బుల్లితెర పై కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాకింగ్ రాకేష్. ఇటీవల ‘జబర్దస్త్’ షోలో తనతో పాటు స్కిట్స్ చేస్తున్న సుజాతతో ప్రేమలో ఉన్నట్లు రకేష్ ప్రకటించాడు. గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట తాజాగా పెళ్లి బంధంతో ఒక్కటైంది. తిరుపతిలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో సుజాతతో ఏడడుగులూ వేశాడు రాకేష్. వీరి పెళ్లి ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లికి జబర్దస్త్ నుంచి పలువురు కమెడియన్లు కూడా హాజరైనట్లు తెలుస్తోంది.  


రాకేష్ ఫ్యామిలీ దాదాపు 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చేసింది. ఆ తర్వాత రాకేష్ మిమిక్రీ ఆర్టిస్టు గా కెరీర్ ను ప్రారంభించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా ప్రోగ్రాంలు ఈవెంట్లు చేసి పాపులర్ అయ్యాడు. తర్వాత తనకున్న పాపులారిటీ టాలెంట్ తో జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో ధనరాజు టీం లో ఒక కమెడియన్ గా చేశాడు. తర్వాత కిరాక్ ఆర్పీ టీమ్ లో చేరాడు. తర్వాత వీరిద్దరూ టీమ్ లీడర్లు గా చేశారు. ఆర్పీ ‘జబర్దస్త్’ నుంచి వెళ్లిపోవడంతో తానే టీమ్ ను లీడ్ చేశాడు రాకేష్. మొదట్లో చిన్న పిల్లలతో ఎక్కువగా స్కిట్ చేస్తూ వచ్చాడు రాకేష్. తర్వాత అందరిలాగా స్కిట్ చేస్తూ వస్తున్నాడు. మరోవైపు సుజాత కూడా న్యూస్ ప్రజెంటర్ గా కెరీర్ ను ప్రారంభించి అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత బిగ్ బాస్ లో ఎంట్రీతో మరింత పాపులర్ అయింది. అంతకుముందే రాకింగ్ రాకేష్ తో సుజాతకు పరిచయం ఉంది. పలు టీవీ ప్రోగ్రాంలలోనూ కనిపించింది సుజాత. తర్వాత రాకింగ్ రాకేష్ టీంమ్ లో కనిపించింది. వీరిద్దరూ కలసి పలు స్కిట్ లు చేశారు. 


ఇలా వీరి పరిచయం కాస్తా ‘జబర్దస్త్’ ద్వారా స్నేహం గా మారింది. తర్వాత ఒకరినొకరు ఇష్టపడటంతో తాము ప్రేమలో ఉన్నట్టు ‘జబర్దస్త్’ వేదికగా ప్రకటించారు. సాధారణంగా ‘జబర్దస్త్’ షో లో ఇలా చాలా జంటలు ప్రేమలో ఉన్నట్లు కనిపించేవారు. కానీ అదంతా కేవలం రేటింగ్ కోసమేనని వాస్తవంగా వారు ప్రేమలో లేరని తెలిసేది. అలాగే రాకింగ్ రాకేష్, సుజాతాల జంటను కూడా కేవలం రేటింగ్ కోసమే ఇలా ప్రేమించుకుంటున్నట్లు చెప్తున్నారని కొట్టిపారేశారు నెటిజన్స్. అయితే తర్వాత వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారని తెలిసింది. స్వయంగా వారే తాము త్వరలో  పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నామని ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లికి సిద్దమయ్యింది ఈ బుల్లితెర జంట. గతంలో వీరి నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ఇప్పుడు వీరి పెళ్లి తిరుపతి లో వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, బుల్లితెర ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.


Read Also: ఆ సినిమా ఓ అద్భుతం, 90 సెకన్ల టీజర్‌తో అంచనా వేసేస్తారా? - ‘ఆదిపురుష్’ ఎడిటర్ ఆశిష్