Podharillu Serial Today Episode: రిసార్ట్ నుంచి చక్రి, మహాలక్ష్మీ కుటుంబాన్ని పంపించేందుకు ఆది ఓ మంచి పథకం వేస్తాడు. మనం వాళ్లతో తాడు ఆట ఆడదామని... ఓడిపోయిన వాళ్లు రిసార్ట్ వదిలిపెట్టి వెళ్లాలనే కండిషన్ పెడదామని చెబుతాడు. ఛీ వాళ్లతో ఆటలేంటని ప్రతాప్ అంటాడు. లేకపోతే వాళ్లను ఇక్కడే చూస్తూ మనం ప్రశాంతంగా ఉండలేమని....వాళ్లకోసం మనం రిసార్ట్ వదిలిపెట్టి వెళ్లిపోవడం ఏంటని ఆది అంటాడు. అయితే సరేనని ప్రతాప్ అంటాడు. తాడు ఆడుతున్న చక్రి వద్దకు వెళ్లి తాడు పట్టుకుంటాడు. దీంతో బావాబావమరుదులు తాడు చెరోవైపు లాగుతుండగా...కేశవ్ రాగానే ప్రతాప్ కూడా వచ్చి తాడుపట్టుకుంటాడు. అయితే పందెం ఉంటేనే ఆడదామని ఆది ప్రతిపాదన చేస్తాడు. మీరు ఓడిపోతే రీసార్ట్ వదిలిపెట్టి వెళ్లిపోవాలని అంటాడు. మీరు ఓడిపోయినా అదే పని చేయాలని చక్రి చెప్పడంతో....ఆది ఓకే అంటాడు. తండ్రితోపాటు తల్లికూడా రంగంలోకి దిగేసరికి మహాలక్ష్మీ కూడా వచ్చి తాడు ఆట ఆడుతుంది.రెండు కుటుంబాలు పోటాపోటీగా తాడు ఆట ఆడుతుండగా....మహాలక్ష్మీ వాళ్లు గెలుస్తారు.తాడు గట్టిగా లాగేసరికి ప్రతాప్ కిందపడిపోతాడు.దీంతో నాన్న అంటూ మహాలక్ష్మీ దగ్గరకు రాగా....ప్రతాప్ వద్దని వారించి లేచి వెళ్లిపోతాడు. దీంతో చక్రి...ఆదిని ఉడికిస్తాడు.ఓడిపోయిన వాళ్లు రిసార్ట్ వదిలిపెట్టి వెళ్లిపోవాలని గుర్తుచేస్తాడు.దీంతో మాధవ్ కలుగుజేసుకుని ఇదంతా ఏదో సరదాగా ఆడుకున్న ఆటని...ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదని చెబుతాడు. అయినా సరే ఆది కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఆటలో గెలిచిన తర్వాత కూడా మహాలక్ష్మీ దిగాలుగా కూర్చుని బాధపడుతుండగా...కన్నా వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. ఎప్పుడూ మానాన్న గెలవడమే చూశానని....ఇప‌్పుడు ఓడిపోవడం చూసి బాధ కలగుతోందని అంటుంది.మనం గెలిచినందుకు ఆనందపడాలో...మానాన్న ఓడిపోయినందుకు బాధపడాలో తెలియడం లేదంటుంది. నువ్వు ఇవన్నీ ఏం ఆలోచించకు వదినా అంటూ చెప్పి వెళ్లిపోతాడు. ప్రతాప్ వాళ్లు రిసార్ట్ వదిలి వెళ్లిపోతుండగా..మహా ఎదురుపడుతుంది. ఎక్కడికి వెళ్లినా నన్ను బాధపెట్టడానికి ఇలా ఎదురువస్తూనే ఉంటుందా అని ప్రతాప్ చిరాకుపడతాడు.ఒకప్పుడు తాను ఎదురువస్తేనే బయటకు వెళ్లే తండ్రి...