకొస్తుంది. దేవా మిథున ఇళ్లు మిథున గది మిథున రాజభోగం చూసి మిథున నిజంగా కోటలో యువరాణి అని అనుకుంటాడు. మిథున దేవా కోసం స్వయంగా తనకు ఇష్టం లేని నాన్ వెజ్‌ని వండటం.. భర్తని కూడా తండ్రితో కలిసి భోజనం చేసేలా ఏర్పాటు చేయడం దేవాకి ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంటుంది. ఆ ఇంట్లో అందరూ డీసెంట్‌గా ఉండటం దేవా రౌడీ అలవాట్ల చూసి త్రిపుర అయితే గోల గోల చేస్తుంది. దేవా తినడం చూసి అందరూ డైనింగ్ టేబుల్ మీద నుంచి లేచి వెళ్లిపోతారు.
త్రిపుర మామయ్యతో ఇలాంటి వాడిని అల్లుడుగా ఎలా అంగీకరిస్తారు మామయ్య వీడిని ఎందుకు ఇంట్లోకి రానిచ్చారు అని త్రిపుర అడిగితే దేవాని పిలిపించింది అల్లుడుగా ఒప్పుకోవడానికి కాదు మిథునకు వాడు సరిపోడని మిథునకు ఆ దేవాకి అర్థమయ్యేలా చెప్పడానికి అని అంటాడు. మరో ఎపిసోడ్‌లో మిథున దేవా అంటే తనకు ఎంత ఇష్టమో చెప్తుంది. దేవా సిగరెట్ కోసం అల్లాడిపోవడంతో మిథున చిన్న పిల్లలా షాపు దగ్గరకు వెళ్లి సిగరెట్ తెస్తుంది. ఇక దేవాతో నీ ఇష్టాలు కాదు అనను కానీ నువ్వు ఇలా సిగరెట్ మందు తాగితే మా ఇంట్లో వాళ్లు నువ్వు ఏ తప్పు చేసి దొరుకుతావా అని చూస్తున్నారు. మనం మన కాపురాన్ని నిలబెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాం జాగ్రత్తగా ఉండు దేవా అని చెప్తుంది.
దేవా ఓ రోజు రాత్రి పడుకునే ముందు మిథునని గుర్తు చేసుకొని నా కోసం నువ్వు చాలా ఆరాట పడుతున్నావు మిథున.. నేను నీకు సరిపోను అయినా నువ్వు నన్ను నీ భర్తగా కోరుకుంటున్నావు. కోటీశ్వరురాలు అయిన నిన్ను నేల మీద పడుకునేలా చేశా.. తిండి పెట్టలేదు.. ఎండ వానల్లో నిలబెట్టా అయినా నువ్వు తాళి బంధం కోసం నిలబడ్డావు.. నువ్వు లేకపోతే నేను లేను మిథున.. నువ్వు అంటే నాకు ఇష్టం అని మిథునని తాను ప్రేమిస్తున్నట్లు దేవా గ్రహించి జీవితాంతం మిథునతో ఉండాలి అనుకుంటాడు.
మరో ఎపిసోడ్‌లో దేవాతో హరివర్ధన్ మాట్లాడుతాడు. నా కూతురు యువరాణి తను కోరింది ఏదీ నేను కాదు అనను అంటూ కూతురి మీద ప్రేమ చెప్తాడు. మిథునకు నువ్వు సరిపోవు అని చెప్తాడు. దేవా మామతో మిథున సంతోషం కోసం మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఎలా మిథున గురించి ఆలోచిస్తారో నేను అలాగే ఆలోచిస్తాను.. మిథున సంతోషమే నాకు ముఖ్యం అని చెప్తాడు. దేవా మాటలు విన్న మిథున చాలా సంతోషపడుతుంది. మరో సీన్‌లో మిథున దేవాతో మాట్లాడి తన ప్రేమను మళ్లీ దేవాకి చెప్పి దేవా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా అని దేవా తన మనసులో మాట చెప్తాడేమో అని అడుగుతుంది. దేవా మిథునకు తన ప్రేమ గురించి చెప్పే టైంకి ఆదిత్య ఎంట్రీ ఇస్తాడు. ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్తాడు. భయ్యా భలే ఎంట్రీ ఇచ్చావు. మిథున నా భార్య కావాల్సింది ఆ దేవుడు కరుణించలేదు నాకు జీవితం లేదు అని ఎమోషనల్‌గా మాట్లాడి మిథున, దేవా ఆలోచనలో పడేలా చేస్తాడు. ఇక హరివర్ధర్ వాళ్ల ఎదురుగా గుండె పగిలేలా ఏడ్చి మిథున లేకపోతే నాకు జీవితం లేదు మామయ్య నాకు మాటిచ్చారు మిథున నా భార్య ఎప్పటికైనా నాకే సొంతం అని అంటాడు. తమ్ముడి బాధ చూసి త్రిపుర మిమల్ని నమ్మినందుకు నా తమ్ముడికి మంచి బహుమతి ఇచ్చారు అని అంటుంది.
సత్యమూర్తి దేవాలో మార్పు వస్తుందని మిథున వల్లే ఇదంతా సాధ్యమవుతుందని చాలా సంతోషంగా ఉంటాడు. అయితే సూర్యకాంతం ఇక ఇంట్లో మిథున ఉంటే తనకు గుర్తింపు ఉండదని ఇంట్లో అందరూ తనని కోడలిగా అంగీకరించేశారు కాబట్టి ఇళ్లు అమ్మేసి మన వాటా తీసుకొని వెళ్లిపోదామని భర్తని రెచ్చగొడుతుంది. శ్రీరంగం ఓ వ్యక్తిని తెచ్చి ఇంటిని బేరానికి పెడతాడు. తాను బతికుండగానే కొడుకు ఇలా ఇళ్లు ముక్కులు చేయాలనుకున్నాడని కోడలు ఇళ్లు అమ్మేయాలని చూసిందని సత్యమూర్తి మొదటి సారి చాలా ఏడుస్తాడు. మిథున ఉండగా అలా జరగదు అని శారద భర్తని ఓదార్చుతుంది. దేవాని ఎలా బ్యాడ్ చేయాలా అని ఆలోచిస్తున్న ఆదిత్య దేవాతో ఫుల్లుగా తాగించేస్తాడు. దేవాని ఇంట్లో అందరూ నిలదీస్తారు. మిథున కూడా ఎందుకు తాగావు దేవా అని కోప్పడుతుంది. ఇదీ ఈ వారం నువ్వుంటే నా జతగా సీరియల్స్ హైలెట్స్.