భర్త సత్యం పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది స్వప్న. వీళ్లిద్దరు వెళ్లేసరికి ఫంక్షన్‌కు వచ్చిన వాళ్లంతా చాలా ఆనందంతో ఆహ్వానిస్తారు. ఒక్క నిరుపమ్‌ మినహా ఎవరు శుభాకాంక్షలు చెప్పినా ఓర్చుకోలేకపోతుంది. తాను రావాల్సి వచ్చిందని... స్వప్న మారిందని అనుకోవద్దని మనసులో అనుకుటుంది. 


కారులో హుషారుగా జ్వాల ఫంక్షన్‌కు వస్తుంది. మధ్యలో పోలీసు చెకింగ్ జరుగుతుంది. జ్వాల దిగి తాను ఫంక్షన్‌కు వెళ్తున్నామని చెబుతుంది. ఇంతలో పోలీసులు కారు డిక్కీ తెరిచి చూస్తారు. అందులో దొంగనోట్లు, బంగారం అన్నీ ఉంటాయి. ఫంక్షన్‌లకు వెళ్లి ఇలా కొట్టేయడం వీళ్ల వృత్తి అని చెప్తారు పోలీసులు. పోలీసులు స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టి వెళ్లమని జ్వాలకు చెప్తారు. ఎంత చెప్పిన పోలీసులు వినిపించుకోరు... కచ్చితంగా స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టి వెళ్లమంటారు. 


ఇంతలో ఫంక్షన్ హాల్‌లో కేక్‌ కటింగ్ చేయమంటోంది సౌందర్య. జ్వాల వస్తుందేమో అని హిమ కంగారు పడుతుంది. వెళ్లిపోవాలనుకుంటుంది. ప్రేమ్‌ వద్దని వారిస్తాడు. నిరుపమ్‌ కూడా జ్వాల కోసం చూస్తుంటాడు. అందరూ హ్యాపీగానే ఉంటారు ఒక్క స్వప్న తప్ప. బలవంతంగా స్వప్నతో సత్యం కేక్ కటింగ్ చేయిస్తాడు. వీళ్లిద్దరి ఇలా కలిసి ఉంటే ఎంత బాగుందో అని మిగతా ఫ్యామిలీ మెంబర్స్ మనసుల్లో అనుకుంటారు. 


ఈ ఫంక్షన్‌కు తాను ఎలాంటి గిఫ్ట్ తీసుకురాలేదని... కానీ ఇప్పుడు అద్భుతమైన గిఫ్ట్ ఇస్తానంటుంది సౌందర్య. హిమ, నిరుపమ్‌కు పెళ్లి చేయాలని నిర్ణయించినట్టు సౌందర్య చెబుతుంది. అంతా చప్పట్లతో మారుమోగిస్తారు. స్వప్న మాత్రం గట్టిగా అరుస్తుంది. స్వప్న ఏదో అంటూ ఉంటే.. దీన్నే సర్‌ప్రైజెస్‌ అంటారని సౌందర్య సర్ధి చెబుతుంది. 


హిమను పిలిచి నిరుపమ్‌తో కలుపుతుంది సౌందర్య. ఇదంతా చూస్తున్న ప్రేమ్‌ కూడా ఆశ్చర్యపోతాడు. హిమ ప్రేమ సంగతి తలచుకొని ఒక్కసారిగా కుంగిపోతాడు. అదే వేదికపై నిశ్చితార్థం కూడా చేస్తానంటూ బాంబు పేలుస్తుంది. అక్కడే అందర్నీ ఆహ్వానిస్తుంది. 


ఫంక్షన్‌ అయిపోయిన తర్వాత నిరుపమ్‌ పెళ్లి ప్రకటనపై సౌందర్యను స్వప్న నిలదీస్తుంది. తెలివితేటలు ఏంటో సంసారం నాశనం చేసుకున్నప్పుడే నాకు అర్థమైందంటుంది సౌందర్య. నా గురించి నీకు తెలియదని స్వప్న గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. అందరి ముందు ఏదో నాలుగు మాటలు అంటే సరిపోదని... నీలా మాటలు చెప్పే రకం కాదని... ఏం చేస్తానో చూస్తూ ఉండని వార్నింగ్ ఇస్తుంది. గుడిలో ఎంగేజ్‌మెంట్‌ను జరుగుతుందని... దమ్ముంటే ఆపాలని సవాల్ చేస్తుంది సౌందర్య. తనను కాదని నిరుపమ్‌ ఎంగేజ్‌మెంట్‌ ఎలా చేస్తావో చూస్తానని ప్రతి సవాల్ చేస్తుంది స్వప్న. ఇద్దరి మధ్య చాలా సేపు వాదులాట కొనసాగుతుంది. ప్రపంచంలో ఎవరూ ఎంగేజ్‌మెంట్ ఆపలేరంటుంది సౌందర్య. చూద్దామంటే చూద్దామని స్వప్న, సౌందర్య మధ్య గట్టిగా వాగ్వాదం జరుగుతుంది. 


ఒంటరిగా నిరుపమ్‌, హిమ మాట్లాడుకుంటూ ఉంటారు. మనసులో మాట చెప్పడానికి ఇద్దరు పట్ట ఇబ్బందుల గురించి చర్చించుకుంటా ఉంటారు.