Kiraak RP about Nellore Peddareddy Chepala Pulusu: ఒకప్పుడు ‘జబర్దస్త్’ అనే కామెడీ షోలోకి కమెడియన్‌గా ఎంటర్ అయ్యి తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు కిరాక్ ఆర్పీ. ఇక కొన్నాళ్ల క్రితం నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు అనే కర్రీ పాయింట్‌ను పెట్టి బిజినెస్‌మ్యాన్‌గా సెటిల్ అయిపోయాడు. జబర్దస్త్‌లో ఉన్నంతకాలం ఆర్పీ చుట్టూ ఎక్కువగా కాంట్రవర్సీలు లేవు. కానీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ప్రారంభించిన తర్వాత నుండి చాలా కాంట్రవర్సీలు, విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ విమర్శలపై క్లారిటీ ఇవ్వడానికి ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశాడు ఆర్పీ. అందులో తన నెల్లూరు పెద్దారెడ్డి అనే పేరును కొందరు కించపరిచేలా మాట్లాడుతున్నారని వారిపై పరోక్షంగా ఫైర్ అయ్యాడు.


నెల్లూరు యాసపై అభిమానం..


ముందుగా తాను గోవింద మాలలో ఉన్నానని, తప్పుగా మాట్లాడితే క్షమించమని కోరాడు కిరాక్ ఆర్పీ. ‘‘ఒకప్పుడు యుద్ధం మొదలయితే రాజుకు, రాజుకు మధ్య సైనికుడు, సైనికుడికి మధ్య ఉండేది కానీ ఆడవారిపై అపవాదాలు, వివాదాలు తీసుకొచ్చిన చరిత్ర లేదు’’ అంటూ ముందుగా చరిత్రను గుర్తుచేసుకున్నాడు ఆర్పీ. ‘‘నాది నెల్లూరు అని గర్వంగా చెప్పుకోవడానికి కారణమేంటంటే.. నాకు నెల్లూరిపై హక్కు ఉంటుంది. ఆ యాసలో మాట్లాడే ధైర్యం ఉంటుంది. నెల్లూరులోనే పుట్టాను. డిగ్రీ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌కు వెళ్లి కమెడియన్ అవ్వాలనే మార్గాన్ని ఎంచుకున్నాను. అప్పుడు కూడా నా తల్లిలాంటి నెల్లూరు యాసను ఏ మాత్రం శృతిమించకుండా 450 స్కిట్స్ చేశాను. ఎన్నో షోల ద్వారా అందరూ గుర్తుపట్టగలిగే మనిషిని నేను’’ అంటూ నెల్లూరు, తన యాసపై ఉన్న అభిమానాన్ని బయటపెట్టాడు ఆర్పీ.


ఒక చరిత్ర సృష్టించాను..


‘‘రెండో విషయం ఏంటంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చరిత్ర సృష్టించింది. రెడ్ల పేర్లు పెట్టుకున్న వారికి నెల్లూరులో ఒక హుందాతనం ఉందనుకున్నా. ఒకడి వల్ల ఆ హుందాతనం నేను కోల్పోయాను. నెల్లూరు పెద్దారెడ్డి అంటే ఎవరయ్యా ఆ పెద్దారెడ్డి, ఎందుకు ఆ రెడ్డి పేరు పెట్టావు అని అంటున్నారు. దాంతో కొన్ని కోట్ల బిజినెస్ చేశాను, కోట్ల మందికి మార్గదర్శకం అయ్యాను. అయిదు కిలోమీటర్ల లైన్లు సృష్టించిన చరిత్ర కూడా ఈ కిరాక్ ఆర్పీదే. కమెడియన్‌గా ఒక అడుగు వేస్తే.. నెల్లూరు పెద్దారెడ్డితో ఒక స్థాయి చరిత్ర సృష్టించాను. నెల్లూరుకు మంచి పేరు తీసుకొచ్చిన వారిలో నాకు కూడా ఈ గడ్డ మీద ఒక సుస్థిరమైన చోటు ఉంది. అది కాదు అనడానికి ఎవరికీ వీలు లేదు’’ అని తన బిజినెస్‌పై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చాడు ఆర్పీ.


ఆ హక్కు నాకు ఉంది..


‘‘నెల్లూరులో ఆడవారు చేసే పురాతనమైన చేపల పులుసును నేను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుగా మార్చి ఒక అద్భుతం సృష్టించాను. ఈ ప్రపంచంలో ఉన్న తెలుగువాళ్లలో ఇది తెలియనివారు ఎవరూ ఉండరు. మీడియా సపోర్ట్‌తో కొన్ని కోట్ల వ్యూయర్‌షిప్ మూటగట్టుకున్న రికార్డ్ కిరాక్ ఆర్పీదే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నెల్లూరుకు ఇంత పేరు తీసుకొచ్చిన నాకు.. ఇక్కడ జరిగే ఏ కార్యక్రమంలో అయినా మాట్లాడే హక్కు ఉంది. బ్రహ్మనందం గారు పెద్దారెడ్డి అంటుండేవారు. కానీ ఎవరు ఈ పెద్దారెడ్డి అని తెలియదు. పెద్ద మనస్తత్వంతో బ్రతికేవాడినే పెద్దారెడ్డి అంటారు’’ అంటూ అసలు తన బిజినెస్‌కు పెద్దారెడ్డి అని పేరు ఎందుకు పెట్టాడో క్లారిటీ ఇచ్చాడు కిరాక్ ఆర్పీ.


Also Read: నేను యంగ్.. మహేష్ బాబుకు జోడీలా ఉంటా, తల్లిపాత్రలకు సరిపోను: కస్తూరి శంకర్