Satyabhama Today Episode క్రిష్‌ తన అన్న రుద్ర చేసిన పనికి తిడతాడు. వదిన బిడ్డ కావాలి అని కోరి కాళ్లు పట్టి బతిమాలుతున్నా కనీసం గౌరవం ఇవ్వకుండా పశువులా ప్రవర్తిస్తున్నావ్ అని తిడతాడు. నాకే నీకు పట్టిన అదృష్టం పడితే సత్యని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని క్రిష్ అంటాడు. రాక్షసుడిలా ఎందుకు మారావ్ అని అన్నని అడుగుతాడు. రోజు రోజుకు పశువులా తయారవుతున్నావ్ అని క్రిష్ అనగానే రుద్ర క్రిష్ కాలర్ పట్టుకుంటాడు. అడ్డుకున్న సత్యను రుద్ర తోసేయడంతో క్రిష్ కూడా అన్న కాలర్ పట్టుకొని ఇద్దరూ గొడవ పడతారు. 


ఇంతలో మహదేవయ్య, భైరవి శబ్ధం విని రుద్ర గది దగ్గరకు వస్తారు. దాంతో అన్నదమ్ములు కొట్లాట ఆపి మంచిగా మాట్లాడుకుంటున్నట్లు నటిస్తారు. ఇక భైరవి రుద్ర షర్ట్ చిరిగిపోవడం చూసి ఏమైంది అని అడిగితే తన కోసం మామిడి కాయలు కోస్తేంటే చిరిగిపోయిందని రేణుక చెప్తుంది. ఇక మహదేవయ్య అక్కడి వాతావరణం చూసి అంతా మంచిగే ఉంది కదా అని అడుగుతాడు. దానికి వెంటనే క్రిష్ వదినకు పుట్టబోయే బిడ్డ గురించి మాట్లాడుకుంటున్నాం అని కవర్ చేస్తాడు. దాంతో మహదేవయ్య, భైరవిలు వెళ్లిపోతారు.


క్రిష్: బాపు వదిన విషయంలో ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడో చూశావు కదా. ఇంకొక్కసారి వదిన జోలికి వెళ్తే బాపుతో నీ గురించి నిజం చెప్పాల్సి ఉంటుంది. జాగ్రత్త. (తమ గదిలో..) ఏంటి అలా చూస్తున్నావ్. ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా. నువ్వేం చెప్పినా ఏమీ అనుకోను చెప్పు సత్య.
సత్య: మనసులో.. ఆడదాన్ని ఇంత గౌరవించేవాడివి నన్ను ఎందుకు ఏడిపించావ్ అని అడగాలి అని ఉంది. భార్య అంటే ఎందుకు ఇంత గౌరవం ఉన్న వాడివి నన్ను ఎందుకు బలవంతంగా భార్యని చేసుకున్నావ్ అని అడగాలి అని ఉంది. 
క్రిష్: నువ్వు అడక్కపోయిన నేను చెప్పనా. మా అన్నలోనూ నా లోను ఉన్నది ఒకటే రక్తం కానీ నేను మా అన్న లెక్క కిరాతకుడిని కాను.
సత్య: మనసులో.. మరి ఎందుకు నన్ను కిడ్నాప్ చేసి ఎందుకు నన్ను ఓ రాత్రి ఇంటికి దూరంగా ఉంచావ్.
క్రిష్: మా వదిన పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది. ఏం చేస్తాం చెప్పు. పులి జింక ఒకే బోనులో ఉంటే ఎంతని పులికి కాపలా ఉంటాం.  
సత్య: మనం పెరిగిన వాతావరణం బాలేనప్పుడు ఎవరి మానసిక స్థితి అయినా ఇలాగే ఉంటుంది. ఎంత మంచి చెప్పినా బుర్రలోకి వెళ్లదు. అప్యాయతలు ఆపేక్షలు తెలీదు.
క్రిష్: నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావ్. 
సత్య: మీ అన్నయ్య గురించే. భర్త ప్రేమించాలే తప్ప రాక్షసుడిలా ప్రవర్తించకూడదని తెలీదా. భార్య మనసు గాయపడితే జీవితంలో ఇక భర్తని ప్రేమించలేదు. దగ్గర కాలేదు అని తెలీదా. నమ్మకం ఉన్న వరకే ఏ బంధం అయినా. నేను మాట్లాడుతున్నది మీ అన్నయ్య లాంటి అందరి మగాళ్లు గురించి. 


హర్ష నందినిని ఇంటికి తీసుకొస్తాడు. ఇంతలో భైరవి అల్లుడితో మంచిగా మాట్లాడుతూనే ఇళ్లరికం గురించి అడుగుతుంది. హర్ష నందినితో దీని గురించి రచ్చ చేయడానికేనా నన్ను తీసుకొచ్చావ్ అంటాడు. ఇంతలో క్రిష్, సత్యలు వస్తారు. క్రిష్ బామ్మర్ది ఎప్పుడొచ్చావ్ అంటూ హర్షతో ప్రేమగా మాట్లాడుతాడు. హర్ష అక్కడి నుంచే వెళ్లిపోతా అంటే సత్య, మహదేవయ్య అందరూ ఉండమని అంటారు.


