Jagadhatri Serial Today Episode: మాధురి బాబు కోసం జగధాత్రి, కేదార్‌, కౌషికి వెళ్లి సీసీ ఫుటేజ్ చూస్తారు. అక్కడ వారికి ఓ బామ్మ సంచులు తీసుకెళ్తూ అనుమానాస్పదంగా కనిపిస్తుంది. ఆ బామ్మ ఎందుకొచ్చింది. ఏం తీసుకెళ్లిందోనని జనరల్‌వార్డుకు వెళ్లి ధాత్రి తనిఖీ చేస్తుంది. సెక్యూరిటీని అడిగితే ఎవరిని కలవడానికి వచ్చిందో చెప్పలేదని చెబుతాడు. దీంతో ఖచ్చితంగా ఆ బామ్మే బాబును తీసుకెళ్లి ఉంటుందని అనుమానిస్తారు. పోలీసులకు విషయం చెబితే వాళ్లే చూసుకుంటారని కేదార్ అంటాడు. యువరాజు ఫోన్ చేయడంతో పోలీసులు సైతం అక్కడికి వస్తారు. ధాత్రి చూపించిన భామ్మ ఫొటో తీసుకుని ఎస్‌ఐ అన్నిస్టేషన్లకు పంపి డిటైల్స్‌ తెప్పిస్తామని చెబుతాడు. ఇంతలో వైజయంతి మా అమ్మాయిని డిశ్చార్చి చేస్తే ఇంటికి వెళతామని చెబుతుంది. దీంతో మాధురి నా బాబు దొరికే వరకు ఇంటికి రానని మొండికేస్తుంది. కౌషికిసహా అందరూ మధును సముదాయించేందుకు ప్రయత్నిస్తారు. కానీ మధు ఎవ్వరి మాట వినదు.ఇంతలో ధాత్రి కలుగజేసుకుని నీ బాబును నీ అప్పగించే పూచీ నాదని చెబుతుంది. దీంతో వారితో కలిసి మధు ఇంటికి వెళ్తుంది.             కేదార్ సాదు సార్‌తో మాట్లాడి ఈ కేసు  పర్సనల్‌గా తీసుకోవాలని చెబుతాడు. ఎలాంటి లీడ్‌ దొరికినా ముందు చెప్పాలని అడుగుతాడు. ఈ కేసును మీరే హ్యాండిల్‌ చేయమని చెప్పాడని ధాత్రికి కేదార్ చెబుతాడు. ఆస్పత్రి నుంచి  ఇంటికి వచ్చినప్పటి నుంచి మధు ఏం తినకపోవడంతో ఆమెకు నచ్చజెప్పి ధాత్రి, కేదార్ అన్నం తినిపిస్తారు. తెల్లారేసరికి బామ్మ అడ్రస్ దొరికిందంటూ రమ్య ఫోన్ చేయడంతో  కేదార్‌, జగధాత్రి రంగంలోకి దిగుతారు. బామ్మ తీసుకెళ్లిన బ్యాగ్‌లో ఏం ఉందో తెలుసుకుందాం పదా అంటూ కేదార్‌ను తీసుకుని ధాత్రి బయలుదేరుతుంది. బాబును అమ్మగా వచ్చిన డబ్బులు చూసుకుని బామ్మ మురిసిపోతుంటుంది. పెద్దింటి బిడ్డ కాబట్టి ఎక్కువ డబ్బులు ఇచ్చారని సంతోషపడుతుంది. ఇంతలో కేదార్‌, జగధాత్రి అక్కడికి చేరుకుంటారు.                  బామ్మ ఇంటి తలుపులు కొట్టగానే కంగారుపడి డబ్బులు దాచిపెట్టి వచ్చి తలుపు తీస్తుంది. ఎవరు మీరంటూ నిలదీస్తుంది. మీతో మాట్లాడాలంటూ కేడీ,జేడీ ఇంట్లోకి వస్తారు. తాము పోలీసులమని చెప్పగానే  బామ్మ భయపడుతుంది. ఆస్పత్రిలో ఓ పిల్లాడు కనిపించకుండా పోయాడని...ఆ కేసు గురించి మాట్లాడటానికి వచ్చామని చెబుతారు. ధాత్రి బామ్మను మాటల్లో దింపగా...కేదార్ ఇళ్లంతా వెతుకుతాడు. హాస్పటల్‌కు ఎందుకు వెళ్లారని అడిగితే మా అమ్మాయి రిపోర్ట్‌ చూపించడానికి వెళ్లానని అంటుంది.  ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పడంతో  ధాత్రి మరింతగా ప్రశ్నించి కంగారుపెట్టిస్తుంది. ఇంట్లో ఉయ్యాల ఉండటం, అందులో పాలబాటిల్ ఉండటంతో  ఎక్కడిదని కేదార్ అడుగుతాడు. మా అమ్మాయి బిడ్డదని బామ్మ అబద్ధం చెబుతుంది. ఆస్పత్రిలో మీ ఎడమచేతిలో ఉన్నబ్యాగ్‌ను ఎందుకు అంత జాగ్రత్తగా పట్టుకున్నారని....అందులో ఏముందని ధాత్రి మళ్లీ నిలదీస్తుంది. ఏమీ లేవని పండ్లు ఉన్నాయని చెబుతుంది. అయితే మీరు పెంచుకుంటున్న కూతురు ఇదే బస్తీలో ఉంటుందని చెప్పారు కదా...అక్కడికి వెళ్దాం రండని కేదార్ అంటాడు. ముగ్గురు కలిసి వెళ్తుండగా...ఓ యువతి పిల్లాడిని ఎత్తుకుని లోపలికివస్తుంది. మీరు చెప్పింది ఈ అమ్మాయి గురించేనా అని ధాత్రి అంటే అవునని బామ్మ అంటుంది. బామ్మ సైగ చేయడంతో వచ్చిన అమ్మాయి కూడా అబద్ధం చెబుతుంది.