ఇప్పుడు తాను ఎదురుపడితే చిరాకుపడటం చూసి మహా చాలా బాధపడుతుంది. ఇంతలో లలిత అక్కడికి వచ్చి...నువ్వు చేసిన పనికి తల ఎత్తుకోలేక మీనాన్న ఇంటినుంచి భయటకు వెళ్లడమే మానేసి....ఇంట్లోనే ఉండి బాధపడుతున్నారని అంటుంది. ఆయనకు ఆ బాధ తొలగించి మనసు కుదుటపడేలా చేద్దామంటే...నువ్వు ఇక్కడికీ దాపురించి మరింత బాధపెడుతున్నావా అని మండిపడుతుంది. ఆది కూతురుని తీసుకుని బయటకు వచ్చి ఫోన్‌లో మాట్లాడుతుండగా...మహాలక్ష్మీ సిరిపాపతో మాట్లాడుతుంది. వాళ్ల అన్నయ్య చూస్తే గొడవ చేస్తాడని ఆ చిన్నారిని అక్కడి వదిలేసి బాధగా రూమ్‌కు వెళ్తుంది. వదిన బాధ చూసిన కన్నా...సిరిపాప దగ్గరకు వెళ్లి మహాదగ్గరకు వెళ్దామా అంటూ ఆ చిన్నారిని ఎత్తుకుని వెళ్తాడు. మహారూమ్ ముందు వదిలిపెట్టి వెళ్లిపోతాడు. సిరి మహారూమ్‌లోకి వెళ్లిపోతుంది. పాప కనిపించకపోయేసరికి కంగారుపడిన ఆది రిసార్ట్ మొత్తం వెతుకుతుంటాడు. ఇంతలో చక్రి వాళ్లు ఎదురుపడేసరికి వాళ్లతో గొడవపడతాడు. మీరే మా అమ్మాయిని కిడ్నాప్ చేశారని అంటాడు. దీంతో కేశవ్,చక్రి ఇద్దరూ ఆదితో గొడవపడతారు.మీ అమ్మాయిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం మాకు ఏముందని నిలదీస్తారు.మీనాన్నను కత్తితో పొడిచానని మీరే మా అమ్మాయిని ఎత్తుకెళ్లిపోయి ఉంటారని అంటాడు. దీంతో మాధవ్ కల్పించుకుని మేం అలాంటి పనులు చేయమని చెబుతాడు.ముందు పాపన వెతుకుదాం పదండని అంటాడు. దీంతో అందరూ కలిసి సిరిని వెతుకుతుంటారు. ప్రతాప్ వచ్చి సీసీ కెమెరాలో చూద్దామని చెబుతాడు. సీసీ కెమెరాల్లో చూడగా....కన్నా పాపను ఎత్తుకుని వెళ్లడం కనిపిస్తుంది. ఖచ్చితంగా పాప వాళ్ల రూమ్‌లోనే ఉంటుందని అందరూ అక్కడికి వెళ్తారు.మళ్లీ అక్కడ చక్రి,ఆది కొట్టుకుంటారు. ఈ గొడవ చూసి మహా బయటకు వస్తుంది.అప్పుడే అక్కడికి వచ్చిన కన్నాపై ప్రతాప్ చేయిలేపడంతో వచ్చి అడ్డుకుంటుంది. ఎవరిమీదపడితే వాళ్లమీదకు చేయిలేపితే చెంపపగులుతుందని వార్నింగ్ ఇస్తుంది. సిరిపాప నా దగ్గరే ఉందని..మీరు నన్ను కలవనివ్వకపోవడంతో కన్నా తీసుకొచ్చి నాకు ఇచ్చాడని చెప్పి గట్టిగా అందరికీ క్లాస్ పీకుతుంది. దీంతో అందరూ ఎటువాళ్లు అటు వెళ్లిపోతారు.చక్రి వాళ్లు కూడా ఇంటికి వెళ్లిపోతారు.అయితే అప్పుడే మహా సర్టిఫికేట్లు వచ్చాయని...రేపు వచ్చి తీసుకోమని చక్రికి ఫోన్ రావడంతో అందరూ సంతోషపడతారు.
