Continues below advertisement


Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా ఇంట్లో జరిగినదంతా ఆలోచిస్తూ ఉంటే దేవా దగ్గరకు హరివర్ధన్ వస్తాడు. దేవాతో మాట్లాడుతాడు. నా కూతురు చనిపోవడానికి ప్రయత్నించింది అన్న ఆలోచనే నా గుండె కొట్టుకోవడం ఆపేస్తుంది. మా కుటుంబం రోజు సంతోషంగా ఉండటానికి కారణం నువ్వే అని చెప్తాడు.


దేవా మాట్లాడకుండా అలాగే నిల్చొంటాడు. ఒకప్పుడు నేను నిన్ను కొట్టించి జైలులో పెట్టాను. దానికి ఎవరైనా బదులు తీర్చుకోవాలి అనుకుంటారు. కానీ భుజం భరోసాగా ఇవ్వాలి అని ఎవరూ అనుకోరు. కానీ నువ్వు బదులు తీర్చుకోవాలి అనే ఆలోచనే చేయలేదు. మాకు కడుపు కోత కన్నీటి కోత రాకుండా చేశావు. ఒక ఆడపిల్లని కాపాడి తన నూరేళ్ల భవిష్యత్ కాపాడాలి అని చూశావ్ అని భుజం తట్టి థ్యాంక్స్ చెప్తాడు. నువ్వు చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పడం చిన్న మాట రుణ పడి ఉంటాను అని చెప్పడమే సరైన మాట అని దేవా చేతులు పట్టుకుంటాడు. దేవా చేతులు చూసుకొని ఆశ్చర్యంగా నిల్చొంటాడు. మిథున చాలా సంతోషపడుతుంది.


మిథున సంతోషంగా దేవా దగ్గరకు వచ్చి మనసు పట్టలేని అంత సంతోషంగా ఉందని చెప్పి దేవా భుజం మీద వాలిపోతుంది. ఆనందంతో ఏడుస్తూ నీ మీద మా నాన్నకి ఉన్న చెడు అభిప్రాయం చెరిపేయాలి అనుకున్నాను.. మా నాన్న నిన్ను అల్లుడిగా అంగీకరించాలని అనుకున్నాను.. గడువులో గెలుస్తానో లేదో అని భయంగా ఉన్నాను కానీ నేను గెలిచాను దేవా.. నువ్వే నన్ను గెలిపించావు. లవ్యూ దేవా అని దేవాని వాటేసుకుంటుంది. దేవా ఆశ్చర్యంగా చూస్తుంటాడు. తర్వాత మిథున తండ్రి దగ్గరకు వెళ్తుంది.


మిథున హరివర్ధన్తో ఎదుటి వారికి హాని చేయకుండా ఉండటం సాయం చేయడం మంచి అయితే ఆడపిల్ల జీవితం కాపాడటం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాలి అనుకున్న వాడు ఇంకెంత మంచోడు అయింటాడు నాన్న..తప్పు చేసిన వాళ్లు కూడా ఒప్పుకోరు అలాంటిది తప్పు చేయకుండా దేవా జైలుకి వెళ్లడానికి కూడా రెడీ అయిపోయాడు. ఆడపిల్ల నలుగురిలో నవ్వుల పాలు అవ్వకూడదు అని ఆలోచించి తన భవిష్యత్ కూడా ఆలోచించలేదు. ఆశ, అసూయ లేకపోతే అతన్ని దేవుడు అంటారు. మరి దేవా దేవుడే కదా నాన్న. ఒక ఆడపిల్ల కోసం ఇంత ఆలోచించిన దేవా తాళి కట్టిన భార్య గురించి ఇంకెంత ఆలోచిస్తాడు మీరే ఆలోచించండి.. రౌడీలు మామూలుగా ఎవరి గురించి ఆలోచించరు ఇలా తన గురించి ఆలోచించకుండా పక్కవారి గురించి ఆలోచించే దేవా రౌడీ ఎలా అవుతాడు.. దేవా గురించి ప్రత్యేకించి నేను మీకు నిరూపించాల్సిన అవసరం లేదు అనుకుంటా నాన్న అని మిథున వెళ్లిపోతుంది.


లలిత వచ్చి కరుడు కట్టిన నేరస్తులకే మారే అవకాశం ఇచ్చిన మీరు దేవాకి అవకాశం ఇవ్వలేరా. మిథునకు దేవాని దూరం చేయొద్దు అని చెప్తుంది. మరోవైపు కాంతం మిథున వైభోగం ఆస్తి అంతస్తు చూసి ఏడుస్తుంది. భర్తతో చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తుంది. లంకంత కొంప, పడవ లాంటి కారులు, పది మంది పనోళ్లు దేవాని జడ్జి అల్లుడిగా అంగీకరిస్తే మిథున వాటా దేవాకి వచ్చేసి దేవా కోటీశ్వరుడు అయిపోతాడని గుండె పగిలేలా కాంతం ఏడుస్తుంది. రంగం భార్యతో జడ్జి దేవాకి కృతజ్ఞత ఉన్నా దేవా రౌడీ కాబట్టి అల్లుడిగా ఒప్పుకునే ప్రసక్తే లేదని అంటాడు.


అర్ధరాత్రి మిథునని అలంకృత కంగారుగా లేపి కళ్ల మూసి హాల్లోకి తీసుకెళ్తుంది. హాల్మొత్తం డెకరేషన్ చేసి ఉంటారు. మిథున భర్త్డే కావడంతో అందరూ విష్ చేస్తారు. హరివర్ధన్ మిథునకు చిన్న గిఫ్ట్ అంటూ పడవంత కారు గిఫ్ట్ ఇస్తాడు. మిథున వద్దని చెప్పేస్తుంది. తనకు దేవా కావాలని అడుగుతుంది. త్రిపుర, రాహుల్లు దేవా దగ్గర ఐశ్వర్యం అవేమీ ఉండవు అని అంటారు. సంతోషం ఉంటుందని మిథున అంటుంది. కార్లు, బిల్డింగ్లు ఇవ్వని సంతోషం అపురూపమైన గిఫ్ట్ ఇస్తుందని దేవాని చూపిస్తుంది. ఇప్పటి వరకు ఏం అడగలేదు మొదటి సారి అడుగుతున్నా దేవాని ఇవ్వండి నాన్న అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.