మహదేవయ్య: అల్లుడు మా మర్యాదలు మొరటుగా ఉంటాయి. మా మాట కాదు అని బయల్దేరావే అనుకో మా వాళ్లు కుర్చీకి కట్టేస్తారు. నీ ఇష్టం. అందరూ నవ్వుకుంటారు. ఇదిగో భైరవి అల్లుడొచ్చాడు వంటలు చాలా గ్రాండ్‌గా ఉండాలి.
నందిని: హాయ్ పెద్దన్న నేను లేని లోటు నీకు అయినా తెలుస్తుందా. హాయ్ వదినా కంగ్రాట్స్. ఈ ఇంటికి వారసుడిని ఇస్తున్నావ్ అంట కదా. న్యూస్ తెలిసింది. అది కాదు అన్న చిన్న చిన్న వాటికి కూడా పార్టీలు ఇస్తావ్. తండ్రిని కాబోతున్నావ్. మీసం తిప్పబోతున్నావ్.  ఈ ఇంటికి వారసుడిని ఇస్తున్నావ్ మరి పార్టీలేదా.. 
రుద్ర: ఏయ్ సతాయించకు. అది పార్టీ కోసం మన మీద ప్రేమ మీద రాలేదు. దాని అత్తింటి వారికి సిగ్గులేదా. అడగ్గానే పంపేస్తున్నారు. ఎన్నిసార్లు పోతావ్ అని లెక్కలు అడగరా నీ లెక్క. 
భైరవి: మనసులో.. ఏంటి పోయి పోయి నా మీద పడుతున్నాడు.
నందిని: నేను వస్తే నీకు ఏంటి నొప్పి. నా పుట్టిళ్లు నేను ఎప్పుడైనా వస్తా.
రుద్ర: వచ్చిన దానివి ఓ ముద్ద తినేసిపో. పార్టీలు కావాలంట పనీ పాట లేనట్లు. 
నందిని: చూడమ్మ పెద్దన్న ఎలా మాట్లాడుతున్నాడో పార్టీ ఇస్తే ఇవ్వమను లేదంటే లేదు. నేను పుట్టింటికి వస్తే వీడికేంటి నొప్పి. 
పంకజం: కోపంలో అన్నా ఉన్నమాటే అన్నారు కదా అమ్మ. అయినదానికి కాని దానికి పనికట్టుకొని పని లేకపోయినా ఆడపిల్ల ఇలా పుట్టింటికి వస్తే ఇలానే అంటారమ్మ. ఏ ఆడపిల్ల పెళ్లి తర్వాత పుట్టింటికి చుట్టమే అవుతుంది. 
భైరవి: ఏయ్ నీ ఇష్టం వచ్చినట్లు ఒరవకు. ఈ ఇంట్లో నా బిడ్డ ఇష్టాలు అన్నీఅలాగే ఉంటాయి. చూస్తుండు కొన్ని రోజులకు నా బిడ్డను నా దగ్గరకు తెచ్చుకుంటా.



సత్యకు సంధ్య కాల్ చేస్తుంది. ఇద్దరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుతారు. ఇక సంధ్య తాను మళ్లీ కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయ్యానని చెప్తుంది. నాన్న ఒప్పుకున్నారా అని సత్య అడుగుతుంది.


సంధ్య: మొన్నటి వరకు నాన్న భయపడ్డారు. కానీ ఎప్పుడు అయితే బావగారు కాళీని చితక్కొట్టి ఇంటికి తీసుకొచ్చారో ఆ రోజు  నుంచి నాన్నకి ధైర్యం పెరిగింది. మళ్లీ నన్ను ఇన్‌స్టిట్యూట్‌లో చేర్పించారు. 
సత్య: మీ బావగారు కాళీని కొట్టి ఇంటికి తీసుకురావడం ఏంటి. అది ఎప్పుడు జరిగింది ఏంటి ఇష్యూ.
సంధ్య: అయ్యో అక్క నాకు క్లాస్‌కి టైం అయింది తర్వాతా చేస్తా.. అయ్యో అనవసరంగా నోరు జారానే..
సత్య: అందరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. డైరెక్ట్‌గా క్రిష్‌ని అడిగి తెలుసుకుంటా.. క్రిష్ మొన్న నువ్వు ఒంటి నిండా దెబ్బలతో ఇంటికి వచ్చావ్. ఏం జరిగింది అంటే మాట దాటేశావ్. అసలు ఏం జరిగింది. 
క్రిష్: మనసులో.. నిజం చెప్పొచ్చు. కానీ కాళీ మళ్లీ మన జీవితంలోకి ఎంటర్ అయ్యాడు అంటే నీకు నా మీద కోపం వస్తుంది. మన కథ మళ్లీ మొదటికి వస్తుంది.
సత్య: ఎవరి వల్ల ఆ కొట్లాట. మా పుట్టింటి వాళ్ల వల్లే కదా. 
క్రిష్: అర్థం లేకుండా మాట్లాడకు. మా దోస్త్‌ గాడికి గొడవ అంటే పోయా.
సత్య: నాకు సరైన సమాధానం వచ్చే వరకు నువ్వు కదలడానికి వీళ్లేదు. నువ్వు గొడవ పడింది కాళీ గాడితోనే కదా. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 24 ఎపిసోడ్: కార్తీక్‌ ఇంట్లో దీప హడావుడి.. దీప మాటలకు విషం తాగి చచ్చిపోతానన్న కాంచన..!