Krishna Mukunda Murari October 14th: ఆదర్శ్ పేరు ఇంట్లో ఎత్తకుండా చేయడం కోసం ముకుంద పెద్ద కుట్ర చేస్తుంది. ఆ విషయం తెలుసుకున్న కృష్ణ ఎలాగైనా ఆదర్శ్ ని తిరిగి తీసుకురావాలని అనుకుంటుంది. తన కొడుకు ఇంటికి రావడానికి ఇష్టపడటం లేదని తెలుసుకున్న భవానీ గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అయితే కృష్ణ మాత్రం తనకి వారం రోజులు గడువు ఇవ్వమని ఎలాగైనా ఆదర్శ్ ని ఇంటికి తీసుకొస్తానని మాట ఇవ్వడంతో భవానీ మనసు కాస్త కుదుటపడుతుంది. కానీ ముకుంద చేసిన మోసం బయట పడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలో ఏముందంటే..


భవానీ ముకుంద చెంప పగలగొడుతుంది. ఎందుకు తన కొడుకు గురించి అబద్ధం చెప్పావని నిలదీస్తుంది. దీంతో ముకుంద కోపంగా ఆదర్శ్ అంటే ఇష్టం లేక చెప్పినట్టు కోపంగా చెప్పేస్తుంది. మరి అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నావని భవానీ గట్టిగా అడుగుతుంది. నా మనసు చచ్చినా నా ప్రేమ బతికే ఉంటుందని చేసుకున్నా


భవానీ: పెళ్లి అయినాక ప్రేమ ఏంటి?


Also Read: MD ( మై డార్లింగ్) - MH ( మై హార్ట్) అంటూ మురిసిపోయిన రిషిధార, శైలేంద్రకి ధరణి వార్నింగ్!


ముకుంద: వీళ్లందరూ మిమ్మల్ని మోసం చేస్తున్నట్టు నేను చేయలేను. అగ్రిమెంట్ మీద సంతకం చేసుకుని అగ్రిమెంట్ అయ్యాక విడిపోవాలని ఒప్పందం చేసుకుని కాపురం చేస్తున్నారు  అనేసరికి భవానీ షాకింగ్ గా చూస్తుంది. రేవతి, కృష్ణ నిజం ఎక్కడ బయట పడుతుందోనని టెన్షన్ పడుతూ కనిపిస్తారు. ఇదంతా కృష్ణ కల లేదంటే నిజంగా ముకుంద మురారీతో ప్రేమ గురించి చెప్పేసిందా తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.


నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..


భవానీ ఒంటరిగా కూర్చుని కృష్ణ ఇచ్చిన మాట గురించి ఆలోచిస్తు ఉంటుంది. ఎక్కడో బయట నుంచి వచ్చిన అమ్మాయి తనలాగే నిబ్బరంగా ఉంటుంది, కుటుంబం గురించి ఆలోచిస్తుందని కృష్ణని చూసి మురిసిపోతుంది. అటు కృష్ణ, రేవతి మురారీ ఏమైపోయాడు ఎక్కడికి వెళ్లారని మాట్లాడుకుంటూ ఉంటారు. భవానీ వచ్చి మురారీ గురించి అడుగుతుంది. ఏదో క్యాంప్ కి వెళ్ళి ఉంటారని చెప్పి కవర్ చేస్తారు. తర్వాత కృష్ణ తులసి కోటకి పూజ చేసి తిరిగి వస్తుంటే ముకుంద ఎదురుపడి తనతో వాదనకి దిగుతుంది. ఆదర్శ్ ఇక ఎప్పటికీ తిరిగి రాడని, మురారీది తనది ఒకటే మాట అంటూ మాట్లాడుతుంది. చిర్రె త్తుకొచ్చిన కృష్ణ ముకుందకి గట్టి వార్నింగ్ ఇస్తుంది.


Also Read: కళ్యాణ్ మాటలకి ఫీలైన అప్పు- భర్త ప్రేమకి మురిసిన కావ్య


పరాయి ఆడదాని భర్తని కోరుకుంటున్న ఆడదాన్ని ఏమనాలో అర్థం కావడం లేదని నీతి, నియమాలతో బతకమని గడ్డి పెడుతుంది. కాసేపటి తర్వాత కృష్ణ హాల్లో ఉండగా అక్కడ ముకుంద ఫోన్ రింగ్ అవుతూ కనిపిస్తుంది. తప్పని తెలిసినా కూడా ఈ టైమ్ లో విషయం ఏంటో తెలుసుకోవాలని అనుకుని కృష్ణ కాల్ లిఫ్ట్ చేస్తుంది. గీతిక లిఫ్ట్ చేసింది ముకుంద అనుకుని మాట్లాడుతుంది. సైనిక్ పురిలో మనం ఏర్పాటు చేసిన దొంగ మేజర్ ఇంకేమైనా అవకాశాలు ఉంటే ఇప్పించమని వెంట పడి చంపుతున్నాడు. అతను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవద్దని చెప్తుంది.


ఆ మాటలు విని కృష్ణ షాక్ అవుతుంది. అంటే ముకుంద కావాలని ఆదర్శ్ ఆచూకీ తెలియకుండా అడ్డుకుందని తన అనుమానమే నిజమైందని అనుకుంటుంది. వెంటనే మధుకర్ ని పిలిచి విషయం చెప్తుంది. పెద్దత్తయ్యని ముకుంద మోసం చేసింది, ఆదర్శ్ గురించి ఆచూకీ తెలియకుండా దొంగ మేజర్ ని పెట్టించి అబద్ధం చెప్పించిందని తెలిసి మధుకర్ కోపంగా అడుగుతానని అంటాడు. కానీ అది కాదు చేయాల్సింది ముందు ఆ దొంగ మేజర్ ఎవరో ఎలా ఉంటాడో కనుక్కుని విషయాలు ఆరా తీసిరమ్మని మధుని పంపిస్తుంది. కృష్ణ, మధుకర్ కలిసి ఏదో చేస్తున్నారని అలేఖ్య వచ్చి ముకుందకి చెప్తుంది. దీంతో వాళ్ళు ఏం చేస్తున్నారా అని టెన్షన్ పడుతుంది.