Seethe Ramudi Katnam Serial Today Episode సూర్యకి ఆపరేషన్ చేస్తే కాలు వస్తుందని సూర్య అన్న చెప్తాడు. మధు సూర్య చాలా సంతోషిస్తారు. తొందర్లోనే ఆపరేషన్ చేయిద్దామని మధు అంటుంది. జలజ వచ్చి ఆపరేషన్కి చాలా ఖర్చు అవుతుందని అంటే జలజ భర్త ఆపరేషన్‌కి పది లక్షలు అవుతుందని అంటాడు. జలజ ఇక ఆపరేషన్ అవ్వదని అంటుంది. అంత డబ్బు ఎలా తీసుకొస్తావ్ మీ అమ్మనాన్నలని అడుగుతావా మహాలక్ష్మీని అడుగుతావా అని అంటుంది.
మధు: వాళ్లని ఎందుకు అడుగుతాను మా నాన్నతో సీతనో అడుగుతాను. వాళ్లు పరాయి వాళ్లు కాదు మన మీద ప్రేమ ఉన్నవాళ్లు. సీత నాకోసం ఏమైనా చేస్తుంది.
సూర్య: అయినా సరే వద్దు.
మధు: సూర్య సీతకి మనం అన్నా మన ప్రేమ అన్నా చాలా ఇష్టం అది తలచుకుంటే ఏమైనా చేస్తుంది నువ్వు ఒప్పుకో.
సూర్యఅన్న: వారంలో ఆపరేషన్ చేయాలంట మధు.
మధు: చేద్దాం బావగారు సీత నాకోసం ఏమైనా చేస్తుంది.
జలజ: ఈ సూర్య ఎలా నడుస్తాడో ఆ సీత ఎలా డబ్బు ఇస్తుందో నేను చూస్తా.
ఉదయం మహాలక్ష్మీ, అర్చనలు జాగింగ్ డ్రస్ వేసుకొని జాగింగ్ చేస్తుంటారు. సీత కూరగాయలు తీసుకొని వచ్చి ఇద్దరినీ వింతగా చూస్తుంది. ఎవరు మీరు మా వీధికి కొత్తగా వచ్చారా అని అంటుంది. ఈ గెటప్‌లో మమల్ని చూస్తే జలసీగా ఉందా అని మహాలక్ష్మీ అంటుంది. దానికి సీత కాలేజీ అమ్మాయిలు అని అంటాను అనుకున్నారా అత్తలు అని అంటుంది. ఇక మహాలక్ష్మీ వీధిలో అత్త అన్నావని అంటే ముఖం పగలగొడతానని అంటుంది. నిన్ను ఎవరూ గౌరవించరని మాకు పెట్టినట్లు నీకు నమస్కారం పెట్టరని మహాలక్ష్మీ అంటుంది. దానికి సీత మీతోనే నేను సెల్యూట్ కొట్టించుకుంటానని అందుకు రేపే ముహూర్తం అని అంటుంది. ఇంట్లో అందరితో రేపు సెల్యూట్ కొట్టించుకుంటానని అంటుంది. మహాలక్ష్మీ ఇంటికి వచ్చి అందర్ని పిలిచి సీత తమని వీధిలో తిరగనిచ్చేలా లేదని అందరూ తమకి నమస్కారం పెడితే తను మాత్రం హేళనగా మాట్లాడిందని రేపు అందరితో సెల్యూట్ కొట్టించుకుంటానని అందని చెప్తారు. రామ్ వాళ్లు సీత సరదాగా అనుంటుందని అంటారు. సీత ఏదో ప్లాన్ చేసిందని సీతకి సెల్యూట్ చేయడం కంటే సిగ్గు చేటు లేదని అర్చన అంటుంది. ఇక రామ్ సీత ప్లాన్ కనుక్కుంటానని అంటే చలపతి ఆపుతాడు. రామ్ సీత దగ్గరకు వెళ్తాడు. ఆషాఢం పేరుతో ఇద్దరిని వేరు చేసిన మీరే ఇప్పుడు ప్లాన్ పేరుతో దగ్గరుండి పంపారని చలపతి అంటాడు.
రామ్ సీత దగ్గరకు వెళ్తాడు. సీత కూరగాయలు కట్ చేస్తుంటే సీత చూడకుండా వెళ్లి సీతకి డౌట్ రాకుండా విషయం తెలుసుకోవాలని అనుకుంటాడు. రామ్ ప్రేమగా మాట్లాడుతాడు. ప్లాన్ కనిపెట్టడానికే రామ్ వచ్చాడని కాసేపు రామ్‌తో ఆడుకుంటానని అంటుంది. వీధిలో మా ఇద్దరు పిన్నిలతో ఛాలెంజ్ చేశావని అది నాకు భలే నచ్చిందని సీత దగ్గర నిజం లాగడానికి హగ్ చేసుకుంటాడు. సీత నిజం చెప్తాననే నెపంతో రామ్‌తో పనులు చేయిస్తుంది. కూరగాయలు కట్ చేయిస్తుంది. బట్టలు మడతపెట్టిస్తుంది. అంట్లు తోమిస్తుంది. అన్నీ పనులు చేసిన రామ్ ప్లాన్ చెప్పమంటే రేపు చెప్తా వెళ్లు అని నీ ప్లాన్ నాకు తెలుసని పంపేస్తుంది.
ఉదయం అందరూ సీత ఎందుకు సెల్యూట్ కొట్టిస్తుందో అని టెన్షన్ పడతారు. ఇక చలపతి ఇంట్లో అందరికీ బయటకి రమ్మని బయట జాతీయ జెండాతో పాటు స్వతంత్ర వీరుల ఫొటోలు ఉన్నాయని అంటాడు. దాంతో రామ్ ఈ రోజు ఆగష్టు 15 అని అంటాడు. ఇక కాలనీ జనాలు కూడా ఇంటి ముందు ఉన్నారని చెప్పి చలపతి అందర్ని బయటకు తీసుకెళ్తాడు. అందరూ అది మహా ప్లాన్ అనుకొని పొగుడుతారు. దీనంతటికి సీతే కారణం అని సీతకి సెల్యూట్ కొట్టాలని చలపతి అంటాడు. ఇంతలో సీత చేతిలో జెండా పట్టుకొని భరతమాత వేషం వేసుకొని వస్తుంది. అందరూ సీతని చూసి ఆనంద పడతారు. మహా బ్యాచ్ షాక్ అయిపోతారు. కాలనీ వాసులు సీతని పొగుడుతారు. మహాలక్ష్మినే తనకు ఆ వేషం వేసుకోమని చెప్పిందని సీత చెప్తుంది. మహాలక్ష్మీ గారి అనువణువునా దేశ భక్తి పొంగి పొర్లుతుందని మహాని ఇరికించేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.