Seethe Ramudi Katnam August 28th: గేటు వద్ద కిరణ్, రేవతిని వాచ్‌మెన్ ఆపేయడంతో మేడ పై నుంచి చూసిన సీత...వాళ్లను లోపలకి పంపించమని వాచ్‌మెన్‌కు చెబుతుంది. గిరి, అర్చన హాల్‌లో మాట్లాడుకుంటుండగా...మహా, జనార్ధన్ అక్కడికి వచ్చి రేవతి గురించి ఆరా తీస్తారు. తను ఇంకా ఇంటికి రాలేదని గిరి చెబుతాడు. అప్పుడే కిరణ్ రేవతి చేయి పట్టుకుని ఇంటి లోపలకి వస్తాడు.
జనార్ధన్: అరేయ్...నా చెల్లి చేయి వదలరా..
కిరణ్: వదలడానికి కాదు పట్టుకుంది.
జనార్ధన్: వెంటనే చేయి వదలకపోతే...ఆ చేయి నరికేస్తా, మర్యాదగా నా చెల్లిని వదిలి బయటకు వెళ్లు.
రేవతి: గొడవలు వద్దు వెళ్లుపో కిరణ్...
కిరణ్: అరే...ఎందుకు భయపడుతున్నావ్. మనం ఏం తప్పు చేశాం. మనం ఏం చిన్న పిల్లలం కాదు. మేజర్లం
జనార్ధన్: మేజర్లు అయితే మొగుడు, పెళ్లాల్లా ఊరంతా తిరిగి మా పరువు తీస్తారా..?
కిరణ్: పెళ్లిచేసుకోబోయే వాళ్లం...కలిసి తిరిగితే తప్పేంటి..?
గిరి: మీ పెళ్లి చేస్తామని మేం చెప్పామా...ఈ పెళ్లి జరగదని ముందే చెప్పాం
కిరణ్: మా పెళ్లి చేస్తానని సీత చెప్పింది
అర్చన: సీత చెబితే ఈ పెళ్లి జరిగిపోతుందా..ఈ పెద్ద సీత అనుకుంటున్నారా..?
మహా: తనతో డిస్కషన్ ఏంటి..అయినా అతన్ని ఈ ఇంటికి ఎవరు రమ్మన్నారు.
అప్పుడే అక్కడికి వచ్చిన సీత నేనే రమ్మన్నానని చెబుతుంది. వాళ్లను ఇంట్లోకి పిలిచింది నేనే అంటుంది. వాళ్లతో మాట్లాడడానకే పిలిచానన్నారు. మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేయడానికే పిలిచానని చెబుతుంది.
జనార్ధన్: వాళ్ల పెళ్లి ఫిక్స్ చేయడానికి నువ్వెవరు..? నీకేం అధికారం ఉంది.
సీత: వాళ్లు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకుంటున్నారు. అందుకే ఈ ఇంటి కోడలుగా వాళ్ల పెళ్లి ఫిక్స్ చేశాను
గిరి: ఇంటి కోడలు అయితే ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకుంటావా...ఈ ఇంటి పెద్దవాళ్లం మేం లేమా
అర్చన: నీకు నువ్వే పెద్దరికం తీసుకున్నావా
రామ్: అత్తయ్య పెళ్లి కిరణ్‌తో జరపాలని ముందే అనుకున్నాం కదా పిన్ని..ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు.
మహా: రామ్...నువ్వు మధ్యలో మాట్లాడకు..వీళ్ల పెళ్లి చేయాలని సీత అనుకుంది తప్ప మేం కాదు
సీత: మీ అందరితో చెప్పే కదా వీళ్ల పెళ్లి చేస్తానని అన్నాను. పైగా మీ చేతుల మీదుగానే వీళ్ల పెళ్లి చేస్తానని చెప్పాను
జనార్ధన్: ఇతనితో రేవతి పెళ్లి చేయడం మాకు ఇష్టం లేదు. మేం ముందునుంచీ ఇదే చెబుతున్నాం.
రామ్: వాళ్లిద్దరూ ఇష్టపడిన తర్వాత ఇప్పుడు వద్దంటే ఎలా నాన్న
మహా: నిన్ను మాట్లాడవద్దని చెప్పాను కదా రామ్.. సీత కన్నా బుద్ది లేదు..నీకు కూడా లేదా...పెద్దలను గౌరవించాలని తెలియదా
సీత: ప్రేమను గౌరవించాలని పెద్దవాళ్లైన మీకు తెలియదా అత్తయ్యగారు
జనార్దన్: ఈ ఇంటికి పరువు, గౌరవం ఉన్నాయి..ఎవడుపడితే వాడు వచ్చి మా చెల్లిని పెళ్లి చేసుకుంటానంటే నేను ఒప్పుకోను
కిరణ్: మీరు ఇలా అంటారనే...నేను, రేవతి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాం
గిరి: అంటే మాకు ఇష్టం లేకుండానే మా చెల్లిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటావా
సీత: అయితే మీరే దగ్గర ఉండి పెళ్లి చేయండి చిన్న మామయ్య
అర్చన: చచ్చినా ఆ పెళ్లి చేయం..ఓ అనామకుడికి మా ఆడబిడ్డను ఎలా ఇస్తాం
సీత: అతను ఏం అనామకుడు కాదు చిన్న అత్తయ్య
మహా: అనామకుడు కాక...రాయల్ కుటుంబం నుంచి పుట్టుకొచ్చాడా..? ఈ ఇంటి ఆడపిల్లను పెళ్లి చేసుకునే అర్హతం ఏంటి.?
జనార్ధన్: అతని తల్లిదండ్రులు ఎవరో తెలియదు..ఎక్కడ పుట్టి పెరిగాడో తెలియదు. అలాంటి వాడికి నా చెల్లెను ఎలా ఇస్తాను
సీత: ఈ కాలంలో కూడా ఇలాంటి పట్టించుకుంటారా మామయ్య..ఏ అర్హత ఉందని అతనికి మీ ఆఫీసులో జాబ్ ఇచ్చారు. మీ కంపెనీ నడపడానికి మాత్రం అతను కావాలి..కానీ మీ కుటుంబంలోకి మాత్రం వద్దా
అర్చన: అతను ఆ ఉద్యోగానికి కూడా అర్హుడు కాదని అప్పుడే మహా అతన్ని ఉద్యోగం నుంచి తీసివేసింది
సీత: అతన్ను ఉద్యోగం నుంచి ఎందుకు తీసివేశారో నన్ను చెప్పమంటారా..?
మహా; అప్పుడే ఏం జరిగిందో ఇప్పుడు అనవసరం
సీత: ఏం గతాన్ని తవ్వితే మీ తప్పులు బయటపడతాయాని భయపడుతున్నారా
మహా: అతనే తప్పు చేశాడు
సీత: తప్పు ఎవరు చేశారో మీ అంతరాత్మకు తెలుసు
మహా: మాటలు అనవసరం సీత..అతనికి రేవతిని పెళ్లి చేసుకునే అర్హత లేదు.
సీత: ఏ అర్హత కావాలి మీకు.. ఆరోజు ఆస్తి లేదన్నారు. ఇప్పుడు కావాల్సినంత సంపాదించాడు. ఎంతో మందికి ఆయన కేరాఫ్ అడ్రస్ అయ్యారు. ఇప్పుడు అతనికే కేరాఫ్ అడ్రస్ లేదంటున్నారు. ఇక కులగోత్రాలు అంటారా..? గుణానికి మించిన గోత్రం ఏముంది.? ఇక తల్లిదండ్రుల సంగతి అంటార..ఈరోజు అతను ఇంత గొప్పవాడు అయ్యాడంటే ఖచ్చితంగా ఆయన తల్లిదండ్రులు ఇంతకు మించి గొప్పవారే అయ్యి ఉండొచ్చు.
జనార్దన్; ఇవన్నీ పుస్తకాల్లో రాసుకోవడానికి ,సోషల్ మీడియాలో పోస్టు చేసుకోవడానికి బాగుంటాయి. ప్రాక్టికల్‌గా వర్కవుట్ అవ్వదు
సీత; ఎందుకు అవ్వదు మామయ్య.. వీళ్లకు ఆదర్శ వివాహం చేసి మీరు గొప్పవాళ్లు అనిపించుకోవచ్చు కదా
అర్చన: ఇప్పటి వరకు ఈ ఇంట్లో ప్రేమ పెళ్లి జరగలేదు. మున్ముందు కూడా జరగదు సీత
సీత; ఇప్పటి వరకు ఈ ఇంట్లో ప్రేమ పెళ్లి జరగలేదా..? ఈ కుటుంబ మొదలయ్యిందే ప్రేమ పెళ్లితో..జనార్దన్ మామయ్య, సుమతి అత్తమ్మలు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నాది, రామ్‌ది పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా...వాస్తవానికి మేమిద్దరం ప్రేమించుకున్నాం
మహ: ఏదీ ఏమైనా ఈ పెళ్లి జరగదు
సీత: జరిగి తీరుతుంది
జనార్దన్: మేం ఒప్పుకోకపోతే ఎలా జరుగుతుంది.? ఎవరు జరిపిస్తారు.
సీత: నేను జరిపిస్తాను...రేపు మంచిరోజు, రేపే వీళ్లకు నిశ్చితార్థం జరిపిస్తాను
మహా; మా ఇష్టం లేకుండా..మా ప్రమేయం లేకుండా ఎలా జరిపిస్తావు
జనార్దన్: ఈ అనాథగాడితో మా చెల్లి నిశ్చితార్థం చేయం
గిరి: మేం లేకుండా ఈ నిశ్చితార్థం ఎలా జరిపిస్తావో మేం చూస్తాం
రేవతి: మీరు లేకుండా నేను ఈ పెళ్లి చేసుకోను అన్నయ్యా...దయచేసి కాదనకండి. మీరే దగ్గర ఉండి మా పెళ్లి చేయాలి. నాకు అమ్మ,నాన్నా అన్నీ అన్నయ్యలే...వాళ్లు లేకుండా నేను నిశ్చితార్థం చేసుకోను.
సీత:వాళ్లు లేకుండా నీ నిశ్చితార్థం ఎలా అవుతుంది పిన్నీ...రేపు జనార్దన్ మామయ్య, మహాలక్ష్మీ అత్తయ్యతోనే నిశ్చియ తాంబూలాలు ఇప్పిస్తాను
మహా: ఎంటీ..మా చేతే నిశ్చయ తాంబూలాలు ఇప్పిస్తావా..?
సీత: మీరే ఈ పెళ్లి చేయాలని రేవతి పిన్ని పట్టుబడుతున్నప్పుడు...మీరు కాకపోతే ఇంకెవరు ఇస్తారు
జనార్దన్; కలలో కూడా ఆ పని చేయం
సీత: నా కళ్లముందే ఆ పని చేస్తారు మామయ్య...నేను చేయిస్తాను. మీతో తాంబూలాలు ఇప్పించి తల ఎగరవేయకపోతే నేను సీతనే కాదు.
మహ: మా చేత తాంబూలాలు ఎలా ఇప్పిస్తావో నేను కూడా చూస్తాను
వాళ్లంతా ఇంట్లోకి వెళ్లిపోవడంతో సీత కిరణ్‌ను వెళ్లి రేపు నిశ్చయ తాంబూలాలకు ఏర్పాట్లు చేసుకుని రమ్మని చెబుతుంది. కిరణ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రేవతి రేపు నిశ్చితార్థం ఎలా జరుగుతోందనని భయపడుతుంది. ఇప్పటి వరకు రామ్ మనతోటి ఉన్నాడని..ఇప్పుడు అందరూ కలసి రామ్ నోరు మూయించారని రేవతి బాధపడుతుంది. మహాలక్ష్మీ వదిన మాట రామ్ జవదాటడని అంటుంది. నేను అవన్నీ చూసుకుంటానని సీత అభయమిస్తుంది.
గదిలోకి వెళ్లిన తర్వాత రామ్‌ను సీత నిలదీస్తుంది. అంత గొడవ జరుగుతుంటే నువ్వు మౌనంగా ఉండటమేంటని అడుగుతుంది. మహాలక్ష్మీ చెప్పిన మాట వినడమేనా నీపని.ఇలాంటి సమయంలో కూడా నువ్వు నోరు మెదపకపోతే ఎలా మామ.ఇంతలో అక్కడికి వచ్చిన విద్యాదేవి కూడా రామ్‌ను తప్పుబడుతుంది. అలా సైలెంట్‌గా ఉండటం కరెక్ట్ కాదని చెబుతుంది. పెద్దవాళ్లు మాట్లాడుతుంటే మధ్యలో తలదూర్చడం ఎందుకని మాట్లాడలేదని రామ్ చెబుతాడు. మీరే మా సుమతి అత్తమ్మలా మీ అబ్బాయికి ధైర్యం నూరిపోయండి అని విద్యాదేవితో చెబుతుంది. దీంతో విద్యాదేవి రామ్‌కు ధైర్యం చెబుతుంది. మీ పిన్నిని ఎదురించమని చెబుతుంది. ఈ ఇంటి వారసుడిగా నువ్వు గట్టిగా మట్లాడే సమయం వచ్చిందని చెబుతారు. దీంతో ఉక్రోషం పొంగిన రామ్...వాళ్ల పిన్ని, నాన్న వద్దకు వెళ్లడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.